కాలం 2: చెదరిపోయినప్పటి నుండి నిర్గమనం వరకు

భాగం 1: భాషలు తారుమారు కావడం, మానవజాతి చెదరిపోవడం

బాబెలు గోపురం

క్రీ.పూ. 2234

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆదికాండం 11:1–9

1 అప్పుడు భూమిపై అందరూ ఒకే భాష మాట్లాడేవారు. 2 వాళ్ళు తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు షీనారు ప్రాంతంలో వాళ్లకు ఒక మైదానం కనబడింది. వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు.

3 వాళ్ళు ఒకరితో ఒకరు “మనం ఇటుకలు తయారు చేసి, చక్కగా కాల్చుదాం రండి” అని మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులు ఇటుకలు, అతకడానికి తారు కీలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి. 4 వాళ్ళు “మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఉండేలా ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే శిఖరం ఉన్న ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి” అని మాట్లాడుకున్నారు.

5 యెహోవా ఆదాము సంతానం కట్టిన పట్టణాన్ని, గోపురాన్ని, చూడడానికి దిగి వచ్చాడు. 6 యెహోవా “ఇదిగో, ఒకే భాష ఉన్న ఈ మనుషులు పని చేయడం ప్రారంభించారు! ఇకముందు వాళ్ళు చెయ్యాలనుకున్న ఏ పనైనా వాళ్లకు అసాధ్యం కాదు. 7 కాబట్టి మనం కిందికి వెళ్లి, వాళ్ళల్లో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వాళ్ళ భాషను తారుమారు చేద్దాం రండి” అనుకున్నాడు.

8 ఆ విధంగా యెహోవా వారు అక్కడ నుంచి భూమి అంతటా చెదిరిపోయేలా చేశాడు. ఆ పట్టణ నిర్మాణం ఆగిపోయింది. 9 అందువల్ల దానికి బాబెలు అనే పేరు పెట్టారు. ఎందుకంటే, అక్కడ యెహోవా భూమి మీద ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేశాడు. అక్కడ నుంచి యెహోవా వాళ్ళను భూమి మీద అనేక ప్రదేశాలకు చెదరగొట్టాడు.

జాతుల పట్టిక

ఆదికాండం 10

1 నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు.

2 యాపెతు సంతానం గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు. 3 గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా. 4 యావాను సంతానం ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము. 5 వీళ్ళనుంచి సముద్రం వెంబడి మనుషులు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్ళారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం, ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు వేరైపోయారు.

6 హాము సంతానం కూషు, మిస్రాయిము, పూతు, కనాను. 7 కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు షేబ, దదాను.

8 కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు. 9 అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి “యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే” అనే నానుడి ఉంది. 10 షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టాణాలు.

11 ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవె, రహోబోతీరు, కాలహు పట్టణాలను, 12 నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టాణాన్నీ కట్టించాడు.

13 మిస్రాయిముకు లూదీ, అనామీ, లెహాబీ, నప్తుహీ, 14 పత్రుసీ, కస్లూహీ, కఫ్తోరీలు పుట్టారు. ఫిలిష్తీయులు కస్లూహీయుల సంతతి.

15 కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యెబూసీ, అమోరీయ, గిర్గాషీ, 16 హివ్వీ, అర్కీయు, సినీయ, 17 అర్వాదీయ, సెమారీయ, హమాతీలు పుట్టారు. 18 ఆ తరువాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి.

19 కనానీయుల సరిహద్దు సీదోను నుంచి గెరారుకు వెళ్ళే దారిలో గాజా వరకూ, సొదొమ గొమొర్రా, అద్మా సెబోయిములకు వెళ్ళే దారిలో లాషా వరకూ ఉంది. 20 వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం.

21 యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. ఏబెరు వంశానికి మూలపురుషుడు షేము. 22 షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. 23 అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాష.

24 అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు. 25 ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో ఒకడు పెలెగు. ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. రెండవవాడు యొక్తాను.

26 యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, 27 హదోరము, ఊజాలు, దిక్లా, 28 ఓబాలు, అబీమాయెలు, షేబ, 29 ఓఫీరు, హవీలా, యోబాబులు పుట్టారు.

30 వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్ళే దారిలో తూర్పు కొండలు. 31 వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ ప్రాంతాలను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు.

32 తమ తమ జనాల్లో తమ తమ సంతానాల ప్రకారం నోవహు కొడుకుల వంశాలు ఇవే. జలప్రళయం జరిగిన తరువాత వీళ్ళల్లోనుంచి జనాలు భూమి మీద వ్యాప్తి చెందారు.

షేము వంశావళి క్రీ.పూ. 2348

ఆదికాండం 11:10–26

10 షేము వంశావళి ఇది. షేముకు వంద సంవత్సరాల వయస్సులో, జలప్రళయం తరువాత రెండు సంవత్సరాలకు అర్పక్షదు పుట్టాడు. 11 షేముకు అర్పక్షదు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు ఐదు వందల సంవత్సరాలు బ్రతికాడు.

12 అర్పక్షదుకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు. 13 అర్పక్షదుకు షేలహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.

14 షేలహుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో ఏబెరు పుట్టాడు. 15 షేలహుకు ఏబెరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.

16 ఏబెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు. 17 ఏబెరుకు పెలెగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల ముప్ఫైసంవత్సరాలు బతికాడు.

18 పెలెగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో రయూ పుట్టాడు. 19 పెలెగుకు రయూ పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండువందల తొమ్మిది సంవత్సరాలు బతికాడు.

20 రయూకు ముప్ఫై రెండు సంవత్సరాల వయస్సులో సెరూగు పుట్టాడు. 21 రయూకు సెరూగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండు వందల ఏడు సంవత్సరాలు బతికాడు.

22 సెరూగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో నాహోరు పుట్టాడు. 23 సెరూగుకు నాహోరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు, అతడు రెండువందల సంవత్సరాలు బతికాడు.

24 నాహోరుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో తెరహు పుట్టాడు. 25 నాహోరుకు తెరహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నూట పంతొమ్మిది సంవత్సరాలు బతికాడు.

26 తెరహుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు.