యెరూషలేమును స్వాధీనం చేసుకోవడం, సిద్కియాను పట్టుకోవడం; యిర్మీయాకు విడుదల

క్రీ.పూ. 588

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యిర్మీయా 52:5–6

5 ఈ విధంగా రాజైన సిద్కియా పరిపాలనలో పదకొండో సంవత్సరం వరకూ పట్టణం ముట్టడిలో ఉంది.

6 ఆ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున పట్టణంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. దేశంలో ప్రజలకు ఆహరం బొత్తిగా లేకుండా పోయింది.

యిర్మీయా 39:3

3 అప్పుడు బబులోను రాజు అధికారులు నేర్గల్‌ షరేజరు, సమ్గర్ నెబో, ముఖ్య అధికారి శర్సెకీము లోపలికి వచ్చి సింహద్వారంలో కూర్చున్నారు. నేర్గల్‌ షరేజరు ఒక ఉన్నత అధికారి. మిగిలిన వాళ్ళు బబులోను రాజుకు చెందిన అధికారులు.

యిర్మీయా 52:7–11

7 అప్పుడు ప్రాకారాలను పడగొట్టారు. కల్దీయులు పట్టణంలో ప్రవేశించారు. పట్టణంలో సైనికులందరూ రాజు తోట దగ్గరున్న రెండు గోడల మధ్య ద్వారం గుండా పట్టణం విడిచిపెట్టి పారిపోయారు. అరాబా దిశగా తరలి వెళ్ళారు. 8 కానీ కల్దీయుల సైన్యం రాజును తరిమింది. యెరికో సమీపంలోని యోర్దాను నదీలోయ మైదాన ప్రాంతంలో వాళ్ళు సిద్కియాను తరిమి పట్టుకున్నారు. అతని సైన్యం అతణ్ణి విడిచి పెట్టి కకావికలై పోయారు.

9 వాళ్ళు రాజును పట్టుకుని హమాతు దేశంలోని రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి అతణ్ణి తీసుకు వచ్చారు. అక్కడే అతడు యూదా రాజైన సిద్కియాకు శిక్ష విధించాడు. 10 బబులోను రాజు సిద్కియా కొడుకులను అతని కళ్ళ ఎదుటే చంపించాడు. అతడు రిబ్లాలోనే యూదా అధిపతులనందరినీ ఊచకోత కోయించాడు. 11 సిద్కియా రెండు కళ్ళూ పీకించాడు. అతణ్ణి ఇత్తడి సంకెళ్ళతో బంధించి, బబులోనుకు తీసుకు వచ్చారు. అతడు చనిపోయేంత వరకూ బబులోను రాజు అతణ్ణి చెరసాలలోనే ఉంచాడు.

యిర్మీయా 39:11–14

11 యిర్మీయా గురించి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదానుకు ఇలా ఆజ్ఞాపించాడు, 12 “నువ్వు అతనికి హాని చెయ్యొద్దు. అతన్ని జాగ్రత్తగా చూసుకో. అతడు నీతో ఏది చెప్పినా అది అతని కోసం చెయ్యి.” 13 కాబట్టి రాజదేహసంరక్షకుల అధిపతి నెబూజరదాను, నపుంసకుల అధిపతి నేర్గల్‌ షరేజరు, ఉన్నత అధికారి నేర్గల్‌షరేజరు, ఇంకా బబులోను రాజు ప్రధానులందరూ మనుషులను పంపి, 14 చెరసాల ప్రాంగణంలో నుంచి యిర్మీయాను తెప్పించి, అతన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యాకు అతన్ని అప్పగించారు. అప్పుడు యిర్మీయా ప్రజల మధ్య నివాసం చేశాడు.

యిర్మీయా 52:24–27

24 రాజు అంగరక్షకుల అధిపతి ప్రధానయాజకుడు శెరాయానూ, రెండవ యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు కాపలా వాళ్ళనూ పట్టుకున్నాడు. 25 అతడు సైనికుల పైన ఉండే ఒక అధికారినీ, రాజు సలహాదారుల్లో ఏడుగురినీ పట్టుకున్నాడు. వీళ్ళు ఇంకా పట్టణంలోనే ఉన్నారు. వీళ్ళతో పాటు పట్టణంలో ప్రముఖులైన అరవై మందినీ పట్టుకున్నాడు.

26 రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను వీళ్ళందరినీ రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకు వచ్చాడు. 27 బబులోను రాజు హమాతు దేశంలోని రిబ్లాలో వాళ్ళని కొట్టి చంపించాడు. మిగిలిన యూదా వాళ్ళను బందీలుగా బబులోనుకు తీసుకు వెళ్ళాడు.

యెరూషలేములోని దేవాలయాన్ని దహనం చేయడం

యిర్మీయా 52:12–14

12 అయిదో నెల పదో రోజున, అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలన పందొమ్మిదో సంవత్సరంలో బబులోను రాజు అంగరక్షకుల అధిపతీ, రాజు సేవకుడూ అయిన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు. 13 అతడు యెహోవా మందిరాన్నీ, రాజు భవనాన్నీ, యెరూషలేములోని ప్రాముఖ్యమైన ఇళ్లనూ తగలబెట్టించాడు. 14 రాజు దగ్గర అంగరక్షకుల అధిపతితో పాటు వెళ్ళిన సైన్యం యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలను కూల్చివేశారు.

యిర్మీయా 52:17–23

17 కల్దీయులు యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, ఇత్తడి సరస్సునూ ఊడదీసి వాటిని ముక్కలు చేసి ఆ ఇత్తడినంతా బబులోనుకు పట్టుకుపోయారు. 18 అలాగే బిందెలనూ, కుండలనూ గిన్నెలనూ కత్తెరలనూ గరిటెలనూ ఇంకా యాజకులు ఉపయోగించే ఇత్తడి వస్తువులు అన్నిటినీ తీసుకువెళ్ళారు. 19 పళ్ళేలనూ, ధూపం వేసే పళ్ళేలనూ పాత్రలనూ కుండలనూ దీప స్తంభాలనూ ఇంకా బంగారు పళ్ళేలనూ వెండి పళ్ళేలనూ రాజు అంగరక్షకుల అధిపతి తీసుకువెళ్ళాడు.

20 రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేయించిన రెండు స్థంభాలూ సరస్సూ పీటల కింద ఉన్న పన్నెండు ఎద్దుల ఇత్తడి ప్రతిమలూ అన్నీ ఇత్తడివి. ఆ ఇత్తడిని తూకం వేయడం సాధ్యం కాదు. వాటన్నిటినీ అతడు బబులోనుకు తీసుకు వెళ్ళాడు. 21 వాటిలో ఒక్కో స్తంభం దాదాపు ఇరవై ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది. వాటి చుట్టు కొలత పదిహేడున్నర అడుగులు ఉంటుంది. ఇత్తడి రేకు నాలుగు వేళ్ళ మందం ఉంటుంది. అది లోపల బోలుగా ఉంటుంది.

22 ఒక స్తంభం పైన ఒక ఇత్తడి పీట ఉంది. ఆ పీట ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ పీట చుట్టూ ఇత్తడి దానిమ్మలూ, అల్లిక పనీ ఉన్నాయి. ఇవి కూడా ఇత్తడితో చేసినవే. రెండో స్తంభం పైన కూడా ఇలాగే ఉంది. దానిక్కూడా ఇత్తడి దానిమ్మలు ఉన్నాయి. 23 కాబట్టి పీటల పక్కన మొత్తం తొంభై ఆరు దానిమ్మలూ, అల్లిక పని చుట్టూ వంద దానిమ్మలూ ఉన్నాయి.

యిర్మీయా 52:15–16

15 రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను ప్రజల్లో కొందరు నిరుపేదలనూ పట్టణంలో మిగిలిపోయిన కొందరినీ, బబులోను రాజు పక్షాన చేరిన వాళ్ళనూ, వృత్తి పనుల వాళ్ళలో కొందరినీ తీసుకు పోయాడు. 16 రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను ద్రాక్షాతోటల్లో పని చేయడానికి కొందరు నిరుపేదలను ఉండనిచ్చాడు.

యిర్మీయా 39:10

10 అయితే నెబూజరదాను నిరుపేదలను యూదా దేశంలోనే ఉండనిచ్చి, వాళ్లకు ద్రాక్షతోటలు, పొలాలు ఇచ్చాడు.

కీర్తనలు 79

ఆసాపు కీర్తన

1 దేవా, విదేశీయులు నీ వారసత్వ భూమిలోకి వచ్చేశారు, వాళ్ళు నీ పవిత్రాలయాన్ని అపవిత్రపరచారు. యెరూషలేమును రాళ్ళ కుప్పగా మార్చివేశారు.

2 వాళ్ళు నీ సేవకుల శవాలను రాబందులకు ఆహారంగా, నీ భక్తుల మృత దేహాలను అడవి జంతువులకు ఆహారంగా పడేశారు.

3 నీళ్లలాగా వారి రక్తాన్ని యెరూషలేము చుట్టూ పారబోశారు. వాళ్ళను పాతిపెట్టేవారు ఎవరూ లేరు.

4 మా పొరుగు వారికి మేము ఎగతాళి అయ్యాం. మా చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని వెక్కిరించి అపహసిస్తారు.

5 యెహోవా, ఎంతకాలం నీకు మా మీద కోపం? నీ కోపం శాశ్వతంగా ఉంటుందా? నీ రోషం ఎంతకాలం మంటలాగా మండుతూ ఉంటుంది?

6 నిన్నెరగని రాజ్యాల మీద, నీ పేరున ప్రార్థన చేయని రాజ్యాల మీద నీ ఉగ్రత కుమ్మరించు.

7 వాళ్ళు యాకోబు సంతతిని దిగమింగారు. అతని గ్రామాలను పాడు చేశారు.

8 మేమెంతో కుంగిపోయి ఉన్నాం. మా పూర్వీకుల అపరాధాలకు మమ్మల్ని బాధ్యులను చేయవద్దు. నీ వాత్సల్యం మా మీదికి రానివ్వు.

9 దేవా, మా రక్షకా! నీ పేరు ప్రతిష్టలకు తగ్గట్టుగా మాకు సాయం చెయ్యి. నీ నామాన్ని బట్టి మా పాపాలను క్షమించి మమ్మల్ని రక్షించు.

10 వాళ్ళ దేవుడెక్కడ? అని ఇతర ప్రజలు ఎందుకు అనాలి? వాళ్ళు ఒలికించిన నీ సేవకుల రక్తం విషయం ప్రతిదండన మా కళ్ళ ఎదుట కనబడనీ.

11 ఖైదీల నిట్టూర్పులు నీ దగ్గరికి రానివ్వు, నీ గొప్ప బలంతో చావనై ఉన్న వారిని కాపాడు.

12 ప్రభూ, మా పొరుగు దేశాలు నిన్ను నిందించినందుకు ప్రతిగా వారిని ఏడంతల నిందకు గురి చెయ్యి.

13 అప్పుడు నీ ప్రజలమూ నీ మంద గొర్రెలమూ అయిన మేము ఎప్పటికీ నీకు ధన్యవాదాలు చెబుతాం. తరతరాలకు నీ కీర్తి ప్రచురిస్తాం.