ఇశ్రాయేలీయుల్లో విగ్రహారాధన ఆరంభం
క్రీ.పూ. 1413
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
6 యెహోషువ ప్రజలను అక్కడ నుంచి సాగనంపినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోడానికి వాళ్ళకు కేటాయించిన స్థలాలకు వెళ్లారు.
7 యెహోషువ బ్రతికిన కాలమంతటిలోనూ, యెహోషువ తరువాత కాలంలోనూ ఇంకా బ్రతికి ఉండి ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన కార్యాలన్నిటిని చూసిన పెద్దల రోజుల్లోనూ ప్రజలు యెహోవాను సేవిస్తూ ఉన్నారు. 8 నూను కుమారుడు, యెహోవా దాసుడు అయిన యెహోషువ నూట పది సంవత్సరాల వయస్సులో చనిపోయినప్పుడు అతనికి స్వాస్థ్యంగా వచ్చిన ప్రదేశం సరిహద్దులో ఉన్న తిమ్నత్సెరహులో ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు. 9 అది ఎఫ్రాయిమీయుల ఎడారిలో గాయషు కొండకు ఉత్తరం దిక్కున ఉంది.
10 ఆ తరం వారంతా తమ తమ పితరుల దగ్గరికి చేరారు. వారి తరువాత యెహోవానుగాని, ఆయన ఇశ్రాయేలీయుల కోసం చేసిన కార్యాలను గాని తెలియని తరం ఒకటి మొదలయ్యింది. 11 ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో పాపం చేసి, బయలు దేవుళ్ళను పూజించారు. 12 ఐగుప్తుదేశంలో నుంచి వాళ్ళను రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను అనుసరించి, వాళ్ళ చుట్టూ ఉండే ఆ ప్రజల దేవుళ్ళకు సాగిలపడి, యెహోవాకు కోపం పుట్టించారు. 13 వాళ్ళు యెహోవాను విడిచిపెట్టి బయలును అష్తారోతు దేవతను పూజించారు.
1 ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో మీకా అనే ఒక వ్యక్తి నివసించేవాడు. 2 అతడు తన తల్లితో “నీ దగ్గర నుండి నేను తీసుకున్న పదకొండు వందల వెండి ఇదిగో. వాటిని తీసుకున్న వాణ్ణి నువ్వు శపించడం నేను విన్నాను. చూడు, అవి నా దగ్గరే ఉన్నాయి. నేనే వాటిని దొంగిలించాను” అన్నాడు. అతని తల్లి అతణ్ణి చూసి “కొడుకా, యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక!” అంది.
3 అతడు ఆ పదకొండు వందల వెండిని తిరిగి తన తల్లికి ఇచ్చేశాడు. ఆమె “ఈ సొమ్మును నేను యెహోవాకు ఇచ్చేస్తున్నాను. దీనితో నా కొడుకు కోసం ఒక చెక్క విగ్రహమూ, మరొక పోత విగ్రహమూ తయారు చేయిస్తాను. అందుకని ఇవి నీకే తిరిగి ఇచ్చేస్తాను” అంది. 4 అతడు ఆ నాణేలను తన తల్లికి ఇచ్చాడు. ఆమె వాటిలో రెండు వందలు తీసి ఒక కంసాలికి ఇచ్చింది. వాడు వాటితో ఒక విగ్రహాన్ని చెక్కాడు. లోహంతో మరో విగ్రహాన్ని పోత పోశాడు. ఆ విగ్రహాన్ని మీకా ఇంట్లోనే ఉంచారు.
5 మీకా ఇంట్లో విగ్రహాలున్న పూజ గది ఒకటుంది. అతడు ఒక ఎఫోదునూ కొన్ని విగ్రహాలనూ చేయించి అందులో ఉంచాడు. తన కొడుకుల్లో ఒకణ్ణి పూజారిగా ప్రతిష్టించాడు. అతని కొడుకే అతనికి యాజకుడు అయ్యాడు. 6 ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టానుసారం జీవిస్తున్నారు.
