అష్షూరీయుల దండయాత్రను గురించి యెషయా ప్రవచనం (continued)

పాలస్తీనాపై అష్షూరీయుల సైన్యం చేసే దండయాత్రను గురించి యెషయా ప్రవచనం.

క్రీ.పూ. 715

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెషయా 11–13

1 యెష్షయి వేరు నుంచి చిగురు పుడుతుంది. అతని వేరుల నుంచి కొమ్మ ఎదిగి ఫలిస్తుంది.

2 జ్ఞానవివేకాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, ఆలోచన బలాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, తెలివినీ యెహోవా పట్ల భయభక్తులనూ పుట్టించే యెహోవా ఆత్మ అతని మీద నిలుస్తుంది.

3 యెహోవా భయం అతనికి ఆనందం కలిగిస్తుంది.

4 కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు. తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసుల్లో దీనులైన వాళ్లకు నిజాయితీగా విమర్శ చేస్తాడు. తన నోటి దండంతో లోకాన్ని కొడతాడు. తన పెదవుల ఊపిరితో దుర్మార్గులను హతం చేస్తాడు.

5 అతని నడుముకు న్యాయం, అతని మొలకు సత్యం నడికట్టుగా ఉంటాయి.

6 తోడేలు గొర్రెపిల్లతో నివాసం చేస్తుంది. చిరుతపులి మేకపిల్లతో కలిసి పడుకుంటుంది. దూడ, సింహం కూన, కొవ్విన దూడ కలిసి ఉంటాయి. చిన్న పిల్లవాడు వాటిని తోలుకెళ్తాడు.

7 ఆవు, ఎలుగుబంటి కలిసి మేస్తాయి. వాటి పిల్లలు ఒక్క చోటే పండుకుంటాయి. ఎద్దు మేసినట్టు సింహం గడ్డి మేస్తుంది.

8 పాలు తాగే పసిపిల్ల పాము పుట్ట మీద ఆడుకుంటుంది. పాలు విడిచిన పిల్ల, సర్పం పుట్టలో తన చెయ్యి పెడుతుంది.

9 నా పరిశుద్ధ పర్వతమంతటి మీద, ఏ మృగమూ హాని చెయ్యదు, నాశనం చెయ్యదు. ఎందుకంటే సముద్రం నీటితో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.

10 ఆ రోజున ప్రజలకు ధ్వజంగా యెష్షయి వేరు నిలుస్తుంది. జాతులు ఆయన కోసం వెదకుతాయి. ఆయన విశ్రమించే స్థలం ప్రభావం కలది అవుతుంది.

11 ఆ రోజున మిగిలిన తన ప్రజలను అష్షూరులో నుంచీ. ఐగుప్తులో నుంచీ, పత్రోసులో నుంచీ, కూషులో నుంచీ, ఏలాములో నుంచీ, షీనారులో నుంచీ, హమాతులో నుంచీ, సముద్రద్వీపాల్లో నుంచీ విడిపించి రప్పించడానికి యెహోవా రెండోసారి తన చెయ్యి చాపుతాడు.

12 జాతులను పోగు చెయ్యడానికి ఆయన ఒక ధ్వజం నిలబెట్టి, బహిష్కరణకు గురైన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాడు. చెదిరి పోయిన యూదా వాళ్ళను భూమి నలుదిక్కుల నుంచి సమకూరుస్తాడు.

13 ఎఫ్రాయిముకున్న అసూయను నిలువరిస్తాడు. యూదా పట్ల విరోధంగా ఉన్న వాళ్ళు నిర్మూలమౌతారు. ఎఫ్రాయిము యూదాను బట్టి అసూయ పడడు. యూదా ఎఫ్రాయిమును బాధించడు

14 వాళ్ళు పడమటివైపు ఉన్న ఫిలిష్తీయుల కొండల మీదకి దూసుకొస్తారు. వాళ్ళు ఏకమై తూర్పు వారిని కొల్లగొడతారు. వాళ్ళు ఎదోము మీద, మోయాబు మీద దాడి చేస్తారు, అమ్మోనీయులు వాళ్లకు విధేయులౌతారు.

15 యెహోవా ఐగుప్తు సముద్రం అగాధాన్ని విభజిస్తాడు. చెప్పులు తడవకుండా మనుషులు దాన్ని దాటి వెళ్ళేలా తన వేడి ఊపిరిని ఊది, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించి, ఏడు కాలువలుగా దాన్ని చీలుస్తాడు.

16 ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు వచ్చిన రోజున వాళ్లకు దారి ఉన్నట్టు, అష్షూరులో మిగిలిన ఆయన ప్రజలు అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్లకు రాజమార్గం ఉంటుంది.

12:1 ఆ రోజున మీరు ఇలా అంటారు,

“యెహోవా, నువ్వు నా మీద కోపపడ్డావు, నీ కోపం చల్లారింది, నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు నన్ను ఆదరించావు.

2 చూడు, దేవుడే నా రక్షణ. భయం లేకుండా నేను ఆయన్ని నమ్ముతాను. యెహోవా, అవును, యెహోవాయే నాకు బలం. ఆయనే నా కీర్తన. ఆయనే నాకు రక్షణ అయ్యాడు.”

3 ఆనందంతో రక్షణ బావుల్లోనుంచి మీరు నీళ్లు చేదుకుంటారు. ఆ రోజున మీరు ఇలా అంటారు,

4 “యెహోవాను స్తుతించండి. ఆయన పేరు పెట్టి పిలవండి. జనాల్లో ఆయన క్రియలు చాటించండి. ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి.

5 యెహోవాను గూర్చి పాటలు పాడండి. ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈ సంగతి భూమంతా తెలియనివ్వండి.

6 గొప్పవాడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ మధ్య ఉన్నాడు గనుక, సీయోను నివాసీ, అరిచి సంతోషంతో కేకలు పెట్టు.”

13:1 బబులోనును గూర్చి ఆమోజు కొడుకు యెషయా స్వీకరించిన ప్రకటన.

2 చెట్లు లేని కొండ మీద గుర్తు కోసం ఒక జెండా పాతండి. ప్రజలు ప్రధానుల ద్వారాల్లో ప్రవేశించమని కేకపెట్టి వాళ్ళను పిలిచి, చెయ్యి ఊపి సైగ చెయ్యండి.

3 నాకు ప్రతిష్ఠితులైన వాళ్లకు నేను ఆజ్ఞ ఇచ్చాను. నా కోపం అమలు చెయ్యమని నా శూరులను పిలిచాను. నా ప్రభావాన్నిబట్టి ఆనందించే వాళ్ళను పిలిపించాను.

4 కొండల్లో ఒక పెద్ద జనసమూహం ఉన్నట్టు వినిపిస్తున్న ఆ శబ్దం వినండి. సమకూడుతున్న రాజ్యాల ప్రజలు చేసే అల్లరి శబ్దం వినండి. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా యుద్ధం కోసం తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు.

5 సర్వలోకాన్ని పాడు చెయ్యడానికి దూర దేశం నుంచీ, ఆకాశపు అంచుల నుంచీ యెహోవా, ఆయన తీర్పు అమలు చేసే సాధనాలు వస్తున్నారు.

6 బిగ్గరగా అరవండి, ఎందుకంటే, యెహోవా దినం దగ్గరపడింది. అది సర్వశక్తుడైన దేవుని దగ్గర నుండి విధ్వంసం తెస్తుంది.

7 అందువలన చేతులన్నీ బలహీనమై వేలాడతాయి, ప్రతివాడి గుండె కరిగిపోతుంది.

8 ప్రజలు భయభ్రాంతులౌతారు. పురిటినొప్పులు పడే స్త్రీలాగా వాళ్లకు వేదనలు, దుఃఖాలు కలుగుతాయి. ఒకరినొకరు విస్తుపోయి చూసుకుంటారు. వాళ్ళ ముఖాలు మండిపోతూ ఉంటాయి.

9 యెహోవా దినం వస్తోంది. దేశాన్ని పాడు చెయ్యడానికీ, పాపులు దానిలో ఉండకుండా పూర్తిగా నాశనం చెయ్యడానికీ క్రూరమైన ఉగ్రతతో, ప్రచండమైన కోపంతో అది వస్తోంది.

10 ఆకాశ నక్షత్రాలు, నక్షత్రరాసులు తమ వెలుగును ఇయ్యవు. ఉదయం నుంచే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు ప్రకాశించడు.

11 చెడుతనాన్ని బట్టి ఈ లోకాన్నీ, తమ దోషాన్ని బట్టి దుష్టులనూ శిక్షిస్తాను. గర్విష్టుల అహంకారం అంతమొందిస్తాను. క్రూరుల అహంకారం అణిచివేస్తాను.

12 బంగారం కన్నా మనుషులనూ, ఓఫీరు దేశపు సువర్ణం కన్నా మానవజాతినీ అరుదుగా ఉండేలా చేస్తాను.

13 సైన్యాలకు అధిపతి అయిన యెహోవా కోపాగ్ని కురిసే రోజున, ఆయన ఉగ్రతకు ఆకాశం వణికేలా, భూమి తన స్థానం తప్పేలా నేను చేస్తాను.

14 అప్పుడు వేటకు గురైన జింకలాగా, పోగుచెయ్యని గొర్రెల్లాగా ప్రజలు తమ తమ స్వజాతి వైపు తిరుగుతారు. తమ స్వదేశాలకు పారిపోతారు.

15 దొరికిన ప్రతివాడూ కత్తివాత కూలుతాడు. బందీగా దొరికిన ప్రతివాడూ ఖడ్గంతో చనిపోతాడు.

16 వాళ్ళు చూస్తూ ఉండగా వాళ్ళ పసిపిల్లలను విసిరి కొట్టినప్పుడు ముక్కలౌతారు. వాళ్ళ ఇళ్ళు దోపిడీ అవుతాయి. వాళ్ళ భార్యలు అత్యాచారానికి గురౌతారు.

17 చూడు, వాళ్ళ మీద దాడి చెయ్యడానికి నేను మాదీయులను రేపడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు వెండిని పట్టించుకోరు. బంగారం కూడా వాళ్ళకు ఆనందం కలిగించదు.

18 వాళ్ళ బాణాలు యువకులను చీలుస్తాయి. దూసుకుపోతాయి. వాళ్ళు పిల్లలను విడిచిపెట్టరు, పసిపిల్లల మీద దయ చూపించరు.

19 అప్పుడు రాజ్యాల్లో గొప్పదిగా, కల్దీయుల శోభకూ, అతిశయానికీ కారణమైన బబులోను, దేవుడు పాడుచేసిన సొదొమ గొమొర్రాల్లాగా అవుతుంది.

20 అది ఇంకెన్నడూ నివాసస్థలంగా ఉండదు. తరతరాల్లో ఇంక దానిలో ఎవడూ కాపురం ఉండడు. అరబీయుడు అక్కడ తన గుడారం వెయ్యడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ విశ్రాంతి తీసుకోనివ్వరు.

21 ఎడారి మృగాలు అక్కడ ఉంటాయి. వాళ్ళ ఇళ్ళ నిండా గుడ్లగూబలు, నిప్పుకోళ్ళూ ఉంటాయి. కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి.

22 వాళ్ళ కోటల్లో అడవి కుక్కలూ, వాళ్ళ అందమైన రాజమందిరాల్లో నక్కలూ అరుస్తాయి. దాని కాలం దగ్గరపడింది. దాని రోజులు ఇక ఆలస్యం కావు.