తన దేశం పాడైపోయినందుకు యిర్మీయా విలపించడం

క్రీ.పూ. 588

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

విలాప వాక్యములు 1–2

1 ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన పట్టణం, ఇప్పుడు వెలవెలబోయింది.

ఒకప్పుడు శక్తివంతమైన దేశం, ఇప్పుడు వితంతువులా అయ్యింది.

ఒకప్పుడు అన్య జాతుల్లో రాకుమారిలా ఉండేది, ఇప్పుడు బానిస అయింది.

2 రాత్రివేళ ఎంతో శోకిస్తూ ఉంది.

కన్నీటితో దాని చెంపలు తడిసిపోయాయి.

దాని ప్రేమికులెవ్వరూ దాన్ని ఆదరించలేదు.

దాని స్నేహితులందరూ దానికి ద్రోహం చేశారు.

వాళ్ళు దాని శత్రువులయ్యారు.

3 యూదా పేదరికం, బాధ అనుభవించి, దాస్యంలోకీ, చెరలోకీ వెళ్ళింది.

అన్యజనుల్లో నివాసం ఉంది.

దానికి విశ్రాంతి లేదు.

దాన్ని తరిమే వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. తప్పించుకునే దారే లేదు.

4 నియమించిన పండగలకు ఎవరూ రాలేదు గనక సీయోను దారులు సంతాపంతో ఉన్నాయి.

పట్టణపు గుమ్మాలు ఒంటరివయ్యాయి. యాజకులు మూలుగుతున్నారు.

దాని కన్యలు దుఃఖంతో ఉన్నారు.

అది అమితమైన బాధతో ఉంది.

5 దాని విరోధులు అధికారులయ్యారు. దాని శత్రువులు వర్ధిల్లుతున్నారు.

దాని పాపం అధికమైన కారణంగా యెహోవా దాన్ని బాధకు గురి చేశాడు.

విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని వెళ్ళారు.

6 సీయోను కుమారి అందమంతా పోయింది.

దాని అధిపతులు పచ్చిక దొరకని దుప్పిలా ఉన్నారు.

వాళ్ళు శక్తి లేనివాళ్ళుగా తరిమే వాళ్ళ ముందు నిలబడ లేక పారిపోయారు.

7 దానికి బాధ కలిగిన కాలంలోనూ, ఆశ్రయం లేని కాలం లోనూ, పూర్వం తనకు కలిగిన శ్రేయస్సు అంతా యెరూషలేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంది.

దాని ప్రజలు విరోధుల చేతుల్లో పడిన కాలంలో దానికి ఎవ్వరూ సాయం చెయ్యలేదు.

దాని విరోధులు దానికి కలిగిన నాశనం చూసి పరిహసించారు.

8 యెరూషలేము ఘోరమైన పాపం చేసింది.

ఆ కారణంగా అది ఒక రుతుస్రావం రక్తం గుడ్డలాగా అయ్యింది.

దాన్ని ఘనపరచిన వాళ్ళందరూ దాని నగ్నత్వం చూసి దాన్ని తృణీకరించారు.

అది మూలుగుతూ వెనుదిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది.

9 దాని చెంగులకు మురికి అంటింది.

దాని ఎదుట ఉన్న శిక్ష అది గుర్తు చేసుకోలేదు.

అది ఎంతో వింతగా పతనం అయ్యింది.

దాన్ని ఆదరించేవాడు ఒక్కడూ లేడు.

యెహోవా, నాకు కలిగిన బాధ చూడు.

శత్రువులు ఎంత బలంగా ఉన్నారో చూడు!

10 దాని శ్రేష్ఠమైన వస్తువులన్నీ శత్రువుల చేతికి చిక్కాయి.

దాని సమాజ ప్రాంగణంలో ప్రవేశించకూడదని ఎవరి గురించి ఆజ్ఞాపించావో ఆ ప్రజలు దాని పవిత్ర ప్రాంగణంలో ప్రవేశించడం అది చూస్తూ ఉంది.

11 దాని కాపురస్థులందరూ మూలుగుతూ ఆహారం కోసం వెదుకుతున్నారు.

తమ ప్రాణం నిలుపుకోవడం కోసం తమ శ్రేష్ఠమైన వస్తువులు ఇచ్చి ఆహారం కొన్నారు.

యెహోవా, నన్ను చూడు. నేను విలువ లేని దానిగా అయ్యాను.

12 దారిలో నడిచిపోతున్న ప్రజలారా, ఇలా జరిగినందుకు మీకు ఏమీ అనిపించడం లేదా?

యెహోవాకు తీవ్రమైన కోపం వచ్చిన రోజున నాకు కలిగించిన బాధవంటి బాధ ఇంకా ఎవరికైనా కలిగిందేమో మీరు ఆలోచించి చూడండి.

13 పై నుంచి ఆయన నా ఎముకల్లోకి అగ్ని పంపించాడు.

అది నా ఎముకలను కాల్చేసింది. ఆయన నా కాళ్ళకు వల పన్ని నన్ను వెనక్కి తిప్పాడు.

ఆయన నిరంతరం నాకు ఆశ్రయం లేకుండా చేసి నన్ను బలహీనపరిచాడు.

14 నా అతిక్రమం అనే కాడి నాకు ఆయనే కట్టాడు.

అవి మూటగా నా మెడ మీద ఉన్నాయి.

నా బలం ఆయన విఫలం చేశాడు.

శత్రువుల చేతికి ప్రభువు నన్ను అప్పగించాడు. నేను నిలబడ లేకపోతున్నాను.

15 నాకు అండగా నిలిచిన శూరులను ఆయన విసిరి పారేశాడు.

నా శక్తిమంతులను అణగదొక్కడానికి ఆయన నాకు వ్యతిరేకంగా ఒక సమాజాన్ని లేపాడు.

ద్రాక్షగానుగలో వేసి ద్రాక్షలు తొక్కినట్టు ప్రభువు, కన్యక అయిన యూదా కుమారిని తొక్కాడు.

16 వీటిని బట్టి నేను ఏడుస్తున్నాను.

నా కంట నీరు కారుతోంది.

నా ప్రాణం తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వాళ్ళు నాకు దూరమైపోయారు.

శత్రువులు విజయం సాధించారు గనుక నా పిల్లలు దిక్కుమాలిన వాళ్ళయ్యారు.

17 ఆదరించేవాడు లేక సీయోను చేతులు చాపింది.

యాకోబుకు చుట్టూ ఉన్న వాళ్ళను యెహోవా అతనికి విరోధులుగా నియమించాడు.

వాళ్ళకు యెరూషలేము ఒక రుతుస్రావ రక్తం గుడ్డలాగా కనిపిస్తోంది.

18 యెహోవా న్యాయవంతుడు. నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను.

ప్రజలారా, వినండి, నా యాతన చూడండి. నా కన్యలూ, బలవంతులైన నా శూరులూ బందీలుగా వెళ్ళిపోయారు.

19 నా ప్రేమికులను నేను పిలిపించినప్పుడు వాళ్ళు నన్ను మోసం చేశారు.

నా యాజకులూ, నా పెద్దలూ తమ ప్రాణాలు నిలుపుకోడానికి ఆహారం వెదుకుతూ వెళ్లి పట్టణంలో ప్రాణం పోగొట్టుకున్నారు.

20 యెహోవా, నన్ను తేరి చూడు. నాకు అమితమైన బాధ కలిగింది. నా కడుపు తిప్పుతోంది.

నేను చేసిన దారుణమైన తిరుగుబాటు కారణంగా నా గుండె నాలో తలక్రిందులై పోతూ ఉంది.

వీధుల్లో మా పిల్లలు కత్తివాత పడుతున్నారు. ఇంట్లో చావు ఉంది.

21 నా మూలుగు విను. నన్ను ఆదరించేవాడు ఒక్కడూ లేదు. నువ్వు నాకు కష్టం కలిగించావన్న వార్త నా శత్రువులు విని సంతోషంగా ఉన్నారు.

నువ్వు ప్రకటించిన ఆ రోజు రప్పించు, అప్పుడు వాళ్ళకు కూడా నాకు జరిగినట్టే జరుగుతుంది.

22 వాళ్ళు చేసిన చెడుతనం అంతా నీ ఎదుటికి వస్తుంది గాక.

నా అతిక్రమాల కారణంగా నువ్వు నాకు కలిగించిన హింస వాళ్ళకు కూడా కలిగించు.

నేను తీవ్రంగా మూలుగుతున్నాను. నా గుండె చెరువై పోయింది.

2:1 ప్రభువు తన కోపంతో సీయోను కుమారిని నల్లటి మేఘంతో పూర్తిగా కప్పేశాడు.

ఆయన ఇశ్రాయేలు అందాన్ని ఆకాశం నుంచి భూమి మీదికి పడేశాడు.

తాను కోపగించిన దినాన ఆయన తన పాదపీఠాన్ని గుర్తు చేసుకోలేదు.

2 యాకోబు పట్టణాల్లో ఒక్క దాని మీద కూడా కనికరం లేకుండా ప్రభువు అన్నిటినీ మింగివేశాడు.

తన ఆగ్రహంతో ఆయన యూదా కుమార్తె కోటలను కూలగొట్టాడు.

ఆయన వాటిని నేల కూల్చి సిగ్గు పరిచాడు.

దాని రాజ్యాన్నీ, దాని అధిపతులను ఆయన అవమానపరిచాడు.

3 తీవ్రమైన కోపంతో ఆయన ఇశ్రాయేలు ప్రజల బలాన్ని అణచివేశాడు.

శత్రువుల ముందు ఆయన తన కుడి చెయ్యి వెనక్కు తీసుకున్నాడు.

చుట్టూ ఉన్న వాటన్నిటినీ కాల్చే రగులుతున్న అగ్నిజ్వాలలు కాల్చినట్టు ఆయన యాకోబును కాల్చేశాడు.

4 ఒక శత్రువులా ఆయన తన విల్లు ఎక్కుపెట్టాడు.

యుద్ధానికి సిద్ధంగా ఉన్న ప్రత్యర్ధి బాణం విసరడానికి తన చెయ్యి చాపినట్టు.

ఆయన నిలబడి ఉన్నాడు. చూపుకు శ్రేష్ఠమైన ప్రజలందరినీ ఆయన హతం చేశాడు.

సీయోను కుమార్తె గుడారంలో తన ఆగ్రహాన్ని అగ్ని వర్షంలా కుమ్మరించాడు.

5 ప్రభువు శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగివేశాడు.

దాని రాజమందిరాలన్నీ మింగివేశాడు.

దానికి పట్టున్న ప్రాంతాలన్నీ నాశనం చేశాడు.

యూదా కుమారిలో దుఃఖం, సంతాపం అధికం చేశాడు.

6 ఒక తోట మీద దాడి చేసినట్టు ఆయన తన గుడారం మీద దాడి చేశాడు.

సమాజ పవిత్ర ప్రాంగణాన్ని నాశనం చేశాడు.

ఆరాధన సమావేశం, విశ్రాంతి దినం సీయోనులో మరుపుకు వచ్చేలా యెహోవా చేశాడు.

కోపావేశంలో ఆయన రాజూ యాజకుడూ ఇద్దరినీ తోసిపుచ్చాడు.

7 ప్రభువు తన బలిపీఠం తోసిపుచ్చాడు.

తన పవిత్ర ప్రాంగణం నిరాకరించాడు.

దాని కోట గోడలను శత్రువుల చేతికి అప్పగించాడు.

ఏర్పరచిన రోజు సమాజ ప్రాంగణంలో వినిపించే ధ్వనిలా వాళ్ళు యెహోవా మందిరంలో ఉత్సాహ ధ్వని చేశారు.

8 సీయోను కుమారి ప్రాకారాలు పాడు చెయ్యాలని యెహోవా ఉద్దేశపూర్వకంగా నిర్ణయించాడు.

చెయ్యి చాపి కొలత గీత గీశాడు.

గోడ నాశనం చెయ్యడానికి తన చెయ్యి వెనక్కు తీయలేదు.

ఆయన ప్రహరీలు విలపించేలా చేశాడు. ప్రాకారాలు బలహీనం అయ్యేలా చేశాడు.

9 యెరూషలేము పట్టణపు గుమ్మాలు భూమిలోకి కుంగిపోయాయి.

దాని అడ్డ గడియలు ఆయన విరిచేశాడు.

దాని రాజూ, అధిపతులూ అన్యప్రజల మధ్య ఉన్నారు.

అక్కడ మోషే ధర్మశాస్త్రం లేదు. దాని ప్రవక్తలకు యెహోవా దర్శనం దొరకలేదు.

10 సీయోను కుమారి పెద్దలు మౌనంగా నేల మీద కూర్చుని ఏడుస్తున్నారు.

వాళ్ళ తలల మీద దుమ్ము పోసుకున్నారు. వాళ్ళు గోనెపట్ట కట్టుకున్నారు.

యెరూషలేము కన్యలు తల నేలకు దించుకుని ఉన్నారు.

11 నా కన్నీళ్లు ఎండిపోయాయి. నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి.

నా అంతరంగం కలవరంతో ఉంది.

నా ప్రజల కుమారి అణిచివేత కారణంగా నా పేగులు నేల మీద ఒలికి పోయాయి.

పిల్లలు, పాలు తాగే చంటిబిడ్డలు నిస్సహాయంగా గ్రామ వీధుల్లో నీరసంగా పడి ఉన్నారు.

12 పట్టణ వీధుల్లో గాయాలతో పడి ఉన్న వారిలాగా మూర్చపోతూ.

“ధాన్యం, ద్రాక్షరసం ఏవి?” అంటూ తమ తల్లుల ఒడిలో ప్రాణాలు విడుస్తున్నారు.

13 యెరూషలేము కుమారీ, నీ గురించి నేనేమనాలి? నిన్ను దేనితో పోల్చి ఆదరించాలి?

సీయోను కుమారీ, కన్యకా, నీ పతనం సముద్రమంత విస్తారమైనది.

నిన్ను స్వస్థపరచగల వాడెవడు?

14 నీ కోసం నీ ప్రవక్తలు మోసపూరితమైన బుద్ధిహీనపు దర్శనాలు చూశారు.

నువ్వు చెర లోకి వెళ్ళకుండా తప్పించడానికి వాళ్ళు నీ పాపాన్ని నీకు వెల్లడి చెయ్యలేదు.

వాళ్ళు నీ కోసం మోసపూరితంగా దర్శనాలు గ్రహించారు.

15 దారిలో వెళ్ళేవాళ్ళందరూ నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు.

వాళ్ళు యెరూషలేము కుమారిని చూసి ఎగతాళి చేస్తూ ఈల వేస్తూ, తల ఊపుతూ.

“పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అనీ, సమస్త భూనివాసులకు ఆనందకరమైన నగరం అనీ ప్రజలు ఈ పట్టణం గురించేనా చెప్పారు?” అంటున్నారు.

16 నీ శత్రువులందరూ నిన్ను చూసి పెద్దగా నోరు తెరిచారు. వాళ్ళు ఎగతాళి చేసి పళ్ళు కొరుకుతూ “దాన్ని మింగివేశాం! కచ్చితంగా ఈ రోజు కోసమేగా మనం కనిపెట్టింది!

అది జరిగింది. దాన్ని మనం చూశాం” అంటున్నారు.

17 తాను అనుకున్న పని యెహోవా ముగించాడు.

తాను పూర్వం ప్రకటించిన మాట ఆయన నెరవేర్చాడు.

నీ పట్ల కనికరం లేకుండా ఆయన నాశనం చేశాడు. నిన్ను బట్టి నీ శత్రువులు సంతోషించేలా చేశాడు.

నీ విరోధుల బలం హెచ్చించాడు.

18 ప్రజల హృదయం యెహోవాకు కేకలు పెడుతూ.

“సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహంలా పగలూ రాత్రి నీ కన్నీరు కారనివ్వు.

జాప్యం జరగనివ్వకు. నీ కంటి నుంచి వెలువడే కన్నీటిధార ఆగనివ్వకు.

19 రాత్రి పూట నువ్వు లేచి మొర్ర పెట్టు.

నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిలో నీ హృదయం కుమ్మరించు.

ప్రతి వీధి మొదట్లో ఆకలితో సతమతమౌతున్న నీ పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు ఆయన వైపు ఎత్తు.”

20 యెహోవా, చూడు. నువ్వు ఎవరి పట్ల ఈ విధంగా చేశావో గమనించు.

తమ గర్భఫలాన్ని, తాము ఎత్తుకుని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు తినడం తగునా?

యాజకుడూ ప్రవక్తా ప్రభువు పవిత్ర ప్రాంగణంలో హతం కాదగునా?

21 యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు.

నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు.

నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు.

జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు.

22 ఆరాధన దినాన ప్రజలు వచ్చినట్టు నాలుగు వైపుల నుంచి నువ్వు నా మీదికి భయం రప్పించావు.

యెహోవా ఉగ్రత దినాన ఎవరూ తప్పించుకోలేదు. ఎవరూ బతకలేదు.

నేను పెంచి పోషించిన వాళ్ళను నా శత్రువులు అంతం చేశారు.