ఒకే ఆత్మ, అనేక ఆత్మీయ వరాలు
క్రీస్తు ఇచ్చిన ఆత్మీయ వరాలు ఆయన శక్తి విగ్రహాల శక్తికంటే గొప్పదని చూపిస్తున్నాయి. తమ బోధకులు బోధించే సిద్ధాంతాలను బట్టి వారు దైవప్రేరణ పొందినవారో కాదో నిర్ణయించమని క్రైస్తవులను కోరుతున్నారు. ఆత్మీయ వరాలు ఎంత వైవిధ్యంగా ఉన్నా, అవి ఒకే పరిశుద్ధాత్మ నుండి వస్తాయి; క్రైస్తవ సంఘ సమష్టి మేలు అనే ఒకే లక్ష్యానికి ఉపయోగపడతాయి. దీనిని మానవ శరీరంతో, దాని అవయవాలతో పోల్చి వివరిస్తున్నారు.
క్రీ.శ. 57
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 12
1 సోదరీ సోదరులారా, ఆత్మవరాలను గూర్చి మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు. 2 పూర్వం మీరు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఎటుబడితే అటు కొట్టుకుపోతూ మూగవిగ్రహాలను ఆరాధించేవారని మీకు తెలుసు. 3 అందుచేత నేను మీతో చెప్పేదేమంటే, దేవుని ఆత్మ వలన మాట్లాడే వారెవరూ, “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు. అలాగే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరూ, “యేసే ప్రభువు” అని చెప్పలేరు.
4 దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన అనుగ్రహించే కృపావరాలు వేరు వేరు. 5 అలాగే ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు వేరు వేరు విధాలు. 6 వేరు వేరు కార్యాలు ఉన్నాయి గాని అందరిలో, అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. 7 అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కడికీ ఆత్మ తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. 8 ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకడికి బుద్ధి వాక్కు, ఒకడికి జ్ఞాన వాక్కు, 9 మరొకడికి విశ్వాసం, మరొకడికి స్వస్థత వరం ఇస్తాడు. 10 ఆ ఆత్మే ఒకడికి అద్భుతాలు చేసే శక్తి, మరొకడికి ప్రవచనాలు పలికే శక్తి, మరొకడికి ఆత్మలను గుర్తించే శక్తి, మరొకడికి వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్ధ్యం, మరొకడికి ఆ భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహిస్తున్నాడు. 11 ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు.
12 శరీరం ఒక్కటే, అందులో అనేక అవయవాలు ఉన్నాయి. అవన్నీ ఒకే శరీరంలో అవయవాలైనా శరీరం ఒకటే. క్రీస్తు కూడా అలానే ఉన్నాడు. 13 ఎలాగంటే, యూదులైనా, గ్రీకులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమంతా ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మలోనే బాప్తిసం పొందాం. మనమంతా ఒకే ఆత్మను పానం చేశాం. 14 శరీరం అంటే ఒక్క అవయవమే కాదు, అది అనేక అవయవాలతో ఉంది. 15 పాదం ‘నేను చేతిని కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. 16 అలాగే చెవి ‘నేను కన్ను కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. 17 శరీరమంతా ఒక్క కన్నే ఉంటే ఇక వినడం ఎలా? శరీరమంతా ఒక్క చెవే అయితే వాసన ఎలా చూడాలి?
18 అందుకే దేవుడు ప్రతి అవయవాన్నీ తన ఇష్టం ప్రకారం శరీరంలో ఉంచాడు. 19 అవన్నీ ఒకే అవయవం అయితే శరీరమేది? 20 అయితే ఇప్పుడు అవయవాలు అనేకం, శరీరం మాత్రం ఒక్కటే. 21 కాబట్టి కన్ను చేతితో, “నీవు నాకక్కర లేదు” అనీ, తల పాదాలతో, “మీరు నాకక్కర లేదు” అనీ చెప్పడానికి వీలు లేదు. 22 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు ఎక్కువ అవసరమైనవి.
23 శరీరంలో ఘనత లేనివని తలంచే అవయవాలను మరి ఎక్కువగా ఘనపరుస్తాం. అందం లేదని తలచే అవయవాలకు ఎక్కువ అందాన్ని కలిగిస్తాం. 24-25 అందమైన అవయవాలకు మరింత అందం అక్కర లేదు. ఆ విధంగా దేవుడు శరీరంలో వివాదాలు రాకుండా అవయవాలన్నీ ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహించేలాగా, తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగించి, శరీరాన్ని అమర్చాడు. 26 కాబట్టి ఒక అవయవం బాధపడితే మిగిలిన అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి. ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి. 27 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు.
28 దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు. 29 అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు. 30 అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు. 31 కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను.
ప్రేమ శ్రేష్ఠమైన ఆత్మీయ వరాలను మించినది
దేవుని ప్రేమపై ఆధారపడిన ప్రేమ శ్రేష్ఠమైన ఆత్మీయ వరాలకంటే మేలైనది.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 13
1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.
4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.
5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.
6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.
7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.
8 ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.
9 ఎందుకంటే మనకు కొంతవరకే తెలుసు. కొంతవరకే ప్రవచిస్తున్నాము. 10 అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి. 11 నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే తర్కించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్లచేష్టలు మానేశాను.
12 అలాగే ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు మసకగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసింది కొంత మాత్రమే. అప్పుడు దేవుడు నన్ను పూర్తిగా ఎరిగినంత మట్టుకు నేను కూడా పూర్తిగా తెలుసుకుంటాను.
13 ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ ఈ మూడూ నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే.