తనను విడిచిపెట్టవద్దని యేసు శిష్యులను హెచ్చరించడం
యూదా వెళ్ళిపోయిన తరువాత, యేసు తనను విడిచిపెట్టవద్దని శిష్యులను (ముఖ్యంగా పేతురును) హెచ్చరిస్తాడు. వారందరూ మాత్రం తాము ఆయనకు నమ్మకంగా ఉంటామని గట్టిగా చెబుతారు.
క్రీ.శ. 30 లేదా 29
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 26:31–35
26:31 అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి మీరంతా నా విషయంలో తొట్రుపడతారు. ఎందుకంటే,
‘కాపరిని దెబ్బ తీస్తాను, మందలోని గొర్రెలు చెదరిపోతాయి’ అని రాసి ఉంది కదా!
32 కాని నేను మరణం నుండి తిరిగి లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను” అన్నాడు.
33 అందుకు పేతురు, “నీ విషయంలో అందరూ వెనుకంజ వేసినా సరే నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను” అని యేసుతో చెప్పాడు.
34 యేసు అతణ్ణి చూసి, “నేను నీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెబుతావు” అన్నాడు.
35 పేతురు ఆయనతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నిన్ను ఎరగనని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు.
మార్కు రాసిన సువార్త 14:27–31
14:27 అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి నా విషయంలో మీరంతా నాకు ముఖం చాటేస్తారు. ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది, ‘కాపరిని కొడతాను, గొర్రెలు చెదరిపోతాయి.’
28 కాని నేను తిరిగి సజీవంగా లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను” అని చెప్పాడు.
29 అయితే పేతురు ఆయనతో, “అందరూ అలా చేసినా నేను మాత్రం నిన్ను విడిచి పెట్టను” అన్నాడు.
30 అప్పుడు యేసు, “నీతో కచ్చితంగా చెప్పేదేమిటంటే ఈ రాత్రి కోడి రెండు సార్లు కూయక ముందే నీవు మూడు సార్లు నేనెవరో తెలియదని అబద్ధం ఆడతావు” అని అతనితో అన్నాడు.
31 “నేను నీతో చావవలసి వచ్చినా నువ్వు తెలియదు అనను” అని పేతురు గట్టిగా చెప్పాడు. మిగిలిన శిష్యులు కూడా అదే విధంగా అన్నారు.
లూకా రాసిన సువార్త 22:31–38
22:31 “సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు. 32 నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.”
33 కానీ పేతురు, “ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్ళడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయనతో అన్నాడు.
34 అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు.
35 ఇంకా ఆయన “నేను డబ్బు సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా?” అని అడిగాడు. దానికి వారు, “ఏమీ తక్కువ కాలేదు” అన్నారు. 36 ఆయన, “కానీ ఇప్పుడు సంచీ జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేని వాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి.
37 ‘ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు’ అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నెరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. 38 శిష్యులు, “ప్రభూ ఇక్కడ రెండు కత్తులున్నాయి” అన్నారు. ఆయన, “చాలు” అన్నాడు.
యోహాను రాసిన సువార్త 13:31–38
13:31 యూదా వెళ్ళిపోయిన తరువాత, యేసు, “ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పొందాడు. దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు” అన్నాడు. 32 దేవుడు ఆయనలో మహిమ పరచబడినట్టయితే, తనలో ఆయనను మహిమ పరుస్తాడు. వెంటనే ఆయనను మహిమ పరుస్తాడు. 33 పిల్లలూ, ఇంకా కొంత కాలం నేను మీతో ఉంటాను. మీరు నా కోసం వెదుకుతారు. కాని, నేను యూదులకు చెప్పినట్టు మీతో కూడా చెబుతున్నాను, ‘నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు.’ 34 మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలన్న కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. 35 మీరు ఒకడి పట్ల ఒకడు ప్రేమగలవారైతే, దాన్నిబట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు” అన్నాడు.
36 సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, నువ్వెక్కడికి వెళ్తున్నావు?” అన్నాడు. యేసు జవాబిస్తూ, “నేను వెళ్ళే స్థలానికి ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు, కాని తరవాత వస్తావు” అన్నాడు.
37 అందుకు పేతురు, “ప్రభూ, నేను ఇప్పుడే నీ వెంట ఎందుకు రాలేను? నీకోసం నా ప్రాణం పెడతాను” అన్నాడు.
38 యేసు జవాబిస్తూ, “నా కోసం ప్రాణం పెడతావా? నేను నీతో కచ్చితంగా చెబుతున్నాను, నేనెవరో తెలియదని నువ్వు మూడు సార్లు చెప్పక ముందు కోడి కూయదు” అన్నాడు.
రొట్టె, ద్రాక్షారసాల జ్ఞాపకాచరణను యేసు స్థాపించడం
రొట్టె తినడం, ద్రాక్షారసం తాగడం అనే జ్ఞాపకాచరణను యేసు స్థాపిస్తాడు.
యెరూషలేము. సిలువ వేయబడటానికి ముందు సాయంత్రం
మత్తయి రాసిన సువార్త 26:26–29
26:26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకుని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీన్ని మీరు తీసుకుని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు.
27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి.
28 ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం. 29 నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాటి ద్రాక్షరసం మళ్ళీ తాగే రోజు వరకూ నేనిక దాన్ని తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు.
మార్కు రాసిన సువార్త 14:22–25
14:22 వారు భోజనం చేస్తూ ఉండగా యేసు రొట్టె తీసుకుని ఆశీర్వదించి, దాన్ని విరిచి వారికిచ్చి, “దీన్ని తీసుకుని తినండి. ఇది నా దేహం” అన్నాడు.
23 తరువాత ఒక పాత్ర తీసుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వారికి ఇచ్చాడు. ఆ పాత్రలోనిది వారందరూ తాగారు.
24 ఆయన వారితో, “ఇది నా రక్తం. అనేకుల కోసం చిందే నిబంధన రక్తం. 25 నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి, కొత్త ద్రాక్షారసం మళ్ళీ తాగే రోజు వరకూ ఇక నేను దాన్ని తాగను అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను” అన్నాడు.
లూకా రాసిన సువార్త 22:17–20
22:17 తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి, “మీరు దీన్ని తీసుకుని పంచుకోండి. 18 ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు.
19 ఆ తరవాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దాన్ని విరిచి వారికిచ్చి, “ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అని చెప్పాడు.
20 అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన.