భాగం 3: యెహోషువ చివరి హితబోధలు మరియు మరణం
క్రీ.పూ. 1443
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
43 యెహోవా ప్రమాణం చేసి ఇశ్రాయేలీయుల పూర్వీకులకిస్తానని చెప్పిన దేశమంతా ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. వాళ్ళు దాని స్వాధీనపరచుకుని దానిలో నివసించారు. 44 యెహోవా వారి పూర్వీకులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్నివైపులా వారికి విశ్రాంతి కలగచేశాడు. యెహోవా వారి శత్రువులందరిని వారికి అప్పగించాడు కాబట్టి వాళ్ళలో ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేకపోయారు. 45 యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పలేదు, అన్నీ నెరవేరాయి.
1 చుట్టూ ఉన్న వారి శత్రువుల నుండి యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగ చేసిన తరువాత చాలా రోజులకు యెహోషువ ముసలివాడై పోయాడు. 2 యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ వారి పెద్దలనూ వారి నాయకులనూ వారి న్యాయాధిపతులనూ వారి అధికారులనూ పిలిపించి వారితో ఇలా అన్నాడు, “నేను ముసలివాడినైపోయాను. 3 మీ దేవుడైన యెహోవా మీ కోసం ఈ రాజ్యాలన్నిటికీ చేసినదంతా మీరు చూశారు. మీ తరఫున యుద్ధం చేసింది మీ దేవుడు యెహోవాయే! 4 చూడండి, యొర్దాను నుండి పడమరగా మహాసముద్రం వరకూ నేను నాశనం చేసిన అన్ని రాజ్యాలతో పాటు, మీ గోత్రాల స్వాస్థ్యం మధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాన్ని మీకు చీట్లు వేసి పంచిపెట్టాను. 5 మీ దేవుడైన యెహోవాయే వారిని వెళ్ళగొడతాడు. ఆయనే వాళ్ళను పారదోలతాడు. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం మీరు వారి దేశాన్ని స్వాధీన పరచుకుంటారు. 6 కాబట్టి మీరు నిలకడగా ఉండి మోషే ధర్మశాస్త్రగ్రంథంలో రాసినదాన్నంతా పాటిస్తూ దాని ప్రకారం ప్రవర్తించండి. మనస్సు దృఢం చేసుకుని, దానినుండి ఎడమకు గాని కుడికి గాని తొలగిపోవద్దు. 7 మీ దగ్గర మిగిలి ఉన్న ఈ రాజ్యాలతో కలిసిపోవద్దు. వారి దేవుళ్ళ పేరులు ఎత్తవద్దు, వాటి తోడని ప్రమాణం చేయవద్దు, వాటిని పూజించవద్దు. వాటికి నమస్కరించవద్దు. 8 దానికి బదులు, మీరు యిప్పటి వరకూ ఉన్నట్టు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండండి. 9 బలీయమైన గొప్ప రాజ్యాలను యెహోవా మీ ముందు పారదోలాడు. ఇప్పటివరకూ మీముందు ఎవరూ నిలబడలేకపోతున్నారు. 10 మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటప్రకారం తానే మీ తరఫున యుద్ధం చేసేవాడు కాబట్టి మీలో ఒక్కడు వెయ్యిమందిని తరుముతాడు. 11 కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ ఉండడానికి శ్రద్ధ వహించండి. 12 అయితే మీరు వెనక్కి తగ్గి మీమధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాల ప్రజలతో ఏకమైపోయి వాళ్ళతో వియ్యమందుకుని, పరస్పర సంబంధాలు కలిగించుకుంటే 13 మీ దేవుడైన యెహోవా మీ దగ్గరనుండి ఈ రాజ్యాలను వెళ్ళగొట్టడం మానుకుంటాడని మీరు తెలుసుకోవాలి. దానికి బదులు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి ప్రదేశంలో ఉండకుండా మీరు నాశనమయ్యే వరకూ వారు మీకు ఉరిగా బోనుగా మీపక్కలో కొరడాలాగా మీ కళ్ళలో ముళ్లులాగా ఉంటారు.
14 ఇప్పుడు మనుషులందరిలాగే నేనూ పోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయంలో చేసిన వాగ్దానాల్లో ఒక్కటికూడా తప్పిపోలేదని మీ అందరి హృదయాలకూ మనసులకూ తెలుసు. అవన్నీ మీకు జరిగాయి. వాటిలో ఒక్కటికూడా తప్పిపోలేదు. 15 అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్నీ మీకు నెరవేరినట్టుగా మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపచేసే వరకూ యెహోవా మీ మీదికి కీడులన్నీ రప్పిస్తాడు. 16 మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి, ఇతర దేవుళ్ళను పూజించి వాటికి నమస్కరిస్తే యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది. ఆయన మీకిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండాా మీరు త్వరగా నాశనమవుతారు.”
24:1 యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటినీ షెకెంలో పోగుచేసి, వారి పెద్దలనూ అధికారులనూ న్యాయాధిపతులనూ నాయకులనూ పిలిపించినపుడు వారు దేవుని సన్నిధిలో హాజరయ్యారు. 2 యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు “ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు, మునుపు మీ పూర్వీకులు, అబ్రాహాము నాహోరుల తండ్రి తెరహు, యూఫ్రటీసు నది అవతల నివసించి, ఇతర దేవుళ్ళను పూజించేవారు.
3 అయితే నేను నది అవతల నుండి మీ పూర్వీకుడు అబ్రాహామును కనాను దేశానికి తీసుకొచ్చి, ఇస్సాకు ద్వారా అతని సంతానాన్ని విస్తరింపజేశాను. 4 ఇస్సాకుకు నేను యాకోబునూ ఏశావునూ ఇచ్చాను. శేయీరు కొండప్రాంతాలను స్వాధీనపరచుకొనేలా ఏశావుకిచ్చాను. అయితే యాకోబు అతని కుమారులు దిగువనున్న ఐగుప్తుకు వెళ్ళారు.
5 తరువాత నేను మోషే అహరోనులను పంపి, ఐగుప్తీయులను తెగుళ్ళతో బాధపెట్టి మిమ్మల్ని వెలుపలికి రప్పించాను. 6 నేను ఐగుప్తులోనుండి మీ పూర్వీకులను రప్పించినప్పుడు మీరు సముద్రం దగ్గరికి వచ్చారు. ఐగుప్తీయులు రథాలతో రౌతులతో వారిని ఎర్రసముద్రం వరకూ తరిమారు.
7 మీ పూర్వీకులు యెహోవాకు మొర్రపెడితే ఆయన మీకూ ఐగుప్తీయులకూ మధ్య చీకటి కలిగించాడు. సముద్రం వారి మీద పడి వారిని ముంచి వేసేలా చేశాడు. ఐగుప్తు దేశంలో నేను చేసిన దాన్ని మీరు కళ్ళారా చూశారు. తరువాత మీరు చాలా కాలం ఎడారిలో నివసించారు.
8 యొర్దాను అవతల ఉండే అమోరీయుల దేశానికి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను. వారు మీతో యుద్ధం చేశారు గానీ నేను వారిని మీ చేతికి అప్పగించాను. మీరు వారి దేశాన్ని స్వాధీనపరచుకున్నారు. వారిని మీ ముందే నాశనం చేశాను.
9 తరువాత సిప్పోరు కొడుకూ మోయాబు రాజు బాలాకూ బయలుదేరి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు. మిమ్మల్ని శపించడానికి బెయోరు కుమారుడు బిలామును పిలిపిస్తే 10 నేను బిలాము మాట వినలేదు. అయితే అతడు మిమ్మల్ని దీవించాడు. అతని చేతినుండి నేనే మిమ్మల్ని విడిపించాను. 11 మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చారు. అమోరీయులూ పెరిజ్జీయులూ కనానీయులూ హీత్తీయులూ గిర్గాషీయులూ హివ్వీయులూ యెబూసీయులతో కలిసి యెరికో అధికారులు మీతో యుద్ధం చేస్తే నేను వారిని మీ చేతికప్పగించాను.
12 నేను మీకు ముందుగా కందిరీగలను పంపాను. నీ కత్తి వల్ల నీ విల్లు వల్ల కాదు గాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేశాయి. 13 మీరు సేద్యం చేయని దేశాన్నీ మీరు కట్టని పట్టణాలనూ మీకిచ్చాను. మీరు వాటిలో నివసిస్తున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లనూ ఒలీవ తోటల పండ్లనూ తింటున్నారు.
14 కాబట్టి మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి, ఆయన్ని నిష్కపటంగా నమ్మకంగా సేవించండి. యూఫ్రటీసు నది అవతల ఐగుప్తులో మీ పూర్వీకులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవానే సేవించండి. 15 యెహోవాను సేవించడం మీ దృష్టికి చెడుగా ఉంటే మీరు ఎవర్ని సేవిస్తారో, నది అవతల మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను సేవిస్తారో, మీరు నివసిస్తున్నఅమోరీయుల ఈ దేశంలోని దేవుళ్ళను సేవిస్తారో ఈ రోజే కోరుకోండి. నేనూ నా ఇంటివాళ్ళూ యెహోవానే సేవిస్తాం” అన్నాడు.
16 అందుకు ప్రజలు ఇలా జవాబిచ్చారు. “యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను ఎన్నడూ సేవించం. 17 ఐగుప్తుదేశం నుండి, బానిసత్వపు ఇంట్లో నుండి మమ్మల్ని, మా పూర్వీకులను రప్పించి, మా కళ్ళముందు ఆ గొప్ప సూచక క్రియలను చేసి, మేము చేసిన ప్రయాణమంతా, మేము వచ్చిన ప్రాంతాల ప్రజలందరి మధ్య మమ్మల్ని కాపాడిన యెహోవాయే మా దేవుడు. 18 యెహోవా యీ దేశంలో నివసించిన అమోరీయులూ మిగతా ప్రజలందరినీ మా దగ్గరనుండి వెళ్ళగొట్టాడు. ఆయనే మా దేవుడు కాబట్టి మేము కూడా యెహోవానే సేవిస్తాం.”
19 అయితే యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు. “యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం గల దేవుడు, ఆయన మీ అపరాధాలనూ మీ పాపాలనూ క్షమించడు. మీరాయన్ని సేవించలేరు. 20 మీరు యెహోవాను విసర్జించి అన్యదేవుళ్ళను సేవిస్తే ఆయన తన మనస్సు తిప్పుకుని మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మీకు మేలు చేసిన తరువాత మిమ్మల్ని నాశనం చేస్తాడు.”
21 అప్పుడు ప్రజలు “అలా కాదు, మేము యెహోవానే సేవిస్తాం” అని యెహోషువతో అన్నారు. 22 అప్పుడు యెహోషువ “మీరు యెహోవానే సేవిస్తామని ఆయన్ని కోరుకున్నందుకు మీ గురించి మీరే సాక్షులు” అన్నాడు. వారు “మేమే సాక్షులం” అన్నారు. 23 అందుకతడు “అలాగైతే మీ మధ్య ఉన్న అన్యదేవుళ్ళను పారవేయండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు మీ హృదయాలను తిప్పుకోండి” అన్నాడు.
24 ప్రజలు “మన దేవుడైన యెహోవానే సేవిస్తాం, ఆయన మాటే వింటాం” అని యెహోషువతో చెప్పారు. 25 యెహోషువ ఆ రోజు ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెంలో కట్టడలనూ విధులనూ నియమించాడు. 26 దేవుని ధర్మశాస్త్రగ్రంథంలో ఈ మాటలు రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోషువ పరిశుద్ధస్థలం లో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలబెట్టాడు.
27 యెహోషువ ప్రజలందరితో “గమనించండి, యెహోషువ మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయి విన్నది. కాబట్టి అది మనమీద సాక్షిగా ఉంటుంది. మీరు మీ దేవుని విసర్జిస్తే అది మీ మీద సాక్షిగా ఉంటుంది” అన్నాడు. 28 అప్పుడు యెహోషువ ప్రజలను ఎవరి స్వాస్థ్యానికి వారిని పంపివేశాడు.
29 ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడు, యెహోవా సేవకుడు అయిన యెహోషువ 110 సంవత్సరాల వయసులో చనిపోయాడు. 30 అతడు స్వాస్థ్యంగా పొందిన ప్రాంతపు భూమి, తిమ్నత్సెరహులో వారతన్ని పాతిపెట్టారు. అది ఎఫ్రాయిమీయుల కొండప్రాంతంలోని గాయషు కొండకు ఉత్తరంగా ఉంది.
31 యెహోషువ బతికిన కాలమంతా, యెహోషువ తరువాత యింకా బతికి యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేసిన పనులన్నీ ఎరిగిన పెద్దల కాలమంతా ఇశ్రాయేలీయులు యెహోవాను సేవిస్తూ వచ్చారు.
32 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెంలో, అంటే యాకోబు వంద వెండి నాణేలిచ్చి షెకెం తండ్రి హమోరు కుమారుల దగ్గర కొన్న భూభాగంలో పాతిపెట్టారు. అది యోసేపు సంతానానికి స్వాస్థ్యం అయింది.
33 అహరోను కుమారుడు ఎలియాజరు చనిపోయినప్పుడు ఎఫ్రాయీమీయుల కొండప్రాంతంలో అతని కుమారుడు ఫీనెహాసుకు ఇచ్చిన గిబియాలో వారతన్ని పాతిపెట్టారు.