మిర్యాము కుష్ఠురోగం

క్రీ.పూ. 1490

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సంఖ్యాకాండం 12:1–15

1 మోషే కూషు దేశానికి చెందిన ఒక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. అందుకని మిర్యాము, అహరోనులు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. 2 “యెహోవా కేవలం మోషేతోనే మాట్లాడాడా? మాతో ఆయన మాట్లాడలేదా?” అని చెప్పుకున్నారు. వాళ్ల మాటలు యెహోవా విన్నాడు. 3 మోషే ఎంతో సాధుగుణం గలవాడు. భూమిపైన ఉన్నవారందరిలో ఎంతో సాత్వికుడు.

4 వెంటనే యెహోవా మోషే, అహరోను, మిర్యాములతో మాట్లాడాడు. “మీరు ముగ్గురూ ఉన్న పళంగా సన్నిధి గుడారం దగ్గరకి రండి” అన్నాడు. ఆ ముగ్గురూ అక్కడికి వెళ్ళారు. 5 అప్పుడు యెహోవా మేఘస్తంభంలో దిగి వచ్చాడు. గుడారం ద్వారం దగ్గర నుండి అహరోను, మిర్యాములను పిలిచాడు. వారిద్దరూ అక్కడికి వెళ్ళారు.

6 యెహోవా ఇలా అన్నాడు.

“మీరు ఇప్పుడు నా మాటలు వినండి.

మీ మధ్య నా ప్రవక్త ఎవరన్నా ఉంటే, నేను అతనికి స్వప్నాల ద్వారా దర్శనం ఇస్తాను.

కలల ద్వారా అతనితో మాట్లాడతాను.

7 నా సేవకుడు మోషే అలాంటి వాడు కాదు.

అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు.

8 నేను అతనితో స్వప్నాల్లోనో, నిగూఢమైన రీతిలోనో మాట్లాడను.

ముఖాముఖీగా మాట్లాడతాను.

అతడు నా స్వరూపాన్ని చూస్తాడు.

అలాంటప్పుడు నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు?”

9 యెహోవా వారిపై తీవ్రంగా ఆగ్రహించి అక్కడనుండి వెళ్ళిపోయాడు. 10 గుడారం పైనుండి మేఘం పైకి వెళ్ళిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా మిర్యాముకు కుష్టు వ్యాధి సోకింది. ఆమె మంచులా తెల్లగా కన్పించింది. అహరోను ఆమెని చూశాడు. ఆమెకి కుష్టువ్యాధి ఉండడం చూశాడు.

11 అప్పుడు అహరోను మోషేతో ఇలా అన్నాడు. “అయ్యో నా ప్రభూ, మేము చేసిన పాపానికి శిక్ష మాకు వేయవద్దు. మేము తెలివి తక్కువగా మాట్లాడి పాపం చేశాం. 12 తన తల్లి గర్భంలోంచి బయటకి వచ్చేటప్పటికే సగం మాంసం పోగొట్టుకున్న మృతశిశువులా ఆమెని ఉండనీయకు.”

13 కాబట్టి మోషే యెహోవాకు మొర పెట్టాడు. “దేవా, దయచేసి ఈమెను బాగు చెయ్యి” అని ప్రార్ధించాడు. 14 అప్పుడు యెహోవా మోషేతో “ఆమె తండ్రి ఆమె ముఖంపై ఉమ్మి వేస్తే ఆ అవమానం ఆమె ఏడు రోజులు భరిస్తుంది కదా. ఆ ఏడు రోజులూ ఆమెని శిబిరం బయట ప్రత్యేకంగా ఉంచు. ఆ తరువాత ఆమెని తిరిగి శిబిరంలోకి తీసుకు రా” అన్నాడు. 15 కాబట్టి మిర్యాము ఏడు రోజులు శిబిరం బయటే గడిపింది. మిర్యాము తిరిగి శిబిరంలోకి వచ్చే వరకూ ప్రయాణం చేయకుండా ప్రజలు నిలిచిపోయారు.

పద్నాలుగవ ప్రయాణం: హజేరోతు నుండి రిత్మాకు

పద్నాలుగవ ప్రయాణం: హజేరోతు నుండి రిత్మాకు (సంఖ్యాకాండం 33:18), లేదా పారానుకు (సంఖ్యాకాండం 12:16), లేదా కాదేషు బర్నేయకు (సంఖ్యాకాండం 32:8).

సంఖ్యాకాండం 33:18

18 హజేరోతు నుండి రిత్మా వచ్చారు.

సంఖ్యాకాండం 12:16

16 ఆ తరువాత ప్రజలు హజేరోతు నుండి ప్రయాణం చేసి పారాను అరణ్యంలో ఆగారు.

గూఢచారులు పంపబడటం క్రీ.పూ. 1489

సంఖ్యాకాండం 13

1 ఆ తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. 2 నేను ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తున్న కనాను దేశాన్ని పరీక్షించడానికి కొంతమందిని పంపించు. తమ పూర్వీకుల గోత్రాల ప్రకారం ఒక్కో గోత్రం నుండి ఒక్కో వ్యక్తిని మీరు పంపించాలి. వారిల్లో ప్రతి వాడూ తమ ప్రజల్లో నాయకుడై ఉండాలి.

3 మోషే యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యేలా వారిని పారాను అరణ్యం నుండి పంపించాడు. వెళ్ళిన వారంతా ఇశ్రాయేలు ప్రజల్లో నాయకులు. 4 వారి పేర్లు ఇవి. రూబేను గోత్రం నుండి జక్కూరు కొడుకు షమ్మూయ, 5 షిమ్యోను గోత్రం నుండి హోరీ కొడుకు షాపాతు, 6 యూదా గోత్రం నుండి యెఫున్నె కొడుకు కాలేబు, 7 ఇశ్శాఖారు గోత్రం నుండి యోసేపు కొడుకు ఇగాలు. 8 ఎఫ్రాయిము గోత్రం నుండి నూను కుమారుడు హోషేయ.

9 బెన్యామీను గోత్రం నుండి రాఫు కొడుకు పల్తీ, 10 జెబూలూను గోత్రం నుండి సోరీ కొడుకు గదీయేలు, 11 యోసేపు గోత్రం నుండి అంటే మనష్షే గోత్రం నుండి సూసీ కొడుకు గదీ, 12 దాను గోత్రం నుండి గెమలి కొడుకు అమ్మీయేలు, 13 ఆషేరు గోత్రం నుండి మిఖాయేలు కొడుకు సెతూరు, 14 నఫ్తాలి గోత్రం నుండి వాపెసీ కొడుకు నహబీ, 15 గాదు గోత్రం నుండి మాకీ కొడుకు గెయువేలు. 16 ఆ దేశాన్ని పరీక్షించడానికి మోషే పంపిన వ్యక్తుల పేర్లు ఇవి. నూను కొడుకు హోషేయకి మోషే యెహోషువ అనే పేరు పెట్టాడు.

17 వారిని కనాను దేశాన్ని చూసి పరీక్షించడానికి మోషే పంపించాడు. అప్పుడు వాళ్లతో ఇలా చెప్పాడు. “మీరు దక్షిణం వైపు నుండి ప్రవేశించి పర్వత ప్రాంతంలోకి ఎక్కి వెళ్ళండి. 18 ఆ దేశం ఎలాంటిదో పరీక్షించండి. అక్కడ నివసించే ప్రజలను పరిశీలించండి. ఆ ప్రజలు బలవంతులా లేక బలహీనులా అన్నది చూడండి. అక్కడి ప్రజల జనాభా కొద్దిమందే ఉన్నారా లేక అధికంగా ఉన్నారా అనేది చూడండి. 19 వారు నివసించే నేల ఎలాంటిదో చూడండి. అది మంచిదా, చెడ్డదా? ఎలాంటి పట్టణాలు అక్కడ ఉన్నాయి? వారి నివాసాలు శిబిరాల్లా ఉన్నాయా లేక ప్రాకారాలున్న కోటల్లో నివసిస్తున్నారా? 20 అక్కడి భూమి లక్షణం ఎలాంటిదో చూడండి. అది సారవంతమైనదా లేక నిస్సారమైనదా? అక్కడ చెట్లు ఉన్నాయో లేవో చూడండి. ధైర్యంగా ఉండండి. అక్కడి భూమి మీద పండే ఉత్పత్తుల్లో ఏవైనా రకాలు తీసుకు రండి.” అది ద్రాక్ష పళ్ళు పక్వానికి వచ్చే కాలం.

21 కాబట్టి ఆ వ్యక్తులు బయల్దేరి వెళ్ళారు. వారు లెబో హమాతు అనే ప్రాంతానికి దగ్గరగా సీను అరణ్యం నుండి రెహోబు వరకూ వెళ్లి సంచారం చేశారు. 22 వారు దక్షిణం వైపు నుండి ప్రయాణం చేసి హెబ్రోనుకి వచ్చారు. అక్కడ అనాకు వంశం వారు అయిన అహీమాను, షేషయి, తల్మయి అనే తెగల ప్రజలు ఉన్నారు. ఆ హెబ్రోను పట్టణాన్ని ఐగుప్తులో ఉన్న సోయను పట్టణం కంటే ఏడేళ్ళు ముందుగా కట్టారు.

23 వారు ఎష్కోలు లోయ చేరుకున్నారు. అక్కడ ద్రాక్ష గుత్తులు ఉన్న ఒక కొమ్మను కోశారు. దాన్ని ఒక కర్రకి కట్టి ఇద్దరు వ్యక్తులు మోశారు. అక్కడనుంచే కొన్ని దానిమ్మ పళ్ళనూ కొన్ని అంజూరు పళ్ళనూ తీసుకు వచ్చారు. 24 ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాంతంలో కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ ప్రాంతానికి “ఎష్కోలు లోయ” అనే పేరు పెట్టారు.

25 వారు ఆ దేశంలో నలభై రోజుల పాటు సంచరించి, పరీక్షించి తిరిగి వచ్చారు. 26 పారాను అరణ్యంలో కాదేషులో ఉన్న మోషే అహరోనుల దగ్గరికీ, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరికీ వచ్చారు. ఆ దేశం గురించిన సమాచారం తెలియజేశారు. అలాగే తాము తెచ్చిన ఆ ప్రాంతం పళ్ళు చూపించారు.

27 వారు మోషేకి ఇలా చెప్పారు. “నువ్వు మమ్మల్ని పంపించిన దేశానికి మేము వెళ్లాం. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి అన్నది నిజమే. ఆ దేశం పళ్ళు ఇవి. 28 కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా బలవంతులు. అక్కడి పట్టణాలు పెద్దవి. అవన్నీ బ్రమ్హాండమైన ప్రాకారాలు ఉన్న పట్టణాలు. అక్కడ మేము అనాకు వంశం వారిని చూశాం. 29 దక్షిణ ప్రాంతంలో అమాలేకు ప్రజలు నివసిస్తున్నారు. కొండ ప్రాంతంలో హిత్తీ, యెబూసీ, అమోరీ తెగల వారు నివసిస్తున్నారు. ఇక సముద్రం సమీపంలోనూ, యొర్దాను నదీ ప్రాంతంలోనూ కనాను ప్రజలు నివసిస్తున్నారు.”

30 అప్పుడు కాలేబు మోషే చుట్టూ చేరిన జనాన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేశాడు. “మనం దానిపై దాడి చేసి స్వాధీనం చేసుకుందాం. దాన్ని జయించడానికి మనకున్న బలం సరిపోతుంది” అన్నాడు. 31 కాని అతనితో వెళ్ళిన మిగతా వారు “అక్కడి ప్రజలపై మనం దాడి చేయలేం. ఎందుకంటే వారు మనకన్నా బలవంతులు.” అన్నారు.

32 ఈ విధంగా వారు తాము వెళ్లి చూసి వచ్చిన ప్రాంతం గురించి ఇశ్రాయేలు ప్రజలకు నిరుత్సాహ పరిచే నివేదిక ఇచ్చారు. “మేము చూసి వచ్చిన ఆ దేశం తన నివాసుల్నే మింగివేసే దేశం. మేము చూసిన ప్రజలంతా ఆజానుబాహులు. 33 అక్కడ మేము నెఫీలీ ప్రజలను చూశాం. వారు అనాకు వంశం వాడైన నెఫీలీ తెగ వారు. వారి ఎదుట మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. వారి దృష్టికీ అలాగే ఉన్నాం” అన్నారు.