వివిధ చట్టాలు, నైతిక చట్టాలు, ఆచార సంబంధమైన చట్టాలు

క్రీ.పూ. 1490

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

లేవీకాండం 17–18

1 యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. 2 “నువ్వు అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ, ఇశ్రాయేలు సమాజమంతటితోనూ ఇలా చెప్పు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట 3 ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా బలి అర్పించడానికై ఒక ఎద్దుని గానీ, మేకని గానీ, గొర్రె పిల్లని గానీ పట్టుకుని శిబిరం లోపలైనా, బయటైనా చంపి, 4 దాన్ని యెహోవాకి అర్పించడానికి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి దాన్ని తీసుకు రాకపోతే అతడు రక్తం విషయంలో అపరాధి అవుతాడు. అతడు రక్తం చిందించాడు, కాబట్టి అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.

5 ఈ ఆదేశం వెనుక ఉన్న ఉద్దేశం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఇక పైన బలి అర్పించాలంటే బలి పశువులను ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవాకి శాంతిబలి అర్పణ చేయడానికి యాజకుని దగ్గరికి తీసుకురావాలి. 6 యాజకుడు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న యెహోవా బలిపీఠం పైన రక్తాన్ని చిమ్మాలి. యెహోవాకి కమ్మని సువాసన కలిగేట్టు కొవ్వుని దహించాలి.

7 ఏ విగ్రహాలకు వాళ్ళు ఇంతకు ముందు వేశ్యల్లా ప్రవర్తించారో ఆ మేక రూపంలో ఉన్న విగ్రహాలకు ఇంతకు ముందులాగా బలులు అర్పించకూడదు. ఇది వాళ్ళ రాబోయే తరాలన్నిటికీ శాశ్వతమైన చట్టం.

8 నువ్వు వాళ్లకి ఇంకా ఇలా చెప్పు. ఇశ్రాయేలు జాతి వాడైనా, మీతో కలసి నివసించే విదేశీయుడైనా దహనబలిని గానీ, మరింకేదైనా బలి అర్పణ గానీ చేసి 9 దాన్ని ప్రత్యక్ష గుడారం దగ్గరికి యెహోవాకు అర్పించడానికి తీసుకు రాకపోతే ఆ వ్యక్తిని ప్రజల్లో లేకుండా చేయాలి.

10 ఇశ్రాయేలు జాతి వాడైనా, మీతో కలసి నివసించే విదేశీయుడైనా ఏరక్తాన్ని ఆహారంగా తీసుకుంటే నేను అలాంటి వాడికి విరోధంగా ఉంటాను. రక్తాన్నైనా ఆహారంగా తీసుకునే వాణ్ణి మనుషుల్లో లేకుండా చేస్తాను. 11 ఒక జంతువుకి ప్రాణం దాని రక్తమే. మీ ప్రాణాల కోసం పరిహారం చేయడానికి నేను రక్తాన్ని ఇచ్చాను. ఎందుకంటే రక్తమే పరిహారం చేస్తుంది. ప్రాణానికి పరిహారం చేసేది రక్తమే.

12 కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైన మీలో ఎవరూ రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను. మీ మధ్య నివసించే ఏ విదేశీయుడూ రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను. 13 అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా లేదా మీ మధ్య నివసించే ఏ విదేశీయుడైనా తినదగిన జంతువునో, పక్షినో వేటాడి చంపితే దాని రక్తాన్ని పారబోసి మట్టితో కప్పాలి. ఎందుకంటే ప్రతి ప్రాణికీ దాని రక్తమూ, ప్రాణమూ ఒక్కటే. రక్తం, ప్రాణంతో కలసి ఉంటుంది.

14 కాబట్టి నేను ఇశ్రాయేలు ప్రజలకి ‘మీరు జంతువు రక్తాన్నీ ఆహారంగా తీసుకోకూడదు. ఎందుకంటే జీవులన్నిటికీ ప్రాణం వాటి రక్తంలోనే ఉంటుంది. దాన్ని తినేవాడు ప్రజల్లో లేకుండా తీసివేస్తాను’ అని ఆదేశించాను.

15 స్థానికుడైనా, మీ మధ్యలో నివసించే విదేశీయుడైనా చనిపోయిన జంతువునో లేదా మృగాలు చీల్చివేసిన జంతువునో ఆహారంగా తీసుకుంటే, అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు. 16 ఒకవేళ అతడు బట్టలు ఉతుక్కోకుండా, స్నానం చేయకుండా ఉంటే అపరాధిగా ఉండిపోతాడు.”

18:1 యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. 2 “నేను మీ దేవుడైన యెహోవాను అని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు. 3 మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పిస్తున్న కనాను దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. వారి మతాచారాలను అనుసరించ కూడదు.

4 మీరు నా విధులను పాటించాలి. నా చట్టాల ప్రకారం నడుచుకుంటూ వాటిని ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను. 5 మీరు నా చట్టాలను నా విధులను ఆచరించాలి. వాటిని పాటించే వాడు వాటి వలన జీవిస్తాడు. నేను యెహోవాను.

6 మీలో ఎవరూ తమ రక్తసంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నేను యెహోవాను.

7 నీ తండ్రికి గౌరవదాయకం గా ఉన్న నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు ఆమె నీ తల్లి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

8 నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలా చేసి నీ తండ్రిని అగౌరవ పరచకూడదు.

9 నీ సోదరితో అంటే ఇంట్లో పుట్టినా బయట పుట్టినా నీ తండ్రి కుమార్తెతోనైనా నీ తల్లి కుమార్తెతోనైనా లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

10 నీ కుమారుడి కుమార్తెతో గానీ కుమార్తె కుమార్తెతోగానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది నీ గౌరవమే.

11 నీ తండ్రికి పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సోదరి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

12 నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.

13 నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తల్లి రక్తసంబంధి.

14 నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా అతనిని అగౌరవ పరచ కూడదు. అంటే అతని భార్యను ఆ ఉద్దేశంతో సమీపించ కూడదు. ఆమె నీ పినతల్లి.

15 నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ కుమారుడి భార్య. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

16 నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకో కూడదు. అది నీ సోదరుని గౌరవం.

17 ఒక స్త్రీతోనూ ఆమె కూతురితోనూ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీకు లైంగిక సంబంధం ఉన్న స్త్రీ కుమారుడి కూతురుతోగానీ ఆమె కూతురు కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకునేందుకు వారిని చేర దీయకూడదు. వారు ఆమె రక్తసంబంధులు. అది దుర్మార్గం.

18 నీ భార్య బతికి ఉండగానే ఆమెను బాధించాలని ఆమె సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఆమెను పెళ్లాడకూడదు.

19 ఋతుస్రావం వలన స్త్రీ బయట ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

20 నీ పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని ఆమె మూలంగా అపవిత్రం కాకూడదు.

21 నీవు నీ సంతానాన్ని మోలెకు దేవుడి కోసం అగ్నిగుండంలో ఎంత మాత్రం అర్పించకూడదు. నీ దేవుని నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.

22 స్త్రీతో లైంగిక సంబంధం ఉన్నట్టు పురుషునితో ఉండకూడదు. అది అసహ్యం.

23 ఏ జంతువుతోనూ లైంగిక సంబంధం పెట్టుకుని దాని వలన అపవిత్రం కాకూడదు. ఏ స్త్రీ కూడా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది భ్రష్టత్వం.

24 వీటిలో దేనివలనా మీరు అపవిత్రులు కాకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ల గొట్టబోతున్న జాతులు ఇలాంటి పనులు చేసి భ్రష్టులయ్యారు. 25 ఆ దేశం అపవిత్రమై పోయింది. గనక నేను దానిపై దాని దోష శిక్షను విధిస్తున్నాను. ఆ దేశం తనలో నివసిస్తున్న వారిని బయటికి కక్కివేస్తున్నది.

26 కాబట్టి ఆ దేశంలో మీకంటే ముందు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం కక్కివేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని కక్కి వేయకుండేలా 27 మీరు గానీ మీలో నివసించే పరదేశి గాని యీ అసహ్యమైన క్రియల్లో దేన్నీ చేయకూడదు. 28 నా చట్టాలను, నా విధులను ఆచరించాలి.

29 అలాటి అసహ్యమైన పనుల్లో దేనినైనా చేసేవారు ప్రజల్లో లేకుండా పోతారు. 30 కాబట్టి మీకంటే ముందుగా అక్కడ నివసించిన వాళ్ళు పాటించిన అసహ్యమైన ఆచారాల్లో దేనినైనా పాటించి అపవిత్రులై పోకుండా నేను మీకు విధించిన నియమాలను అనుసరించి నడుచుకోవాలి. నేను మీ దేవుణ్ణి. యెహోవాను.”