యోహాను రాసిన రెండవ పత్రిక

ఒక తల్లికీ ఆమె పిల్లలకూ యోహాను రాస్తున్నాడు

జ్ఞానవాదులలో ఒక శాఖకు చెందినవారిగా భావించబడుతున్న అబద్ధ బోధకుల ప్రలోభాల గురించి, హానికరమైన తప్పుడు బోధల గురించి ఒక క్రైస్తవ తల్లినీ ఆమె పిల్లలనూ హెచ్చరించడానికి యోహాను ఈ పత్రిక రాస్తున్నాడు.

క్రీ.శ. 96

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఒక తల్లికీ ఆమె పిల్లలకూ యోహాను అభివందనం

అభివందనం.

యోహాను రాసిన రెండవ పత్రిక 1:1–3

1 పెద్దనైన నేను ఎన్నికైన తల్లికీ, ఆమె పిల్లలకూ, నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తూ, రాస్తున్న సంగతులు. నేను మాత్రమే కాక సత్యాన్ని ఎరిగిన వారందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. 2 ఎందుకంటే మనలో సత్యం నిలిచి ఉంది, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. 3 తండ్రి అయిన దేవుని నుండీ, కుమారుడు యేసు క్రీస్తు నుండీ సత్యంలో, ప్రేమలో మనకు కృప, దయ, శాంతి తోడుగా ఉండు గాక.

ప్రేమలో నడుచుకోండి, మోసగాళ్లను తిరస్కరించండి

ఆమె పిల్లలలో కొందరు సువార్తలోని స్వచ్ఛమైన బోధల ప్రకారం జీవించడం చూసి తనకు కలిగిన ఆనందాన్ని యోహాను తెలియజేస్తున్నాడు. క్రైస్తవ ప్రేమ కలిగి ఉండాలని అతడు ఆమెను కోరుతున్నాడు. ఇది ఇంతకు ముందెన్నడూ ఇవ్వని ఆజ్ఞకు విధేయత చూపడం కాదు; ఆరంభం నుండే ఇవ్వబడి, అపొస్తలులు ఎల్లప్పుడూ ప్రకటించిన ఆజ్ఞకు విధేయత చూపడమే. దేవుని ఆజ్ఞలకు విధేయులై, వాటికి అనుగుణంగా జీవించడమే ఆయన పట్ల ప్రేమకు గొప్ప రుజువు. దేవుడు పంపినవానిని వారు విశ్వసించాలనేదే ఆ గొప్ప ఆజ్ఞ (యోహాను 6:29). వారి ప్రేమకూ విధేయతకూ సరైన ఉద్దేశాలు, సూత్రాలు ఉండేలా ఈ బోధలు ఆరంభం నుండే వారికి ప్రకటించబడ్డాయి. ఇప్పుడు వీటిని వారికి గుర్తుచేయడం మరీ అవసరం. ఎందుకంటే యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చాడనే విషయాన్ని నిరాకరిస్తూ, ఆయన మరణాన్నీ శ్రమలనూ వాస్తవాలు కాక కేవలం అలా కనిపించినవిగా భావించే మోసగాళ్లు అనేకులు లోకంలోకి వెళ్లారు. అలాంటి సిద్ధాంతాన్ని బోధించే ప్రతి బోధకుడూ యేసు క్రీస్తు ముందుగా చెప్పిన అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి (1 యోహాను 2:18). కాబట్టి ఎన్నుకోబడిన ఆ మహిళనూ ఆమె పిల్లలనూ వారి చేత మోసపోవద్దని యోహాను కోరుతున్నాడు. క్రీస్తూ ఆయన అపొస్తలులూ బోధించినవాటికి భిన్నమైన సిద్ధాంతాలను బోధిస్తూ దారితప్పేవారికి తండ్రియైన దేవునితో సహవాసం లేదు. అయితే ఈ బోధలలో నిలిచేవారికి తమ తండ్రియైన దేవునితోనూ, తమ రక్షకుడైన దేవుని కుమారునితోనూ సహవాసం ఉంటుంది. మానవుల కోసం క్రీస్తు శరీరధారిగా వచ్చి శ్రమపడ్డాడనే బోధను అంగీకరించని ఏ బోధకుణ్ణీ ఇంట్లోకి ఆహ్వానించకూడదు; అతనికి విజయం కలగాలని కోరుతూ అభివందనం చేయకూడదు. ఎందుకంటే అలాంటి వ్యక్తికి రక్షణనూ ప్రోత్సాహాన్నీ అందిస్తూ అతణ్ణి క్రైస్తవ సోదరునిగా చూసేవారు అతని పరిచర్యకు విశ్వసనీయత కల్పించి, అతడు చేసే హానిలో పాలుపంచుకుంటారు.

యోహాను రాసిన రెండవ పత్రిక 1:4–13

4 తండ్రి నుండి మనం పొందిన ఆజ్ఞ ప్రకారం మీ పిల్లల్లో కొందరు సత్యమార్గంలో ఉన్నారని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను. 5 అమ్మా, కొత్త ఆజ్ఞ మీకు రాసినట్టు కాదు, ఒకరిని ఒకరు ప్రేమించాలన్న ఆజ్ఞ ఆరంభం నుండి మనకు ఉన్నదాన్ని బట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 6 ఆయన ఆజ్ఞలను విధేయతతో పాటించడమే ప్రేమ. ఆరంభం నుండి మీరు విన్న ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.

7 యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకోని మోసగాళ్ళు చాలా మంది ఈ లోకంలో బయలుదేరారు. అలాటి వాడు వంచకుడు, క్రీస్తు విరోధి. 8 మనందరం పని చేసినందుకు రావలసినవి పోగొట్టుకోకుండా, సంపూర్ణ ప్రతిఫలం పొందేలా చూసుకోవాలి.

9 క్రీస్తు బోధలో నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగే ప్రతివాడూ దేవుడు లేనివాడు. ఈ బోధలో నిలిచి ఉండే వాడికి తండ్రి, కుమారుడు కూడా ఉన్నారు. 10 ఈ ఉపదేశం కాకుండా మరొక ఉపదేశంతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే, అతన్ని కుశల ప్రశ్నలు వేయవద్దు. మీ ఇంటికి ఆహ్వానించవద్దు. 11 అతన్ని పలకరించినవాడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడే.

12 ఇంకా ఎన్నో సంగతులు మీకు రాయాలని ఉంది. కాని కాగితం, సిరా వాడడం నాకు ఇష్టం లేదు. మన ఆనందం సంపూర్ణం అయ్యేలా మీ దగ్గరికి వచ్చి మీతో ముఖాముఖి మాట్లాడాలని ఆశగా ఉంది. 13 ఎన్నికైన మీ సోదరి పిల్లలు మీకు శుభాలు తెలుపుతున్నారు.

యోహాను రాసిన మూడవ పత్రిక

గాయికి యోహాను రాస్తున్నాడు

గాయి స్థిరమైన విశ్వాసాన్నీ, కొందరు క్రైస్తవ సోదరుల పట్ల, అపరిచితుల పట్ల అతడు చూపిన దయనూ ప్రశంసించడానికి, వారికి మళ్లీ రక్షణనూ దయనూ చూపమని అతణ్ణి కోరడానికి యోహాను ఈ పత్రికను గాయికి రాస్తున్నాడు. తన అధికారాన్ని నిరాకరించి, తన సూచనలకు అవిధేయత చూపిన దియోత్రెఫే ధిక్కారపూరిత అహంకారాన్ని గద్దించడానికీ, దాని విషయంలో గాయిని హెచ్చరించడానికీ అతడు రాస్తున్నాడు. అతడు దేమేత్రిని కూడా గాయి ఆదరణకు సిఫారసు చేస్తూ, సంఘం అనుసరించవలసిన ఆదర్శంగా ప్రశంసిస్తున్నాడు.

గాయిని ప్రశంసిస్తూ దియోత్రెఫేను గద్దిస్తున్న యోహాను

వృద్ధుడైన అపొస్తలుడు యోహాను, గాయిని ఎరిగిన వారందరికీ ప్రియుడూ, సత్యంలో యోహానుకు కూడా ప్రియుడూ అయిన గాయికి రాస్తున్నాడు. గాయి సుగుణాలకూ ఆధ్యాత్మిక ఎదుగుదలకూ తగినట్టుగా ఈ జీవితంలో అతని క్షేమమూ ఆరోగ్యమూ ఉండాలని, తద్వారా అతడు సంఘానికి ఆశీర్వాదకరంగా దీర్ఘకాలం జీవించాలని ప్రార్థిస్తున్నాడు. గాయి సువార్తలోని సత్యబోధల్లో నిలకడగా కొనసాగుతున్నాడని విని తనకు కలిగిన గొప్ప ఆనందాన్ని తెలియజేస్తున్నాడు. గాయి సహోదరుల పట్లా అపరిచితుల పట్లా నిజమైన విశ్వాసానికి తగినట్టు ప్రవర్తించాడు. వారు అతని క్రైస్తవ ప్రేమనూ దయనూ గురించి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చారు. దేవుని ఆత్మ అనుగ్రహించే దైవిక ప్రేమ సూత్రాన్ని అనుసరించి, దేవునికి తగిన రీతిలో వారికి రెండోసారి సహాయం చేయడం అతనికి మంచిది. ఎందుకంటే ఆ సహోదరులు క్రీస్తు నిమిత్తమూ యూదేతరులకు ఆయన సువార్తను ప్రకటించడానికీ బయలుదేరారు. తాము డబ్బు కోసం పనిచేస్తున్నామనే అనుమానం వల్ల తమ పరిచర్య ఫలితం తగ్గిపోకుండా ఉండేందుకు, తమ శ్రమకు ప్రతిఫలంగా ఏమీ తీసుకోలేదు. ఇంటి వద్ద ఉండేవారు, సువార్త నిమిత్తం తమ ఇళ్లను విడిచి సుదూర ప్రయాణాలు చేసే పనివారిని తమ ఇళ్లలోకి ఆహ్వానించాలి. అలా తమ కానుకల ద్వారా వారికి సహాయమూ ప్రోత్సాహమూ అందించి, వారితో జతపనివారు కావాలి. గాయి సభ్యుడిగా ఉన్న సంఘానికి యోహాను ఈ విషయమై ఒక ఉత్తరం రాశాడు. అయితే అహంకారంతో తనకే ప్రథమస్థానం కల్పించుకున్న దియోత్రెఫే, యోహాను అపొస్తల అధికారాన్ని తిరస్కరించాడు; ఆ ఉత్తరాన్ని సంఘానికి అందకుండా అడ్డుకుని ఉండే అవకాశమే ఎక్కువ. అతని పనులు సత్యానికీ క్రైస్తవ విశ్వాసానికీ ఆటంకమూ హానీ కలిగించాయి కాబట్టి, అతని పనులకు అతణ్ణి అందరి దృష్టినీ ఆకర్షించే రీతిలో శిక్షిస్తానని యోహాను హెచ్చరిస్తున్నాడు. దియోత్రెఫే అపొస్తలులపై అపనిందలు వేశాడు, వారి ఆదేశాలకు లోబడడానికి నిరాకరించాడు, సహోదరుల అవసరాలు తీర్చడం ద్వారా ఆ ఆదేశాలకు లోబడిన వారిని సంఘం నుంచి వెళ్లగొట్టాడు. దియోత్రెఫే మాదిరిని అనుసరించకుండా మంచిని అనుకరించాలని యోహాను వారిని కోరుతున్నాడు. అలా చేసేవారు దేవుని మూలంగా పుట్టినవారని వారు తెలుసుకోవాలి. దీనికి భిన్నంగా, తన క్రైస్తవ సద్గుణాలకూ సత్ప్రవర్తనకూ అందరి ప్రశంసలూ, సువార్త సాక్ష్యమూ, యోహాను సాక్ష్యమూ పొందిన దేమేత్రి మాదిరిని అతడు మెచ్చుకుంటున్నాడు. యోహాను సాక్ష్యం సత్యమైనదనీ పక్షపాతం లేనిదనీ వారికి తెలుసు. ఈ విషయాల గురించి మరింత వివరంగా రాయకపోవడానికి మన్నింపు కోరుతూ, త్వరలో గాయిని చూడాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలియజేస్తున్నాడు. తన ఆశీర్వాదాలనూ అభివందనాలనూ అందిస్తున్నాడు.

యోహాను రాసిన మూడవ పత్రిక 1

1 ప్రియమైన గాయికి, పెద్దనైన నేను యథార్థమైన ప్రేమతో రాస్తున్నది. 2 ప్రియ సోదరా, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నట్టుగానే అన్ని విషయాల్లో వర్ధిల్లాలనీ, ఆరోగ్యవంతుడివిగా ఉండాలనీ నేను ప్రార్ధిస్తున్నాను.

3 నీవు ఎప్పుడూ నడుస్తున్నట్టే సత్యమార్గంలో నడచుకొంటున్నావని నీ గురించి కొందరు సోదరులు వచ్చి చెప్పగా విని చాలా సంతోషించాను. 4 నా పిల్లలు సత్యమార్గంలో నడుచుకుంటున్నారని తెలుసుకోవడం కన్నా నాకు గొప్ప సంతోషం మరేదీ లేదు.

5 ప్రియ సోదరా, నీవు సోదరుల కోసం అపరిచితుల కోసం చేస్తున్నది నమ్మకంగా చేస్తున్నావు. 6 వారు సంఘం ఎదుట నీ ప్రేమను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి తగినట్టుగా వారి ముందున్న ప్రయాణానికి తోడ్పాటు ఇచ్చి పంపించు. 7 వారు దేవుని నామం కోసం వెళ్తున్నారు. యూదేతరుల నుండి వారు ఏమీ తీసుకోవడం లేదు. 8 కాబట్టి మనం సత్యం విషయంలో జత పనివారమయ్యేలా వారిని స్వీకరించాలి.

9 అక్కడి సంఘానికి నేను రాశాను గాని, వారిలో గొప్పవాడుగా ఉండాలని కోరుకొనే దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించడం లేదు. 10 కాబట్టి, నేను అక్కడికి వచ్చినప్పుడు అతడు చేసిన పనులు, మా విషయంలో మాట్లాడిన చెడ్డ మాటలు గుర్తు చేసుకుంటాను. అంతే కాదు, తాను స్వయంగా సోదరులను ఆహ్వానించడు, ఆహ్వానించిన వారిని కూడా అడ్డగించి, సంఘంలో నుండి వెళ్ళగొడుతున్నాడు. 11 ప్రియ సోదరా, చెడునుగాక మంచినే అనుకరించు. మంచి జరిగించేవాడు దైవ సంబంధి. చెడు జరిగించేవాడు దేవుణ్ణి చూడలేదు.

12 దేమేత్రి గురించి అందరూ మంచి సాక్ష్యం చెప్పారు. సత్యం విషయంలో అతడు మంచి సాక్ష్యం పొందాడు. మేము కూడా మంచి సాక్ష్యం ఇస్తున్నాం. మా సాక్ష్యం సత్యం అని నీకు తెలుసు. 13 ఇంకా చాలా సంగతులు నీకు రాయాలనుకున్నాను గాని కలంతో, సిరాతో రాయడం నాకు ఇష్టం లేదు. 14 కానీ నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. అప్పుడు మనం ముఖాముఖీ మాట్లాడుకుందాం.

15 నీకు శాంతి కలుగు గాక. స్నేహితులు నీకు అభివందనాలు చెబుతున్నారు. అక్కడి స్నేహితులకు పేరు పేరునా మా అభివందనాలు తెలియజెయ్యి.