భాగం 3: నెహెమ్యా సంస్కరణ నుండి లేఖన సమాహారం ముగింపు వరకు

నెహెమ్యాకు మొదటిసారి అధికార బాధ్యతల అప్పగింత

క్రీ.పూ. 445

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నెహెమ్యా 1:1–2:11

1 హకల్యా కొడుకు నెహెమ్యా మాటలు.

నేను 20 వ సంవత్సరం కిస్లేవు నెలలో షూషను కోటలో ఉన్న సమయంలో 2 నా సోదరుల్లో హనానీ అనే ఒకడు, ఇంకా కొందరు యూదులు వచ్చారు. చెరలోకి రాకుండా తప్పించుకుని, అక్కడ మిగిలిపోయిన యూదుల గురించీ యెరూషలేమును గురించీ నేను వారిని అడిగాను.

3 అందుకు వారు “చెరలోకి రాకుండా తప్పించుకున్న వారు ఆ దేశంలో చాలా దురవస్థలో ఉన్నారు. నిందపాలు అవుతున్నారు. అంతేకాదు, యెరూషలేం కోట గోడ కూలిపోయింది. కోట తలుపులు కాలిపోయాయి” అని నాతో చెప్పారు.

4 ఈ మాటలు విన్న వెంటనే నేను కుప్పగూలిపోయి ఏడ్చి, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసం ఉన్నాను. ఆకాశంలో ఉన్న దేవునికి ఇలా విజ్ఞాపన చేశాను. 5 “ఆకాశంలో ఉన్న దేవా, యెహోవా, భీకరుడా, ఘన దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారిని నీవు కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుస్తావు. 6 నా ప్రార్థన విని, నీ కళ్ళు తెరచి నీ సన్నిధిలో రేయింబవళ్ళు నీ సేవకులైన ఇశ్రాయేలీయుల తరుపున నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు సంతతి దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేనూ నా వంశం అంతా పాపం చేశాం. 7 నీ ఎదుట ఎంతో అసహ్యంగా ప్రవర్తించాం. నీ సేవకుడు మోషే ద్వారా నీవు నియమించిన ఆజ్ఞలను గానీ చట్టాలను గానీ విధులను గానీ మేము పాటించలేదు. 8 నీ సేవకుడైన మోషేకు నీవు చెప్పిన మాట గుర్తు చేసుకో. ‘మీరు అపరాధం చేస్తే లోక జాతుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి వేస్తాను. 9 అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే భూమి నలుమూలలకూ మీరు చెదిరిపోయినా అక్కడ నుండి సైతం మిమ్మల్ని సమకూర్చి, నా నామం ఉంచాలని నేను ఏర్పరచుకున్న చోటికి మిమ్మల్ని తిరిగి తీసుకు వస్తాను’ అని చెప్పావు గదా.

10 మరి, నీవు నీ మహా బల ప్రభావాలతో, నీ బాహుబలంతో విడిపించిన నీ సేవకులైన నీ జనం వీరే గదా. 11 యెహోవా, దయచేసి విను. నీ దాసుడినైన నా మొరను, నీ నామాన్ని భయభక్తులతో ఘనపరచడంలో సంతోషించే నీ దాసుల మొరను ఆలకించు. ఈ రోజు నీ దాసుని ఆలోచన సఫలం చేసి, ఈ మనిషి నాపై దయ చూపేలా చెయ్యమని నిన్ను వేడుకుంటున్నాను.”

నేను రాజుకు పానపాత్ర అందించే ఉద్యోగిని.

2:1 తరవాత అర్తహషస్త రాజు పరిపాలన కాలంలో 20 వ సంవత్సరం నీసాను నెలలో రాజు ద్రాక్షారసం అడిగితే నేను అతనికి ద్రాక్షారసం అందించాను. అంతకుముందు నేనెప్పుడూ అతని సమక్షంలో విచారంగా కనిపించ లేదు.

2 రాజు నాతో “నీకు అనారోగ్యమేమీ లేదు గదా, నీ ముఖం విచారంగా ఉందేమిటి? నీకేదో మనోవేదన ఉన్నట్టుంది” అన్నాడు. నేను చాలా భయపడ్డాను. 3 అప్పుడు నేను “రాజు చిరకాలం జీవించాలి. నా పూర్వీకుల సమాధులున్న పట్టణం శిథిలమైపోయింది. దాని కోట తలుపులు తగలబడి పోయాయి. మరి నా ముఖం విచారంగా కాక ఇంకెలా ఉంటుంది?” అని రాజుతో అన్నాను. 4 అప్పుడు రాజు “నీకు ఏం కావాలి? నీ విన్నపం ఏమిటి?” అని అడిగాడు. నేను ఆకాశంలో ఉన్న దేవునికి ప్రార్థన చేసి 5 రాజుతో “మీకు సమంజసం అనిపిస్తే, మీ దృష్టిలో మీ సేవకుడినైన నేను యోగ్యుడినైతే నన్ను యూదా దేశానికి నా పూర్వికుల సమాధులున్న పట్టణానికి నన్ను పంపండి. దాన్ని నేను తిరిగి కట్టాలి” అని మనవి చేశాను.

6 అందుకు రాజు ఇలా అడిగాడు (ఆ సమయంలో రాణి తన పక్కనే కూర్చుని ఉంది). “అక్కడ ఎంతకాలం ఉంటావు? ఎప్పుడు తిరిగి వస్తావు?” నేను ఆ తేదీలు అతనికి చెప్పాను. అప్పుడు రాజు నన్ను పంపడానికి ఇష్టపడ్డాడు.

7 నేను రాజుతో ఇంకా ఇలా అన్నాను. “రాజు గారికి అభ్యంతరం లేకపోతే నేను యూదా దేశం చేరే దాకా నది అవతల ప్రాంతాల్లో ప్రయాణించడానికి అక్కడి అధికారులు నన్ను అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వండి. 8 రాజుగారి అడవులపై అధికారి అయిన ఆసాపుకు కూడా లేఖ రాసి ఇవ్వండి. యెరూషలేం ఆలయం దగ్గర ఉన్న కోట తలుపుల కోసం, కోట గోడ కోసం, నేను నివసించబోయే ఇంటి దూలాల కోసం అతడు కలప ఇవ్వాలి.”

దేవుని కరుణా హస్తం నాపై ఉన్నందువల్ల రాజు నా మనవి విన్నాడు.

9 తరువాత నేను నది అవతల ఉన్న అధికారుల దగ్గరకి చేరుకుని వారికి రాజుగారి ఆజ్ఞాపత్రాలు అందజేశాను. రాజు సేనాధిపతులను గుర్రపు రౌతులను నాతో పంపించాడు.

10 హోరోనీ జాతివాడు సన్బల్లటు, అమ్మోను జాతి వాడు టోబీయా అనే సేవకులు ఇదంతా విన్నారు. ఇశ్రాయేలీయులకు ఆసరాగా ఒకడు రావడం వారికి ఎంతమాత్రం నచ్చలేదు.

11 నేను యెరూషలేముకు వచ్చి మూడు రోజులు ఉన్నాను.