భాగం 7: గలిలయలో గొప్ప పరిచర్య

బహుశా క్రీ.శ. 27 శరదృతువు నుండి 29 వసంతకాలం వరకు (దాదాపు ఏడాదిన్నర అని తెలుస్తోంది)

మార్కు ఈ కాలాన్ని ఎంతో విపులంగా వివరిస్తాడు; లూకా సంక్షిప్తంగా నివేదిస్తాడు; మత్తయి ఈ భాగంలో ప్రధానంగా విషయాలవారీగా వివరిస్తాడు. మార్కు సువార్త నేరుగా గలిలయలో గొప్ప పరిచర్యతో మొదలవుతుంది (అపొస్తలుల కార్యములు 10:36–43లో కొర్నేలి ఇంటివారికి పేతురు చెప్పిన క్రీస్తు జీవిత సారాంశంతో పోల్చండి). విషయసామగ్రి విస్తారంగా ఉండడం వల్ల స్పష్టంగా విభజించడం కష్టమవుతుంది, అయినా సంఘటనలు ముందుకు సాగుతాయి.

  • నజరేతులో తిరస్కరణకు గురైన యేసు కపెర్నహూముకు నివాసం మార్చుకోవడం
  • యేసు కీర్తి పెరుగుతుండగా, నలుగురు జాలరులతో కలిసి గలిలయలో మొదటి పర్యటన, తిరిగి వచ్చేటప్పుడు మత్తయి (లేవి)కి పిలుపు.
  • యెరూషలేములో, గలిలయలో విశ్రాంతి దినం గురించిన వివాదం
  • పన్నెండుమందిని ఎన్నుకుని కొండపై బోధించిన యేసు
  • పెరుగుతున్న క్రీస్తు ప్రభావం, చెరసాల నుండి యోహాను విచారణ
  • గలిలయలో రెండవ పర్యటన (ఇప్పుడు పన్నెండుమందితో), మరియు పరిసయ్యుల తీవ్రమైన శత్రుత్వం.
  • ఉపమానాల మొదటి పెద్ద సమూహం, దానితోపాటు గెరాసా (కుర్సీ) సందర్శన, నజరేతుకు చివరి సందర్శన.
  • గలిలయలో మూడవ పర్యటన (పన్నెండుమంది వెనుక యేసు వెళ్లడంతో), హేరోదు అంతిపాపై దాని ప్రభావం.

యేసు గలిలయలో బోధించడం

గలిలయలో యేసు బోధన గురించిన సాధారణ వివరణ.

క్రీ.శ. 27 నుండి 29 వరకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 4:17

4:17 అప్పటి నుంచి యేసు, “పరలోక రాజ్యం దగ్గరపడింది. పశ్చాత్తాపపడండి” అంటూ బోధించడం మొదలు పెట్టాడు.

మార్కు రాసిన సువార్త 1:15

1:15 “కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి” అని ప్రకటించాడు.

లూకా రాసిన సువార్త 4:15

4:15 ఆయన వారి సమాజ మందిరాల్లో బోధిస్తుంటే అందరూ ఆయనను మెచ్చుకున్నారు.

కానాలో యేసు ఒక అధికారి కుమారుణ్ణి స్వస్థపరచడం

కానాలో యేసు కపెర్నహూముకు చెందిన ఒక రాజాధికారి కుమారుణ్ణి స్వస్థపరుస్తాడు.

ఇక్కడ, నజరేతులో తిరస్కరణ, కపెర్నహూములో కొత్త నివాసం అనే వృత్తాంతంలో, యేసు కానాను, నజరేతును మళ్ళీ సందర్శిస్తాడు, గలిలయ సముద్రం దగ్గర నలుగురు జాలరులను మళ్ళీ పిలుస్తాడు, కపెర్నహూములో బోధిస్తూ స్వస్థపరిచే తన పరిచర్యను ప్రారంభిస్తాడు.

యోహాను రాసిన సువార్త 4:46–54

4:46 యేసు గలిలయలోని కానా అనే ఊరికి వచ్చాడు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చింది ఇక్కడే. అదే సమయంలో కపెర్నహూములో ఒక అధికారి కొడుకు జబ్బుపడి ఉన్నాడు. 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతడు విన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడనీ వచ్చి బాగుచేయాలనీ ఆయనను వేడుకున్నాడు. 48 యేసు అతడితో ఇలా అన్నాడు, “సూచనలూ అద్భుతాలూ చూడందే మీరు నమ్మనే నమ్మరు.” 49 అందుకా అధికారి, “ప్రభూ, నా కొడుకు చావక ముందే రా” అని వేడుకున్నాడు. 50 యేసు అతడితో, “నువ్వు వెళ్ళు. నీ కొడుకు బతుకుతాడు” అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు వెళ్ళి పోయాడు.

51 అతడు దారిలో ఉండగానే అతడి సేవకులు ఎదురొచ్చారు. అతని కొడుకు బతికాడని తెలియజేశారు. 52 “ఏ సమయంలో వాడు బాగవ్వడం ప్రారంభమైంది” అని అతడు వారిని అడిగాడు. వారు, “నిన్న ఒంటి గంటకు జ్వరం తగ్గడం మొదలైంది” అని చెప్పారు. 53 ‘నీ కొడుకు బతికి ఉన్నాడు’ అని యేసు తనతో చెప్పిన సమయం సరిగ్గా అదేనని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి అతడూ, అతని ఇంట్లో అందరూ నమ్మారు. 54 ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.

నజరేతు యేసును మొదటిసారి తిరస్కరించడం

లూకా రాసిన సువార్త 4:16–31

4:16 ఒక రోజు తాను పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి చదవడానికి నిలబడ్డాడు. 17 యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే,

18 “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు.

పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు.

చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ,

19 ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు”

అని రాసిన చోటు ఆయనకు దొరికింది.

20 ఆయన గ్రంథం మూసి సమాజ మందిర పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. 21 సమాజ మందిరంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూశారు. “మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అని ఆయన వారితో అన్నాడు.

22 అందరూ ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడ్డారు. “ఈయన యోసేపు కొడుకు గదా?” అని చెప్పుకున్నారు. 23 ఆయన వారితో, “వైద్యుడా, నిన్ను నీవే బాగు చేసుకో” అనే సామెత నాకు చెప్పి, కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, వాటిని ఈ నీ సొంత ఊరులో కూడా చేయమని మీరు తప్పకుండా నాతో అంటారు” అన్నాడు.

24 ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వారు అంగీకరించరు. 25 ఏలీయా ప్రవక్త రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులు ఉన్నారు. మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూసుకుపోయి దేశమంతా తీవ్రమైన కరువు రాగా, 26 దేవుడు ఏలీయాను ఎవరి దగ్గరకీ పంపలేదు. సీదోను ప్రాంతంలో సారెపతు అనే ఊరిలో ఉన్న ఒక వితంతువు దగ్గరకే పంపాడు.

27 ఎలీషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో ఎందరో కుష్టురోగులున్నా, సిరియా వాడైన నయమాను తప్ప ఎవరూ బాగుపడలేదు.”

28 సమాజ మందిరంలో ఉన్నవారంతా ఆ మాటలు విని 29 ఆగ్రహంతో నిండిపోయి, లేచి ఆయనను ఊరి బయటకు తోసుకుపోయి కొండ కొమ్ము వరకూ తీసికెళ్ళారు. వారి ఊరు కొండ పైన ఉంది. ఆయనను అక్కడ నుండి పడదోయాలనుకున్నారు. 30 అయితే ఆయన వారి మధ్యనుంచి తప్పుకుని తన దారిన వెళ్ళిపోయాడు.

31 అప్పుడాయన గలిలయ ప్రాంతంలోని కపెర్నహూము అనే ఊరు వచ్చి, విశ్రాంతి దినాన వారికి బోధించాడు.

యేసు కపెర్నహూములో నివాసం ఏర్పరచుకోవడం

మత్తయి రాసిన సువార్త 4:13–16

4:13 ఆయన నజరేతును విడిచి వెళ్ళి కపెర్నహూములో నివసించాడు. అది గలిలయ సముద్ర తీరాన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో ఉంది.

14-16 “జెబూలూను నఫ్తాలి ప్రాంతాలు,

యొర్దాను నది అవతల సముద్రం వైపున ఉన్న

యూదేతరుల గలిలయ ప్రాంతాల్లో

చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు.

చావు నీడలో కూర్చున్న వారిపై వెలుగు ఉదయించింది.”

అని యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట ఈ విధంగా నెరవేరింది.