బలులకు సంబంధించిన చట్టాలు

క్రీ.పూ. 1490

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

లేవీకాండం 1–3

1 యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారం నుండి అతనితో ఇలా అన్నాడు. 2 “నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తేవాలంటే దాన్ని తన పశువుల్లో నుండి గానీ, మేకల, గొర్రెల మందల్లో నుండి గానీ తీసుకు రావాలి.

3 ఒకవేళ అతడు దహనబలిగా పశువుల్లో నుండి ఒక దాన్ని అర్పించాలనుకుంటే లోపం లేని మగ పశువును తీసుకు రావాలి. యెహోవా సమక్షంలో అది అంగీకారం పొందాలంటే దాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర అర్పించాలి. 4 దహనబలిగా అర్పించే పశువు తల మీద అతడు తన చెయ్యి ఉంచాలి. అప్పుడు అతనికి ప్రాయశ్చిత్తం కలగడానికి అతని పక్షంగా అది ఆమోదం పొందుతుంది.

5 తరువాత అతడు యెహోవా సమక్షంలో ఆ కోడె దూడని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు దాని రక్తాన్ని తీసుకు వచ్చి ప్రత్యక్ష గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉన్న బలిపీఠం పైన చిలకరిస్తారు. 6 తరువాత అతడు దహనబలి పశువు చర్మాన్ని ఒలిచి దాన్ని ముక్కలుగా కోయాలి.

7 తరువాత యాజకుడైన అహరోను కొడుకులు బలిపీఠం పైన కట్టెలు పేర్చి మంట పెట్టాలి. 8 అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు ఆ పశువు శరీర భాగాలనూ, తలనూ, కొవ్వునూ ఒక పద్ధతి ప్రకారం ఆ కట్టెలపైన పేర్చాలి. 9 కానీ దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని యెహోవా బలిపీఠం పైన దహనబలిగా దహించాలి. అప్పుడు అది నాకు కమ్మని సువాసననిస్తుంది.

10 గొర్రెల, మేకల మందల్లో నుండి దేనినైనా దహనబలిగా అర్పించాలనుకుంటే లోపం లేని పోతును తీసుకు రావాలి. 11 బలిపీఠం ఉత్తరం వైపు యెహోవా సమక్షంలో దాన్ని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం అన్ని వైపులా దాని రక్తాన్ని చిలకరించాలి.

12 అప్పుడు దాన్ని తలా, కొవ్వుతో పాటు ఏ భాగానికి ఆ భాగంగా ముక్కలు చేయాలి. తరువాత వాటిని బలిపీఠంపై ఉన్న మంటపై అమర్చిన కట్టెలపై ఒక పద్ధతిలో పేర్చాలి. 13 దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని బలిపీఠం పై దహించాలి. ఇది దహనబలి. ఇది యెహోవాకు కమ్మని సువాసన కలుగజేస్తుంది.

14 ఒక వ్యక్తి యెహోవాకు దహనబలిగా పక్షిని అర్పించాలనుకుంటే ఒక గువ్వని గానీ పావురం పిల్లని గానీ తీసుకురావాలి. 15 యాజకుడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకువచ్చి దాని తలను చేతితో తుంచివేయాలి. తరువాత దాన్ని బలిపీఠం పైన కాల్చాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కనే పిండాలి.

16 తరువాత దాని పొట్ట తీసివేసి బలిపీఠం తూర్పు వైపున బూడిద పోసే చోట పారెయ్యాలి. 17 అతడు దాని రెక్కల సందులో చీల్చాలి గానీ రెండు ముక్కలుగా చేయకూడదు. యాజకుడు దాన్ని బలిపీఠం పైన ఉన్న కట్టెలపై కాల్చాలి. ఇది దహనబలి, అంటే ఇది యెహోవాకు కమ్మని సువాసనను కలుగజేస్తుంది.”

2:1 ఎవరైనా ఒక వ్యక్తి యెహోవాకు ధాన్య నైవేద్యం అర్పించాలంటే ఆ అర్పణ సన్నని గోదుమ పిండి అయి ఉండాలి. అతడు దాని మీద నూనె పోసి, సాంబ్రాణి వేయాలి. 2 అతడు దాన్ని యాజకులైన అహరోను కొడుకుల దగ్గరికి తీసుకు రావాలి. అప్పుడు యాజకుడు తన చేతి నిండుగా నూనే, సాంబ్రాణీ కలిసిన సన్నని పిండిని తీసుకుంటాడు. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించడానికై ఆ అర్పణని బలిపీఠం పైన వేసి కాల్చాలి. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. 3 ఆ నైవేద్యంలో మిగిలింది అహరోనుకూ, అతని కొడుకులకూ చెందుతుంది. యెహోవాకి అర్పించే దహన బలులన్నిటిలో ఇది అతి పరిశుద్ధం.

4 మీరు పొయ్యిలో కాల్చిన నైవేద్యం అర్పించాలంటే పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె కలిపి చేసిన మెత్తని చపాతీ అయి ఉండాలి. లేదా సన్నని పిండితో, నూనె రాసి చేసిన అప్పడంలా గట్టిగా ఉండాలి. 5 ఒకవేళ నీ అర్పణ పెనం మీద కాల్చిన నైవేద్యమైతే అది పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె రాసి చేసినదై ఉండాలి.

6 అది నైవేద్యం, కాబట్టి దాన్ని నువ్వు ముక్కలు చేసి వాటి పైన నూనె పోయాలి. 7 ఒకవేళ నీ నైవేద్యం వంట పాత్రలో వండినదైతే దాన్ని సన్నని పిండీ, నూనే కలిపి తయారు చేయాలి.

8 ఈ పదార్ధాలతో చేసిన నైవేద్యాన్ని యెహోవా దగ్గరికి తీసుకురావాలి. దాన్ని యాజకుడికి అందించాలి. అతడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకు వస్తాడు. 9 తరువాత యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకోడానికి ఆ నైవేద్యంలో కొంత భాగం తీసుకుని బలిపీఠంపై దహించాలి. అది అగ్నితో చేసిన అర్పణ. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. 10 ఆ నైవేద్యంలో మిగిలిన భాగం అహరోనుకీ, అతని కొడుకులకీ చెందుతుంది. యెహోవాకి అర్పించే దహన బలులన్నిటిలో ఇది అతి పరిశుద్ధం.

11 మీరు యెహోవాకి సమర్పించే ఏ నైవేద్యం లోనూ పొంగజేసే పదార్ధం ఉండకూడదు. ఎందుకంటే తేనెనూ, పొంగజేసే పదార్ధం దేనినైనా నైవేద్యంగా బలిపీఠం పైన దహించకూడదు. 12 వాటిని ప్రథమఫలంగా యెహోవాకి సమర్పించవచ్చు. కానీ బలిపీఠం పైన కమ్మని సువాసన కలగజేయడానికి వాటిని వాడకూడదు. 13 నువ్వు అర్పించే ప్రతి నైవేద్యానికీ ఉప్పు కలపాలి. నీ దేవుని నిబంధన ఉప్పు లేకుండా నీ నైవేద్యం ఉండకూడదు. నీ నైవేద్యాలన్నిటితో పాటు ఉప్పు కూడా అర్పించాలి.

14 నువ్వు యెహోవాకి ప్రథమ ఫలం నైవేద్యాన్ని అర్పించాలంటే పచ్చని కంకుల్లోని కొత్త ధాన్యాన్ని వేయించి పిండి చేసి అర్పించాలి. 15 తరువాత దానిపై నూనె, సాంబ్రాణి పోయాలి. ఇదీ నైవేద్యమే. 16 తరువాత యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించడానికై పిండీ, నూనే, సాంబ్రాణిల్లో కొంత భాగం తీసుకుని వాటిని దహిస్తాడు. అది యెహోవా కోసం అగ్నితో చేసిన అర్పణ.

3:1 “ఎవరైనా ఒక మంద లోని పశువుల్లో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా అర్పించాలనుకుంటే, అతడు లోపం లేని దాన్ని యెహోవా సన్నిధిలో అర్పించాలి. 2 అతడు తాను అర్పించబోయే పశువు తలపై తన చేతిని ఉంచాలి. తరువాత ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర దాన్ని వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు.

3 అతడు ఆ పశువు లోపలి భాగాలకు అంటి ఉన్న కొవ్వునూ, మూత్రపిండాలనూ, వాటిపైన కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వునూ వేరు చేయాలి. 4 వాటిని యెహోవాకు శాంతి బలి అర్పణగా దహించాలి. 5 అహరోను కొడుకులు వాటిని బలిపీఠం మీద నిప్పులపై పేర్చిన కట్టెల పైన ఉన్న దహనబలి తో పాటు దహిస్తారు. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. అది అగ్నితో చేసిన అర్పణగా ఉంటుంది.

6 ఎవరైనా ఒక గొర్రెల లేక మేకల మందలో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా యెహోవాకు అర్పించదలిస్తే, అతడు లోపం లేని దాన్ని అర్పించాలి. 7 తన అర్పణ కోసం గొర్రె పిల్లని అర్పించాలనుకుంటే దాన్ని యెహోవా సన్నిధికి తీసుకుని రావాలి. 8 తాను అర్పించబోయే దాని తల మీద అతడు తన చేతినుంచాలి. తరువాత దాన్ని ప్రత్యక్ష గుడారం ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు.

9 ఆ వ్యక్తి శాంతిబలి అర్పణను దహనబలి అర్పణగా యెహోవాకు అర్పిస్తాడు. ఆ బలి పశువు కొవ్వునూ, వెన్నెముక చివర వరకూ ఉండే కొవ్వు పట్టిన తోకనంతా, దాని అంతర్భాగాలకి పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి. 10 అలాగే రెండు మూత్ర పిండాలనూ, వాటితో ఉన్న కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వునూ కూడా వేరు చేయాలి. 11 వీటన్నిటినీ యాజకుడు బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. ఇది యెహోవాకి అర్పించే దహనబలి.

12 అతడు అర్పించేది మేక అయితే దాన్ని యెహోవా ఎదుట అర్పించాలి. 13 ఆ వ్యక్తి దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం ఎదుట దాన్ని వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు. 14 తన అర్పణను దహనబలిగా యెహోవాకు అర్పిస్తాడు. అతడు దాని అంతర్భాగాలకు పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి.

15 అలాగే రెండు మూత్ర పిండాలనూ, వాటితో ఉన్న కొవ్వును, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వును కూడా వేరు చేయాలి. 16 వీటన్నిటినీ యాజకుడు కమ్మని సువాసన వచ్చేలా బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. కొవ్వు అంతా యెహోవాకే చెందుతుంది. 17 మీరు రక్తాన్ని గానీ కొవ్వుని గానీ తినకూడదు. మీరు నివాసముండే ప్రతిచోటా, మీ తరతరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం.”