యోసేపుకు కేటాయించిన భాగం

క్రీ.పూ. 1444

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోషువా 16–17

1 యోసేపు సంతతి వారికి వచ్చిన వంతు యెరికో దగ్గర యొర్దాను నుండి 2 తూర్పున ఉన్న యెరికో నీటి ఊటలు వరకూ, యెరికో నుండి బేతేలు కొండ సీమ వరకూ ఉంది. 3 అది బేతేలు నుండి లూజు వరకూ పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకూ సాగి కింద బేత్‌హోరోను వరకూ గెజెరు వరకూ పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దు వరకూ వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం దగ్గర అంతం అయింది.

4 అక్కడ యోసేపు కుమారులు, మనష్షే ఎఫ్రాయిం సంతతి వారు స్వాస్థ్యాన్ని పొందారు. 5 ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అంటే వారి వంశాల ప్రకారం వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి ఎగువ బేత్‌ హోరోను వరకూ తూర్పుగా వ్యాపించింది. 6 వారి సరిహద్దు మిక్మెతాతు దగ్గర ఉన్న సముద్రం వరకూ పశ్చిమోత్తరంగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్ షిలోహు వరకూ తూర్పువైపుగా చుట్టూ తిరిగి యానోహా వరకూ తూర్పున దాని దాటి 7 యానోహా నుండి అతారోతు వరకూ, నారా వరకూ యెరికోకు తగిలి యొర్దాను దగ్గర అంతమయింది. 8 తప్పూయ మొదలు ఆ సరిహద్దు కానా వాగు వరకూ పశ్చిమంగా వ్యాపించింది. అది వారి వంశాల ప్రకారం ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం.

9 ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడ ఇవ్వబడిన పట్టణాలు పోతే ఆ పట్టణాలన్నీ వాటి పల్లెలు మనష్షీయుల స్వాస్థ్యంలో ఉన్నాయి. 10 అయితే గెజెరులో నివసించిన కనానీయులను వారు వెళ్ళగొట్ట లేదు. ఇప్పటి వరకూ ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ వారికి దాస్యం చేస్తూ ఉన్నారు.

17:1 మనష్షే యోసేపు పెద్ద కుమారుడు కాబట్టి అతని గోత్రానికి, అంటే మనష్షే పెద్ద కుమారుడు గిలాదు దేశాధిపతి అయిన మాకీరుకు చీట్ల వలన వంతు వచ్చింది. అతడు యుద్ధవీరుడు కాబట్టి అతనికి గిలాదు బాషాను వచ్చాయి. 2 మనష్షీయుల్లో మిగిలిన వారికి, అంటే అబీయెజెరీయులకూ హెలకీయులకూ అశ్రీయేలీయులకూ షెకెమీయులకూ హెపెరీయులకూ షెమీదీయులకూ వారి వారి వంశాల ప్రకారం వంతు వచ్చింది. వారి వంశాలను బట్టి యోసేపు కుమారుడు మనష్షే మగ సంతానమది.

3 మనష్షే మునిమనుమడూ మాకీరు ఇనుమనుమడూ గిలాదు మనుమడూ హెపెరు కుమారుడూ అయిన సెలోపెహాదుకు కూతుర్లే గాని కుమారులు పుట్టలేదు. అతని కూతుర్ల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. 4 వారు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ, ప్రధానుల దగ్గరికి వచ్చి “మా సోదరుల మధ్య మాకు స్వాస్థ్యమివ్వాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు” అని చెప్పారు. కాబట్టి, యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టుగా వారి తండ్రి సోదరులతో బాటు వారికి స్వాస్థ్యం ఇచ్చాడు.

5 కాబట్టి యొర్దాను అవతల ఉన్న గిలాదు బాషానులు కాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చాయి. 6 ఎందుకంటే మనష్షీయుల స్త్రీ సంతానం వారి పురుష సంతానం స్వాస్థ్యం పొందాయి. గిలాదు దేశం మిగతా మనష్షీయులకు స్వాస్థ్యం అయింది.

7 మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెముకు తూర్పుగా ఉన్న మిక్మెతావరకూ దక్షిణాన ఏన్తప్పూయ నివాసుల వైపుకు వ్యాపించింది. 8 తప్పూయ భూభాగం మనష్షీయులది. అయితే మనష్షీయుల సరిహద్దు లోని తప్పూయ పట్టణం ఎఫ్రాయిమీయులది అయింది.

9 ఆ సరిహద్దు కానా వాగు వరకూ ఆ వాగుకు వ్యాపించింది. వాగుకు దక్షిణాన ఉన్న మనష్షీయుల పట్టణాలు దగ్గరి ప్రాంతం ఎఫ్రాయిమీయులకు సంక్రమించింది. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ వాగుకు ఉత్తరంగా సముద్రం వరకూ వ్యాపించింది. 10 దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకు ఉత్తరభూమి మనష్షీయులకు వచ్చింది. సముద్రం వారి సరిహద్దు. ఉత్తరం వైపున అది ఆషేరీయుల సరిహద్దుకు, తూర్పు వైపున ఇశ్శాఖారీయుల సరిహద్దుకు అనుకుని ఉంది.

11 ఇశ్శాఖారీయుల ప్రదేశంలో ఆషేరీయుల ప్రదేశంలో బేత్ షెయాను, దాని గ్రామాలూ ఇబ్లెయాము, దాని గ్రామాలూ దోరు నివాసులు, దాని గ్రామాలూ ఏన్దోరు నివాసులు, దాని గ్రామాలూ తానాకు నివాసులు, దాని గ్రామాలూ మెగిద్దో నివాసులు, దాని గ్రామాలూ అంటే మూడు కొండల ప్రదేశం మనష్షీయులకు వచ్చింది. 12 కనానీయులు ఆ దేశంలో నివసించాలని గట్టిగా ప్రయత్నించారు కాబట్టి మనష్షీయులు ఆ పట్టణాలను స్వాధీనపరచుకోలేక పోయారు. 13 ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయులతో వెట్టిచాకిరి చేయించుకున్నారు కాని వారి దేశాన్ని మాత్రం పూర్తిగా స్వాధీనపరచుకోలేదు.

14 అప్పుడు యోసేపు వంశంవారు యెహోషువతో “మాకు ఒక్క చీటితో ఒక్క వంతే స్వాస్థ్యంగా ఇచ్చావేంటి? మేము గొప్ప జనం గదా? ఇంతవరకూ యెహోవా మమ్మల్ని దీవించాడు” అని మనవి చేశారు. 15 యెహోషువ వారితో “మీరు గొప్ప జనం కాబట్టి ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం మీకు ఇరుకుగా ఉంటే మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయులు రెఫాయీయులు ఉన్న ప్రదేశానికి వెళ్లి అడవి నరుక్కొని అక్కడ ఉండండి” అన్నాడు.

16 అందుకు యోసేపు వంశం వారు “ఆ కొండ ప్రాంతం మాకు చాలదు, లోయ ప్రాంతంలో ఉంటున్న కనానీయులందరికీ అంటే బేత్ షెయానులో, దాని గ్రామాల్లో యెజ్రెయేలు లోయలో ఉన్న వాళ్లకు ఇనుప రథాలు ఉన్నాయి” అన్నారు. 17 అప్పడు యెహోషువ యోసేపు సంతతి వారైన ఎఫ్రాయిమీయులను, మనష్షీయులను చూసి “మీరు ఒక గొప్ప జనం, 18 మీది గొప్ప బలం. మీకు ఒక్క వాటా మాత్రమే ఉండకూడదు. ఆ కొండ మీదే, అది అడవి కాబట్టి మీరు దాన్ని నరికి స్వాధీనం చేసుకోవాలి. కనానీయులకు ఇనుప రథాలున్నా, వాళ్ళు బలవంతులైనా మీరు వారిని వెళ్ళగొట్టగలరు” అన్నాడు.

ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టడం

యెహోషువా 18:1–10

1 ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్న తరువాత వారంతా షిలోహులో సమావేశమై అక్కడ ప్రత్యక్షపు గుడారం వేశారు. 2 ఇశ్రాయేలీయుల్లో స్వాస్థ్యం యింకా దొరకని ఏడు గోత్రాలు మిగిలాయి. 3 కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు. “మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్లకుండా ఎంతకాలం వ్యర్థంగా గడుపుతారు? 4 ఒక్కొక్క గోత్రానికి ముగ్గుర్ని మీరు నియమించుకుంటే నేను వారిని పంపిస్తాను. వారు బయలుదేరి దేశం అంతటాతిరుగుతూ వివిధ స్వాస్థ్యాల ప్రకారం దాని వివరాలను రాసి నా దగ్గరికి తీసుకురావాలి.

5 వాళ్ళు దాన్ని ఏడు భాగాలుగా చేయాలి. యూదా వారు దక్షిణం వైపు వారి భూభాగంలో ఉండిపోవాలి. యోసేపు వంశం వాళ్ళు ఉత్తరం వైపు తమ భూభాగంలో ఉండిపోవాలి. 6 మీరు ఏడు వంతులుగా దేశ వివరాన్ని రాసి నా దగ్గరికి తీసుకురావాలి. నేనిక్కడ మన దేవుడైన యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను.

7 లేవీయులకు మీ మధ్య ఏ వాటా ఉండదు. యెహోవాకు యాజకత్వం చేయడమే వారి స్వాస్థ్యం. గాదు, రూబేను, మనష్షే అర్థగోత్రం, యొర్దాను అవతల తూర్పువైపున స్వాస్థ్యాన్ని పొందారు.”

8 ఆ మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. దేశ వివరాలు రాయడానికి వెళ్తున్న వారితో యెహోషువ “మీరు వెళ్లి దేశమంతా తిరిగి దాని వివరం రాసి నా దగ్గరికి తిరిగి రండి, అప్పుడు నేను షిలోహులో యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను” అన్నాడు. 9 వారు వెళ్లి దేశమంతా తిరిగి ఏడు భాగాలుగా, పట్టణాల ప్రకారం వివరాలను పుస్తకంలో రాసి షిలోహు శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చారు.

10 వారి కోసం యెహోషువ షిలోహులో యెహోవా సమక్షంలో చీట్లు వేశాడు. వారి వాటాల ప్రకారం ఇశ్రాయేలీయులకు ఆ దేశాన్ని పంచిపెట్టాడు.