యెరూషలేము కష్టాలు, నాశనం గురించి ముందుగా చెప్పడం

క్రీ.పూ. 595

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహెజ్కేలు 3:22–5:17

22 అక్కడ యెహోవా హస్తం నాపై ఉంది. ఆయన నాతో ఇలా అన్నాడు. “నువ్వు లే, మైదాన ప్రాంతానికి వెళ్ళు. అక్కడ నేను నీతో మాట్లాడుతాను.” 23 నేను లేచి మైదాన ప్రాంతానికి వెళ్ళాను. కెబారు నదీ ప్రాంతంలో నేను చూసిన యెహోవా తేజస్సు అక్కడ ఉంది. కాబట్టి నేను సాష్టాంగపడ్డాను.

24-25 అప్పుడు దేవుని ఆత్మ నా దగ్గరకి వచ్చి నన్ను లేపి నిల్చోబెట్టాడు. అప్పుడు ఆయన నాతో ఇలా మాట్లాడాడు. “నరపుత్రుడా, నువ్వు వాళ్ళ మధ్యకి వెళ్ళకుండా వాళ్ళు వచ్చి నీపై తాళ్ళు వేసి నిన్ను బంధిస్తారు. అందుకే నువ్వు వెళ్ళి నీ ఇంట్లో తలుపులు వేసుకుని ఉండు.

26 వాళ్ళు తిరగబడే ప్రజలు కాబట్టి నువ్వు వాళ్ళని గద్దించకుండా నేను నీ నాలుకను నీ నోట్లో అంగిలికి అంటుకుపోయేలా చేస్తాను. నువ్వు మౌనంగా ఉంటావు. 27 కానీ నేను నీతో మాట్లాడుతాను. వాళ్లకి ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు’ అని నువ్వు చెప్పడానికి నీ నోరు తెరుస్తాను. వాళ్ళు తిరుగుబాటు చేసే జనం కాబట్టి వినేవాడు వింటాడు. విననివాడు వినకుండానే ఉంటాడు.”

4:1 అయితే నరపుత్రుడా, ఒక పెంకు తీసుకో. దాన్ని నీముఖానికి ఎదురుగా ఉంచుకో. దాని పైన యెరూషలేము పట్టణం నమూనాను చిత్రించు. 2 అది శత్రువుల ముట్టడిలో ఉన్నట్టుగా, దాని ఎదుట ప్రాకారాలు నిర్మించినట్టుగా చిత్రించు. దానిపై దాడి చేయడానికి వీలుగా ఉన్నత ప్రాంతాలనూ, దాని చుట్టూ సైనిక శిబిరాలనూ చిత్రించు. ప్రాకారాలను ధ్వంసం చేసే యంత్రాలను చిత్రించు. 3 తరువాత నువ్వు ఒక ఇనుప రేకును తీసుకుని దాన్ని నీకూ పట్టణానికీ మధ్య ఇనుప గోడగా నిలబెట్టు. పట్టణం ముట్టడికి గురౌతుంది కాబట్టి పట్టణానికి అభిముఖంగా నిలబడు. నీవు పట్టణాన్ని ముట్టడిస్తున్నట్టు ఉంటావు. ఇశ్రాయేలు జాతికి ఇది సూచనగా ఉంటుంది.

4 ఆ తరువాత నీ ఎడమ వైపుకి తిరిగి పడుకో. ఇశ్రాయేలు జాతి పాపాన్నంతా నీ పైకి వేసుకో. ఇశ్రాయేలు జాతికి వ్యతిరేకంగా నువ్వు ఎన్ని రోజులు అలా పండుకుంటావో అన్ని రోజులు వారి పాపాన్ని మోస్తావు. 5 ఆ రోజులను నేనే నిర్ణయిస్తున్నాను. ఇశ్రాయేలు జాతి పాపం చేసిన కాలంలో ఒక్కో సంవత్సరం ఒక్కో రోజుగా నువ్వు భరించాలి. అంటే 390 రోజులు! ఈ విధంగా నువ్వు ఇశ్రాయేలు జాతి పాపాన్ని భరిస్తావు.

6 ఆ రోజులన్నీ గడిచిన తరువాత రెండో సారి నీ కుడి వైపుకి పడుకో. ఈ సారి నలభై రోజులు నువ్వు యూదా జాతి పాపాన్ని మోస్తావు. ఒక్కో సంవత్సరానికి ఒక్కో రోజు నీకు నేను నిర్ణయించాను. 7 తరువాత ముట్టడిలో ఉన్న యెరూషలేముకి వ్యతిరేకంగా నిలబడి చొక్కా తీసివేసిన నీ చేతిని ఎత్తి దానికి వ్యతిరేకంగా ప్రవచించాలి. 8 నువ్వు పట్టణాన్ని ముట్టడించినట్టు ఉండే ఆ రోజులు పూర్తయే వరకూ నువ్వు కదలకుండా నిన్ను బంధించి ఉంచుతాను.

9 నీ కోసం గోధుమలూ, బార్లీ, చిక్కుడు గింజలూ, కాయ ధాన్యాలూ, జొన్నలూ, సజ్జలూ తెచ్చుకో. వాటన్నిటినీ ఒక పాత్రలో వేసి నువ్వు ఒక వైపున పడుకునే రోజుల లెక్క ప్రకారం రొట్టెలు చేసుకోవాలి. 390 రోజులు నువ్వు ఇలాగే చేసుకుని తినాలి! 10 నువ్వు తీసుకునే ఆహారం ఇదే. రోజుకి రెండు వందల గ్రాముల ప్రకారం తీసుకోవాలి. అది ప్రతి రోజూ సమయానికి తింటూ ఉండాలి. 11 అలాగే నీళ్ళు కొలత ప్రకారం ప్రతి రోజూ రెండు గ్లాసులు తాగాలి. సమయానికి నీళ్లు తాగుతూ ఉండాలి.

12 బార్లీతో చేసే అప్పడాల్లా వాటిని చేసుకుని తినాలి. అందరూ చూస్తుండగా వాటిని మనిషి మలాన్నే వంట చేయడానికి ఉపయోగిస్తూ కాల్చి తినాలి! 13 యెహోవా ఇలా చెప్తున్నాడు. “నేను వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు వెళ్ళే జాతులమధ్య ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రమైన ఆహారం తినవలసి వస్తుంది.”

14 కానీ నేను “అయ్యో, ప్రభూ! యెహోవా! నేను ఏనాడూ అపవిత్రం కాలేదు. చిన్నప్పట్నించి చనిపోయిన దాన్ని గానీ, మృగాలు చంపిన దాన్ని గానీ నేను తినలేదు. అపవిత్రమైన మాంసం ఏనాడూ నా నోట్లో ప్రవేశించలేదు” అన్నాను. 15 దానికి ఆయన “చూడు మనిషి మలానికి బదులు నేను నీకు ఆవు పేడను నిర్ణయించాను. నువ్వు పిడకలతో నీ రొట్టెలు చేసుకోవచ్చు” అన్నాడు.

16 ఇంకా ఆయన నాకు ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, చూడు, నేను యెరూషలేములో రొట్టె అనే ఆధారం లేకుండా చేస్తున్నాను. వాళ్ళు ఆందోళనతో ఒక పరిమితి ప్రకారం రొట్టెలు తింటారు. నీళ్ళు కూడా కొలత ప్రకారం భయంతో తాగుతారు. 17 వాళ్లకి ఆహారం, నీళ్ళు కరువై పోతాయి. ప్రతి ఒక్కడూ తన సహోదరుడి వైపు దిగులుతో చూస్తాడు. తాము చేసిన పాపాల వలన నశించిపోతారు.”

5:1 “తరువాత నరపుత్రుడా, నువ్వు నీ కోసం మంగలి కత్తి లాంటి ఒక పదునైన కత్తి తీసుకో. దాంతో నీ తలను, గడ్డాన్నీ క్షౌరం చేసుకో. ఆ వెంట్రుకలను తూచడానికీ, భాగాలు చేయడానికీ ఒక త్రాసు తీసుకో. 2 పట్టణాన్ని ముట్టడించిన రోజులు ముగిసిన తరువాత ఆ వెంట్రుకల్లో మూడో భాగాన్ని పట్టణం మధ్యలో తగలబెట్టు. మిగిలిన మూడో భాగాన్ని పట్టణం చుట్టూ తిరుగుతూ కత్తితో కొట్టు. మిగిలిన మూడో భాగాన్ని గాలికి ఎగిరి పోనీ. నేను కత్తి దూసి ప్రజలను తరుముతాను.

3 అయితే కొద్దిగా వెంట్రుకలను తీసుకుని నీ చెంగుకి కట్టుకో. 4 మళ్ళీ వాటిలో కొన్నిటిని తీసి అగ్నిలో వేసి కాల్చి వెయ్యి. అక్కడ నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు జాతినంతటినీ తగులబెట్టేస్తుంది.”

5 ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు. “ఇది అనేక జాతుల మధ్య నేను ఉంచిన యెరూషలేము పట్టణం. నేను అనేక రాజ్యాలు దాని చుట్టూ ఉండేలా చేశాను. 6 అయితే ఆమె ఇతర జాతుల కంటే దుర్మార్గంగా నా శాసనాలను తిరస్కరించింది. ఇతర రాజ్యాల కంటే దుర్మార్గంగా నా నియమాలను తిరస్కరించింది. వాళ్ళు నా న్యాయ నిర్ణయాలను తిరస్కరించి నా నియమాల ప్రకారం నడుచుకోలేదు.”

7 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీ చుట్టూ ఉన్న జాతుల కంటే మీరు నాకు ఎక్కువ బాధ కలిగిస్తున్నారు. నా శాసనాల ప్రకారం మీరు నడుచుకోలేదు. నా నియమాలను బట్టి నడుచుకోలేదు. కనీసం మీ చుట్టూ ఉన్న రాజ్యాల నియమాలను బట్టి కూడా మీరు నడుచుకోలేదు. 8 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి, నేనే మీకు విరోధంగా చర్యలు తీసుకుంటాను. ఇతర జాతులు చూస్తూ ఉండగా మీ మధ్య నా తీర్పు అమలు పరుస్తాను.

9 నీ అసహ్యమైన పనుల కారణంగా నేను ఇంతకు ముందెప్పుడూ చేయని, భవిష్యత్తులో పునరావృతం కాని కార్యాన్ని నీకు చేస్తాను. 10 దాని మూలంగా మీలో తండ్రులు తమ పిల్లలను తింటారు. కొడుకులు తమ తండ్రులను తింటారు. నా తీర్పును నేను అమలు పరుస్తాను. మీలో మిగిలిన వాళ్ళందరినీ నలు దిక్కులకూ చెదరగొడతాను. 11 కాబట్టి నా ప్రాణం పైన ఒట్టు” ఇది ప్రభువైన యెహోవా ప్రకటన.

“నీ అసహ్యమైన విషయాలతో నా మందిరాన్ని అపవిత్రం చేశావు కాబట్టి నేను నీ సంఖ్యను కచ్చితంగా తగ్గిస్తాను. నీ మీద కనికరం చూపను. నిన్ను కాపాడను. 12 మీ మధ్యలో కరువు వస్తుంది. అప్పుడు వచ్చే తెగులు మూలంగా మీలో మూడో భాగం మరణిస్తారు. యుద్ధం వచ్చి నీ చుట్టూ మరో మూడో భాగం కత్తికి బలౌతారు. మరో మూడో భాగాన్ని అన్ని దిక్కులకీ చెదరగొడతాను. కత్తి దూసి వారిని తరముతాను.

13 అప్పుడుగానీ నా మహా కోపం చల్లారదు. నా మహోగ్రతకి స్వస్తి పలుకుతాను. నేను సంతృప్తి చెందుతాను. వాళ్లకు వ్యతిరేకంగా నా మహోగ్రత చూపి ముగించిన తరువాత యెహోవానైన నేను నా మహోగ్రతలో మాట్లాడానని వాళ్ళు తెలుసుకుంటారు. 14 నిన్ను చూసే వాళ్ళందరికీ నువ్వు నిర్జనంగానూ, నిందకు తగిన దానిగానూ కనిపించేలా చేస్తాను.

15 కాబట్టి యెరూషలేము ఇతర జాతులు ఖండించడానికీ, ఎగతాళి చేయడానికీ వీలుగా మారుతుంది. చుట్టూ ఉన్న దేశాలకు ఒక హెచ్చరికగానూ, భయం పుట్టించేదిగానూ ఉంటుంది. ఎందుకంటే నేను మహా కోపంతో, మహోగ్రతతో, తీవ్రమైన గద్దింపుతో నా శిక్షను అమలు చేస్తాను. యెహోవానైన నేనే ప్రకటన చేస్తున్నాను.

16 నీ పైకి నేను కఠినమైన కరువు బాణాలు వేస్తాను. అవి నువ్వు నాశనం కావడానికి కారణం అవుతాయి. ఎందుకంటే నీ పైకి వచ్చిన కరువును అధికం చేస్తాను. నీ ఆహారానికి ఆధారంగా ఉన్న వాటిని విరిచి వేస్తాను. 17 నీకు విరోధంగా కరువునూ, వినాశనాన్నీ పంపిస్తాను. దాంతో నువ్వు సంతానం లేకుండా ఉంటావు. తెగులూ, రక్తపాతం నీకు కలుగుతాయి. నీకు విరోధంగా ఖడ్గాన్ని పంపుతాను. ఈ ప్రకటన చేస్తున్నది నేనే, యెహోవాను.”