ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా యెఫ్తా
ఫిలిష్తీయులు, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులను అణచివేస్తారు, యెఫ్తా న్యాయాధిపతి అవుతాడు.
క్రీ.పూ. 1206
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
6 ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో మళ్ళీ చెడుగా ప్రవర్తించి యెహోవాను విడిచిపెట్టి ఆయన సేవ మాని, బయలులు, అష్తారోతులు అనే అరామీయుల దేవతలను, సీదోనీయుల దేవుళ్ళను, మోయాబీయుల దేవుళ్ళను, అమ్మోనీయుల దేవుళ్ళను, ఫిలిష్తీయుల దేవుళ్ళను, పూజించడం మొదలుపెట్టారు. 7 యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండినప్పుడు, ఆయన ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వాళ్ళను అప్పగించాడు గనుక, 8 వాళ్ళు ఆ సంవత్సరం మొదలు, ఇశ్రాయేలీయులను, అంటే, యొర్దాను నది అవతల ఉన్న, గిలాదులోని అమోరీయుల దేశంలో కాపురం ఉన్న ఇశ్రాయేలీయులను పద్దెనిమిది సంవత్సరాలు చితకగొట్టి అణచివేశారు. 9 ఇంక అమ్మోనీయులు యూదాదేశస్థులతో బెన్యామీనీయులతో ఎఫ్రాయిమీయులతో యుద్ధం చెయ్యడానికి యొర్దాను దాటినందువల్ల ఇశ్రాయేలీయులకు గడ్డు పరిస్థితులు దాపురించాయి.
10 అప్పుడు ఇశ్రాయేలీయులు “మేము నీ దృష్టిలో పాపం చేశాం. మా దేవుణ్ణి విడిచి బయలులను పూజించాం” అని యెహోవాకు మొర్రపెట్టారు. 11 యెహోవా “ఐగుప్తీయుల వశంలో నుంచి, అమోరీయుల వశంలో నుంచి, అమ్మోనీయుల వశంలో నుంచి, ఫిలిష్తీయుల వశంలో నుంచి మాత్రమే కాకుండా 12 సీదోనీయులు, అమాలేకీయులు, మాయోనీయులు మిమ్మల్ని బాధ పరచినప్పుడు వాళ్ళ వశంలో నుంచి కూడా నేను మిమ్మల్ని రక్షించాను కదా, 13 అయితే మీరు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను పూజించారు గనుక నేను ఇక మిమ్మల్ని రక్షించను. 14 మీరు వెళ్లి, మీరు కోరుకొన్న దేవుళ్ళకు మొర్ర పెట్టుకోండి. మీ బాధకాలంలో అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో” అని ఇశ్రాయేలీయులతో అన్నాడు.
15 అప్పుడు ఇశ్రాయేలీయులు “మేము పాపం చేశాము, నీ దృష్టికి ఏది ఇష్టమో దాని ప్రకారం మాకు చెయ్యి. దయచేసి ఈ రోజు మమ్మల్ని రక్షించు” అని చెప్పి, 16 యెహోవాను సేవించడానికి వాళ్ళ మధ్య ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించివేసారు. ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూసి సహించలేక పోయింది. 17 అప్పుడు అమ్మోనీయులు గిలాదులో శిబిరం వేసుకుని ఉన్నారు. ఇశ్రాయేలీయులు మిస్పాలో సమకూడి ఉన్నారు. 18 కాబట్టి ప్రజలు, అంటే గిలాదు పెద్దలు “అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి పూనుకొన్నవాడు ఎవడో, అతడు గిలాదు నివాసులకందరికీ ప్రధాని అవుతాడు” అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు.
11:1 గిలాదువాడైన యెఫ్తా పరాక్రమం గల బలశాలి. అతడు ఒక వేశ్య కొడుకు. యెఫ్తా తండ్రి గిలాదు. 2 గిలాదు భార్య అతనికి కొడుకులను కన్నప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై యెఫ్తాతో “నువ్వు అన్యస్త్రీకి పుట్టావు కాబట్టి మన తండ్రి ఇంట్లో నీకు భాగం లేదు” అన్నారు.
3 యెఫ్తా తన సహోదరుల దగ్గర నుంచి పారిపోయి టోబు దేశంలో నివాసం ఉన్నప్పుడు అల్లరిమూకలు యెఫ్తా దగ్గరికి వచ్చి అతనితో కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. 4 కొంతకాలం తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. 5 అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు 6 గిలాదు పెద్దలు టోబు దేశం నుంచి యెఫ్తాను రప్పించడానికి వెళ్లి “నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు. అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేద్దాం” అని యెఫ్తాతో చెప్పారు. 7 అందుకు యెఫ్తా “మీరు నా మీద పగపట్టి నా తండ్రి ఇంట్లోనుంచి నన్ను తోలేశారు కదా. ఇప్పుడు మీకు బాధ వచ్చినప్పుడు నేను కావలసి వచ్చానా?” అని గిలాదు పెద్దలతో అన్నాడు.
8 అప్పుడు గిలాదు పెద్దలు “అందుకే మేము నీదగ్గరికి మళ్ళీ వచ్చాం. నువ్వు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేస్తే, గిలాదు నివాసులమైన మా అందరిమీద నువ్వు అధికారివి ఔతావు” అని యెఫ్తాతో అన్నారు 9 అందుకు యెఫ్తా “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకు వెళ్లిన తరువాత యెహోవా వాళ్ళను నా చేతికి అప్పగిస్తే నేనే మీకు ప్రధానినౌతానా?” అని గిలాదు ఆ పెద్దలను అడగగా, 10 గిలాదు పెద్దలు “కచ్చితంగా మేము నీ మాట ప్రకారం చేస్తాం. యెహోవా మన ఇరువురి మధ్య సాక్షిగా ఉంటాడు గాక” అని యెఫ్తాతో అన్నారు.
11 కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కలిసి వెళ్లినప్పుడు ప్రజలు అతన్ని తమకు ప్రధానిగా, అధిపతిగా నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన వాగ్దానాల సంగతి అంతా వినిపించాడు. 12 యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరికి వర్తమానికులను పంపి “నాకు నీకు మధ్య ఏమీ జరగ లేదు కదా. నువ్వు నా దేశం మీదికి యుద్ధానికి ఎందుకొచ్చావు?” అని అడిగాడు. 13 అమ్మోనీయుల రాజు “ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుంచి వచ్చినప్పుడు వాళ్ళు అర్నోను మొదలు యబ్బోకు వరకూ యొర్దాను వరకూ నా దేశం ఆక్రమించుకొన్నందుకే నేను వచ్చాను. కాబట్టి మనం శాంతియుతంగా ఉండేలా ఆ దేశాలను మళ్ళీ మాకప్పగించు” అని యెఫ్తా పంపిన వర్తమానికులతో సమాచారం పంపాడు.
14 అప్పుడు యెఫ్తా మళ్ళీ అమ్మోనీయుల రాజు దగ్గరికి ఇలా కబురంపాడు. 15 “యెఫ్తా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయులు మోయాబు దేశాన్నైనా అమ్మోనీయుల దేశాన్నైనా ఆక్రమించుకోలేదు. 16 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుంచి వస్తున్నప్పుడు వాళ్ళు ఎర్రసముద్రం వరకూ అరణ్యంలో నడిచి కాదేషుకు వచ్చారు. 17 అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజు దగ్గరికి మనుషులను పంపి నీ దేశం గుండా దయచేసి తమను వెళ్ళనిమ్మని అడిగినప్పుడు, ఎదోము రాజు ఒప్పుకోలేదు. వాళ్ళు మోయాబు రాజు దగ్గరికి అలాంటి వర్తమానమే పంపారు గాని అతడు కూడా నేను వెళ్ళనివ్వనని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివాసం ఉన్నారు.
18 తరువాత వాళ్ళు అరణ్య ప్రయాణం చేస్తూ ఎదోమీయుల దేశం, మోయాబీయుల దేశం చుట్టూ తిరిగి, మోయాబుకు తూర్పు దిక్కులో కనాను దేశంలో ప్రవేశించి అర్నోను అవతలివైపున మకాం వేశారు. వాళ్ళు మోయాబు సరిహద్దు లోపలికి వెళ్ళలేదు. అర్నోను మోయాబుకు సరిహద్దు గదా.
19 ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజు సీహోను అనే హెష్బోను రాజు దగ్గరికి దూతలను పంపి, మీ దేశం గుండా మా స్థలానికి మమ్మల్ని దయచేసి వెళ్ళనిమ్మని అతని దగ్గర మనవి చేసినప్పుడు 20 సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక, తన దేశంలోనుంచి వెళ్లనివ్వక, తన ప్రజలందర్నీ సమకూర్చుకుని యాహసులో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు. 21 అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త ప్రజలను ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు ఆ ప్రజలను హతం చేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశం అంతా స్వాధీనం చేసుకుని 22 అర్నోను నది మొదలు యబ్బోకు వరకూ, అరణ్యం మొదలు యొర్దాను వరకూ, అమోరీయుల ప్రాంతాలన్నిటిని స్వాధీనం చేసుకున్నారు.
23 కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన ప్రజలముందు నిలువకుండా తోలివేసిన తరువాత నువ్వు దాన్ని స్వాధీనం చేసుకుంటావా? 24 స్వాధీనం చేసుకోడానికి కెమోషు అనే నీ దేవుత నీకిచ్చిన దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కదా? మా దేవుడైన యెహోవా మా ఎదుట నుంచి ఎవరిని తోలివేస్తాడో వాళ్ళ స్వాస్థ్యం మేము స్వాధీనం చేసుకుంటాము. 25 మోయాబు రాజైన సిప్పోరు కొడుకు బాలాకు కంటే నువ్వు గొప్పవాడివా? అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనా కలహమాడే సాహసం చేశాడా? ఎప్పుడైనా వాళ్ళతో యుద్ధం చేశాడా? 26 ఇశ్రాయేలీయులు హెష్బోనులో దాని ఊళ్లలో అరోయేరులో దాని ఊళ్లలో అర్నోను తీరాల పట్టాణాలన్నిటిలో మూడు వందల సంవత్సరాలనుంచి నివాసం ఉంటున్నప్పుడు ఆ సమయంలో నువ్వెందుకు వాటిని పట్టుకోలేదు? 27 నేను నీ పట్ల తప్పూ చెయ్యలేదు, నువ్వే నా మీదికి యుద్ధానికి రావడం వల్ల నా పట్ల తప్పు చేస్తున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా ఈ రోజు ఇశ్రాయేలీయులకు, అమ్మోనీయులకు న్యాయం తీర్చుగాక.”
28 అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకోలేదు. 29 యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి వచ్చినప్పుడు అతడు గిలాదులో, మనష్షేలో సంచారం చేస్తూ, గిలాదు మిస్పాల నుంచి అమ్మోనీయుల దగ్గరికి సాగి వెళ్ళాడు. 30 అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మొక్కు కున్నాడు “నువ్వు నాకు అమ్మోనీయుల మీద జయం కచ్చితంగా ఇస్తే, 31 నేను అమ్మోనీయుల దగ్గర నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నప్పుడు, నన్ను ఎదుర్కోడానికి నా ఇంటి ద్వారం నుంచి బయలుదేరి ఏది వచ్చినా అది యెహోవాకు ప్రతిష్ట చేస్తాను. ఇంకా దహన బలిగా దాన్ని అర్పిస్తాను” అన్నాడు.
32 అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళగా యెహోవా అతనికి జయం ఇచ్చాడు గనుక అతడు వాళ్ళని, 33 అంటే, అరోయేరు మొదలు మిన్నీతుకు వరకూ ఆబేల్కెరామీము వరకూ ఇరవై పట్టణాల వాళ్ళను ఎవరూ మిగలకుండా హతం చేశాడు. ఆ విధంగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ముందు నిలువలేక వారికి లొంగిపోయారు. 34 యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కూతురు తంబురలతో నాట్యంతో బయలుదేరి అతనికి ఎదురొచ్చింది. ఆమె తప్ప అతనికి మగ సంతానమేగాని ఆడసంతానమేగాని లేదు.
35 కాబట్టి అతడు ఆమెను చూసి, తన బట్టలు చింపుకుని “అయ్యో నా కూతురా, నువ్వు నన్ను ఎంతో క్రుంగదీశావు, నన్ను తల్లడిల్లజేశావు. నేను యెహోవాకు మాట ఇచ్చాను గనుక వెనుక తీయలేను” అన్నాడు. 36 ఆమె “నాన్నా, యెహోవాకు మాట ఇచ్చావా? నీ నోటినుంచి వచ్చిన మాట ప్రకారం నాకు చెయ్యి. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగతీర్చుకున్నాడు” అని అతనితో అంది.
37 ఇంకా ఆమె “నా కోసం చేయవలసింది ఏదంటే, రెండు నెలల వరకూ నన్ను వదిలిపెట్టు. నేను, నా చెలికత్తెలు వెళ్లి కొండలమీద ఉండి, నా కన్యస్థితిని గూర్చి ప్రలాపిస్తాము” అని తన తండ్రితో చెప్పింది. 38 అతడు వెళ్ళమని చెప్పి రెండు నెలలు ఆమెను వెళ్ళనిచ్చాడు. ఆమె తన చెలికత్తెలతో కలిసి వెళ్లి కొండల మీద తన కన్యస్థితిని గూర్చి ప్రలాపించింది. 39 ఆ రెండు నెలల తరువాత ఆమె తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అతడు తాను మొక్కు కొన్న మొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు. 40 ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీయుల ఆడపడుచులు నాలుగు రోజులపాటు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తె కథ జ్ఞాపకం చేసుకుంటారు.
12:1 ఎఫ్రాయిమీయులు సమకూడి “నువ్వు ఉత్తరదిక్కుకు వెళ్లి అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి బయలుదేరినప్పుడు నీతో కలిసి వెళ్ళడానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నువ్వు కాపురముంటున్న నీ ఇంటిని అగ్నితో కాల్చేస్తాం” అని యెఫ్తాతో అన్నారు. 2 యెఫ్తా “నాకు, నా ప్రజలకు అమ్మోనీయులతో పెద్ద కలహం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను గాని మీరు వాళ్ళ చేతుల్లోనుంచి నన్ను రక్షించలేదు. మీరు నన్ను రక్షించకపోవడం చూసి 3 నా ప్రాణం అరచేతిలో పెట్టుకుని అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళాను. అప్పుడు యెహోవా నాకు వాళ్ళ మీద జయం ఇచ్చాడు. అయితే నాతో పోట్లాడటానికి ఈ రోజు మీరెందుకు వచ్చారు?” అన్నాడు.
4 అప్పుడు యెఫ్తా గిలాదు వారందర్నీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేశాడు. గిలాదువాళ్ళు ఎఫ్రాయిమీయుల మీద దాడి చేశారు. ఎందుకంటే వాళ్ళు “ఎఫ్రాయిమీయులకు మనష్శే గోత్రికులకు మధ్య గిలాదువారైన మీరు-ఎఫ్రాయిమీయులకు మొహం చాటేసి పారిపోయారు” అన్నారు. 5 ఎఫ్రాయిమీయులతో యుద్ధం చెయ్యడానికి గిలాదువాళ్ళు యొర్దాను దాటే రేవులను పట్టుకొన్నప్పుడు, పారిపోతున్న ఎఫ్రాయిమీయుల్లో ఎవరన్నా “నన్ను దాటనివ్వండి” అని అడిగితే గిలాదువాళ్ళు “నువ్వు ఎఫ్రాయిమీయుడవా” అని అతన్ని అడిగారు. 6 అందుకతను “కాదు” అంటే, వాళ్ళు అతన్ని చూసి “షిబ్బోలెత్” అనే మాట పలకమన్నారు. అతడు పలకలేక “సిబ్బోలెత్” అని పలికితే, వాళ్ళు అతన్ని పట్టుకుని యొర్దాను రేవుల దగ్గర చంపేశారు. ఆ సమయంలో ఎఫ్రాయిమీయుల్లో నలభై రెండు వేల మంది చనిపోయారు. 7 యెఫ్తా ఆరు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. గిలాదువాడైన యెఫ్తా చనిపోయినప్పుడు, గిలాదు పట్టణాల్లో ఒక దానిలో అతన్ని పాతిపెట్టారు.