మరియ మాగ్నిఫికాట్ గీతం పాడడం
యూదయ కొండ ప్రాంతం
క్రీ.పూ. 7 లేదా 6
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
లూకా రాసిన సువార్త 1:46–56
1:46 అప్పుడు మరియ ఇలా అంది, “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది.
47 ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు.
48-49 నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది.
సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం.
50 ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది.
51 ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు. గర్విష్ఠులను, వారి అంతరంగంలోని ఆలోచనలను బట్టి చెదరగొట్టాడు.
52 బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు
53 ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు.
54-55 అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి,
వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు,
ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు.”
56 మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి, ఆ పైన తన ఇంటికి వెళ్ళిపోయింది.
యోహాను జననం, బాల్యం, అరణ్య జీవితం
బాప్తిసమిచ్చే యోహాను జననం, బాల్యం, అరణ్యంలో అతని జీవితం.
యూదయ కొండ ప్రాంతం. క్రీ.పూ. 7 లేదా 6
లూకా రాసిన సువార్త 1:57–80
1:57 ఎలీసబెతు నెలలు నిండి కొడుకుని కన్నది. 58 అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు, బంధువులు విని ఆమెతో కలిసి సంతోషించారు. 59 వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయబోతుండగా 60 తల్లి, “అలా కాదు. ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి” అంది. 61 అందుకు వారు, “నీ బంధువుల్లో ఆ పేరుగల వారెవరూ లేరు గదా” అని, 62 “వాడికి ఏ పేరు పెట్టాలి?” అని తండ్రిని సైగలతో అడిగారు. 63 అతడు పలక తెమ్మని, “బాబు పేరు యోహాను” అని రాశాడు. అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు. 64 వెంటనే అతని నోరు తెరుచుకుంది, నాలుక సడలి, అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు. 65 అది చూసి చుట్టుపక్కల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది. ఈ సమాచారం యూదయ మన్యంలో అంతటా చెప్పుకోసాగారు. 66 జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉండటం చూసి, “ఈ బిడ్డ ఎలాటి వాడవుతాడో!” అనుకున్నారు. 67 అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు,
68 “ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక.
ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు.
69 తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు.
70-73 మన శత్రువులబారి నుండీ మనలను ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణ నిచ్చాడు.
దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు.
ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను,
అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికీ ఈ విధంగా జరిగించాడు.
74-75 మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది,
పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో,
పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ,
భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే,
మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం.
76-78 ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు.
మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి,
వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా,
ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు.
79 మన పాదాలను శాంతి మార్గంలో
నడిపించేలా చీకటిలోను, చావు నీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది.
ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పై నుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేశాడు.”
80 ఆ బాలుడు ఎదిగి, ఆత్మలో బలం పుంజుకుంటూ, ఇశ్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు.