మొత్తం వాదానికి యోబు సమాధానం (continued)

క్రీ.పూ. 2130

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోబు 13–14

1 ఇదిగో వినండి, నా కళ్ళకు ఇదంతా కనబడింది, నా చెవులకు అంతా వినబడింది,

2 మీకు తెలిసిన విషయాలన్నీ నాక్కూడా తెలుసు. నాకున్న జ్ఞానం కంటే మీకున్న జ్ఞానం ఎక్కువేమీ కాదు.

3 నేను సర్వశక్తుడైన దేవునితోనే మాట్లాడాలని చూస్తున్నాను. ఆయనతోనే నేను వాదిస్తాను.

4 మీరంతా అబద్ధాలు కల్పించి చెబుతారు. మీరు ఎందుకూ పనికిరాని వైద్యుల వంటివారు.

5 మీరేమీ మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అదే మీకు ఉత్తమం.

6 దయచేసి నేను చెప్పేది వినండి. నా పక్షంగా నేను చేసుకుంటున్న వాదన ఆలకించండి.

7 మీరు దేవుని పక్షంగా నిలబడి అన్యాయంగా వాదించ వచ్చా? ఆయన తరపున వంచన మాటలు పలక వచ్చా?

8 ఆయన పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తారా? మీరు దేవుని పక్షాన నిలబడి వాదిస్తారా?

9 ఒకవేళ ఆయన మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు క్షేమకరమా? ఒకడు ఇతరులను మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేస్తారా?

10 మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన తప్పకుండా మిమ్మల్ని గద్దిస్తాడు.

11 ఆయన ప్రభావం మీకు భయం కలిగించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా?

12 మీరు చెప్పే గద్దింపు మాటలు బూడిదలాంటి సామెతలు. మీరు చేస్తున్న వాదాలు మట్టిగోడలవంటివి.

13 నా జోలికి రాకుండా మౌనంగా ఉండండి. నేను చెప్పేది వినండి. నాకు ఏమి జరగాలని ఉందో అదే జరుగు గాక.

14 నా ప్రాణాన్ని నేనే ఎరగా ఎందుకు చేసుకోవాలి? నా ప్రాణానికి తెగించి మాట్లాడతాను.

15 వినండి, ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసం ఆశతో ఎదురుచూస్తున్నాను. ఆయన సమక్షంలో నా న్యాయ ప్రవర్తనను రుజువు పరుచుకుంటాను.

16 దీని వల్ల నాకు విడుదల చేకూరుతుంది. భక్తిహీనుడు ఆయన సమక్షంలో నిలవడానికి సాహసం చెయ్యడు.

17 నా సాక్షం జాగ్రత్తగా వినండి. నేను చేసే ప్రమాణాలు మీ చెవుల్లో మారుమ్రోగనియ్యండి.

18 ఆలోచించండి, నేను నా వివాదాన్ని చక్కబరచుకున్నాను. నేను నిర్దోషిగా తీర్చబడతానని నాకు తెలుసు.

19 నాతో వాదం పెట్టుకుని గెలవ గలిగేవాడు ఎవరు? ఎవరైనా ఎదుటికి వస్తే నేను నోరు మూసుకుని ప్రాణం విడిచిపెడతాను.

20 దేవా, ఈ రెండు విషయాలు నా పక్షంగా జరిగించు. అప్పుడు నేను దాక్కోకుండా నీ ఎదుట కనపడతాను.

21 నీ బలమైన చెయ్యి నా మీద నుండి తొలగించు. నీ భయం వల్ల నేను బెదిరిపోయేలా చెయ్యకు.

22 అప్పుడు నువ్వు పిలిస్తే నేను పలుకుతాను. లేదా నేను పిలుస్తాను, నాకు జవాబు చెప్పు.

23 నేను చేసిన దోషాలు ఎన్ని? నేను చేసిన పాపాలు ఎన్ని? నా అపరాధాలు, నా పాపాలు నాకు తెలియబరచు.

24 నీ ముఖాన్ని నాకు చాటు చేసుకుంటున్నావెందుకు? నన్నెందుకు నీ శత్రువుగా భావిస్తున్నావు?

25 అటూ ఇటూ కొట్టుకుపోయే ఆకులాంటి నన్ను భయపెడతావా? ఎండిపోయిన చెత్త వెంటబడతావా?

26 నువ్వు నాకు కఠినమైన శిక్ష విధించావు. నేను చిన్నతనంలో చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించేలా చేశావు.

27 నా కాళ్ళకు బొండ వేసి బిగించావు. నా నడవడి అంతా నువ్వు కనిపెడుతున్నావు. నా అడుగులకు నువ్వే గిరి గీశావు.

28 కుళ్ళిపోయిన శవంలాగా ఉన్నవాడి చుట్టూ, చిమ్మటలు తినివేసిన గుడ్డపేలికలాంటివాడి చుట్టూ గిరి గీసి కాపు కాస్తున్నావు.

14:1 స్త్రీ కడుపున పుట్టిన మనిషి కొన్ని రోజులపాటు జీవిస్తాడు. అతడు తన జీవిత కాలమంతా కష్టాలు అనుభవిస్తాడు.

2 అతడు పువ్వులాగా పెరిగి వికసిస్తాడు. అంతలోనే వాడిపోతాడు. నీడ కనబడకుండా పోయినట్టు వాడు పారిపోతాడు.

3 అలాంటి వాడిని నువ్వు పట్టించుకుంటున్నావా? నాకు తీర్పు తీర్చడానికి నీ ఎదుటికి రప్పించుకుంటావా?

4 అపవిత్రమైన వ్యక్తికి పవిత్రుడైనవాడు పుట్టగలిగితే ఎంత మేలు? కానీ ఆ విధంగా ఎన్నడూ జరగదు.

5 మనిషి ఎంతకాలం బ్రతకాలో దానికి పరిమితి నువ్వే నియమిస్తావు. అతడు ఎన్ని నెలలు జీవిస్తాడో నీకు తెలుసు.

6 అతడి వైపు నుంచి నీ దృష్టి మరల్చుకో. కూలిపని వాడిలాగా తనకు నియమింపబడిన పని పూర్తి చేసేదాకా అతని వైపు చూడకు.

7 చెట్టును నరికి వేస్తే అది తిరిగి చిగురు వేస్తుందనీ, లేత కొమ్మలు తిరిగి మొలకెత్తుతాయనీ ఆశాభావం ఉంటుంది.

8 నరికేసిన చెట్టు వేరు భూమిలో కుళ్లిపోయి, దాని మొదలు మట్టిలో చీకిపోతూ ఉంటుంది.

9 అయితే దానికి నీటి వాసన తగిలినప్పుడు అది చిగురు వేస్తుంది, లేత మొక్కలాగా కొత్తగా కొమ్మలు కాస్తుంది.

10 అయితే మనుషులు చనిపోయినప్పుడు కదలకుండా పడి ఉంటారు. మనుషులు ప్రాణం విడిచిన తరువాత వాళ్ళు ఏమైపోతారు?

11 సముద్రంలో నీళ్ళు ఎలా ఇంకిపోతాయో, నదిలో నీళ్ళు ఎలా ఆవిరైపోతాయో అలాగే మనుషులు చనిపోయి ఇక తిరిగి లేవరు.

12 ఆకాశం అంతరించి పోయేదాకా వాళ్ళు మేల్కోరు. ఎవరూ వారిని నిద్ర లేపలేరు.

13 నువ్వు నన్ను మృత్యులోకంలో దాచి ఉంచితే ఎంత మేలు! నా మీద నీ కోపం చల్లారే దాకా మరుగు చేస్తే ఎంత బాగుంటుంది! నాకు కొంతకాలం గడువుపెట్టి ఆ తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను.

14 మనుషులు చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతుకుతారా? ఆలా జరిగే పక్షంలో నా పోరాటం ముగిసి నాకు విడుదల కలిగేదాకా నేను ఎదురుచూస్తూ ఉంటాను.

15 అప్పుడు నువ్వు పిలుస్తావు. నేను నీతో మాట్లాడతాను. నీ చేతిపనిని చూసి నువ్వు ఇష్టపడతావు.

16 అయితే ఇప్పుడు నేను వేసే అడుగులు నువ్వు లెక్కిస్తున్నావు. నేను చేసే పాపాలు నీకు కోపం తెప్పిస్తున్నాయి.

17 నా అతిక్రమాలు సంచిలో ఉంచి మూసివేశావు. నేను చేసిన దోషాలను భద్రంగా దాచిపెట్టావు.

18 కూలిపోయిన పర్వతాలు ముక్కలైపోయి నేలమట్టం అవుతాయి, కొండలు వాటి స్థానం తప్పి పడిపోతాయి.

19 నీళ్ళు రాళ్లను అరగదీస్తాయి. నీటి ప్రవాహం భూమిపై మట్టి కొట్టుకుపోయేలా చేస్తుంది. ఆ విధంగా నువ్వు మనిషి ఆశలను భగ్నం చేశావు.

20 నువ్వు మనుషులను ఎప్పటికీ అణచివేస్తున్నావు గనుక వారు అంతరించిపోతారు. నువ్వు వాళ్ళ ముఖాలను చావు ముఖాలుగా మార్చివేసి వాళ్ళను వెళ్లగొట్టావు.

21 ఒకవేళ వాళ్ళ పిల్లలు ప్రఖ్యాతి చెందినా అది వారికి తెలియదు. ఒకవేళ అణిగిపోయి దీనస్థితి అనుభవించినా వాళ్ళు అది గ్రహించలేరు.

22 తమ సొంత శరీరాల్లోని బాధ మాత్రమే వాళ్ళు అనుభవిస్తారు. తమకు తామే ఎక్కువగా దుఃఖపడతారు.