7 అక్కడ యూదా గోత్రంలో చేరిన ఒక లేవీ యువకుడు ఉండేవాడు. ఇతడు యూదా ప్రాంతానికి చెందిన బేత్లెహేము నుండి వచ్చాడు. 8 ఆ వ్యక్తి తనకో నివాస స్థలం కోసం యూదా బేత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో ఉన్న మీకా యింటికి వచ్చాడు. 9 అతణ్ణి మీకా “నీవు ఎక్కడ నుంచి వచ్చావు?” అని అడిగాడు. దానికతడు “నేను యూదా బేత్లెహేమునుంచి వచ్చిన లేవీయుణ్ణి. నాకో నివాస స్థలం కోసం వెదుకుతున్నాను.” అన్నాడు. 10 అప్పుడు మీకా “నువ్వు నా దగ్గరే ఉండు. నాకు తండ్రిగా, యాజకుడుగా ఉండు. నీకు సంవత్సరానికి పది వెండి నాణేలూ, బట్టలూ, ఆహారమూ ఇస్తాను.” అన్నాడు. దానికి ఆ లేవీయుడు అంగీకరించాడు. 11 ఆ వ్యక్తి దగ్గర ఉండిపోడానికి ఒప్పుకున్నాడు. ఆ యువకుడు అతని కొడుకుల్లో ఒకడిగా ఉన్నాడు. 12 మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్టించాడు. అతడు మీకాకు యాజకుడుగా ఉన్నాడు. 13 అప్పుడు మీకా “ఈ లేవీయుడు నాకు యాజకుడుగా ఉన్నాడు కాబట్టి యెహోవా నాకు తప్పక మేలు చేస్తాడని నాకు తెలుసు” అన్నాడు.
18:1 ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ఇశ్రాయేలీయుల గోత్రాల్లో దాను గోత్రం వారు తాము నివసించడానికి ఒక స్థలం కోసం వెదుకుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకూ దాను గోత్రం వారు వారసత్వంగా భూమిని పొందలేదు.
2 దాను వంశీకులు తమలో ఐదుగురు శూరులను ఎన్నుకుని, ఆ దేశమంతా తిరిగి దాన్ని పరిశోధించడానికి జొర్యా నుండీ ఎష్తాయోలు నుండీ “మీరు వెళ్లి దేశమంతా చూసి రండి” అని చెప్పి పంపారు. 3 వాళ్ళు ప్రయాణిస్తూ ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతానికి వచ్చారు. అక్కడ మీకా ఇంట్లో ఆ రాత్రి ఆతిథ్యం పొందారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ లేవీ యువకుని మాట గుర్తు పట్టారు. అతణ్ణి చూసి “నిన్ను ఇక్కడికి ఎవరు రప్పించారు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఎందుకున్నావు?” అంటూ అడిగారు. 4 అతడు మీకా తనకు చేసిందంతా చెప్పాడు. “నేను మీకాకు పూజారిగా ఉన్నాను. అతడు నాకు జీతం ఇస్తున్నాడు” అని చెప్పాడు.
5 అప్పుడు వాళ్ళు “మేము చేయబోయే పని సఫలమౌతుందో లేదో దేవుణ్ణి అడిగి మాకు చెప్పు” అన్నారు. 6 దానికా యాజకుడు “క్షేమంగా వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన మార్గంలో యెహోవాయే మిమ్మల్ని నడిపిస్తాడు.” అన్నాడు. 7 అప్పుడు ఆ ఐదుగురు మనుష్యులు వెళ్లి లాయిషుకు వచ్చారు. అక్కడ జనం, సీదోనీయుల్లా భద్రంగా, నిర్భయంగా నివసించడం చూశారు. ఆ దేశాన్ని ఆక్రమించుకుని అధికారం చెలాయించేవాళ్ళు గానీ, బాధలు పెట్టేవాళ్ళు గానీ లేకపోవడం చూసారు. వాళ్ళు సీదోనీయులకు దూరంగా నివసించడమూ, వాళ్ళకు ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేకపోవడమూ చూశారు.
8 వాళ్ళు జొర్యాలోనూ ఎష్తాయోలులోనూ ఉన్న తమ వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళు “మీరిచ్చే నివేదిక ఏమిటి?” అని అడిగారు. 9 దానికి వాళ్ళు “రండి! మనం వాళ్ళపై దాడి చేద్దాం. ఆ దేశాన్ని మేము చూశాం. అది ఎంతో బాగుంది. చేతులు ముడుచుకుని కూర్చోకండి. వాళ్ళపై దాడి చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడంలో ఇక ఆలస్యం చేయవద్దు. 10 మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ‘మేము భద్రంగా ఉన్నాం’ అని భావిస్తున్న వారిని మీరు చూస్తారు. ఆ దేశం విశాలమైనది. భూమి మీద ఎలాంటి కొరతా అక్కడ లేదు. దేవుడు దాన్ని మీకిచ్చాడు,” అన్నారు. 11 అప్పుడు జొర్యాలోనూ ఎష్తాయోలులోనూ ఉన్న దాను గోత్రం వాళ్ళలో ఆరు వందలమంది ఆయుధాలు ధరించి బయలుదేరి యూదా దేశం లోని కిర్యత్యారీములో ఆగారు. 12 అందుకే ఆ స్థలానికి ఇప్పటికీ మహానేదాన్ అని పేరు. దాను గోత్రం వాళ్ళ సైన్యం అని దాని అర్థం. అది కిర్యత్యారీముకు పడమరగా ఉంది.
13 అక్కడనుండి వాళ్ళు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతానికి వచ్చి అక్కడే ఉన్న మీకా ఇంటికి వచ్చారు. 14 అప్పుడు లాయిషు దేశాన్ని చూడటానికి వెళ్ళిన ఆ ఐదుగురు శూరులు తమ వారిని చూసి “ఈ ఇంట్లో ఎఫోదూ, గృహ దేవుళ్ళూ, చెక్కిన ప్రతిమా, పోత విగ్రహమూ ఉన్నాయని మీకు తెలుసా? మీరేం చేయాలో ఆలోచించుకోండి” అన్నారు. 15 వారు ఆ వైపుకు తిరిగి ఆ లేవీ యువకుడు ఉన్న మీకా ఇంటికి వచ్చి అతణ్ణి కుశల ప్రశ్నలడిగారు. 16 దాను గోత్రానికి చెందిన ఆరు వందలమంది యుధ్ధానికై ఆయుధాలు ధరించి సింహద్వారం దగ్గర నిల్చున్నారు. 17 అప్పుడు ఆ యాజకుడు ఆయుధాలు ధరించిన ఆరు వందలమందితో కలసి సింహద్వారం దగ్గర నిలిచి ఉండగా దేశాన్ని పరిశోధించడానికి వెళ్ళిన ఆ ఐదుగురు శూరులు లోపలికి వెళ్ళి ఆ ప్రతిమనూ, ఎఫోదునూ, గృహ దేవుళ్ళ విగ్రహాలనూ, పోత విగ్రహాన్నీ తీసుకున్నారు.
18 వీరు మీకా యింటిలోకి వెళ్ళి ఆ ప్రతిమనూ, ఎఫోదునూ, గృహ దేవుళ్ళ విగ్రహాలనూ, పోత విగ్రహాన్నీ పట్టుకున్నప్పుడు ఆ యాజకుడు “మీరేం చేస్తున్నారు?” అని అడిగాడు. 19 వాళ్ళు “నువ్వు నోరు మూసుకో. నీ చెయ్యి నోటి మీద ఉంచుకుని మాతో కలసి వచ్చి మాకు తండ్రిగా యాజకుడుగా ఉండు. ఒక ఇంటికి యాజకుడుగా ఉండటం గొప్ప సంగతా లేక ఇశ్రాయేలీయుల్లో ఒక గోత్రానికి యాజకుడుగా ఉండటం గొప్ప సంగతా” అని అడిగారు. 20 ఆ మాటలకు అ యాజకుడు హృదయంలో సంతోషించాడు. ఆ ఎఫోదునూ, గృహ దేవుళ్ళనూ చెక్కిన ప్రతిమనూ తీసుకుని వాళ్ళతో కలసి పోయాడు. 21 అక్కడి నుంచి వాళ్ళు వెనక్కు తిరిగారు. చిన్నపిల్లలనూ, పశువులనూ, సామగ్రినీ తమకు ముందుగా తరలించుకు పోయారు. 22 వాళ్ళు మీకా ఇంటి నుంచి కొంత దూరం వెళ్ళాక మీకా అతని పొరుగు వారూ సమకూడి దాను గోత్రం వారిని వెంటాడి వాళ్ళను కలుసుకుని కేకలు వేసి పిలిచారు. 23 దానీయులు తిరిగి చూసి “నీకేం కావాలి? ఇలా గుంపుగా వస్తున్నరేమిటి?” అని మీకాను అడిగారు. 24 దానికి అతడు “నేను చేయించిన నా దేవుళ్ళనూ, నా కుల పూజారినీ మీరు పట్టుకుపోతున్నారు. ఇక నాకేం మిగిలింది? ‘నీకేం కావాలి?’ అని నన్ను ఎలా అడుగుతున్నారు?” అన్నాడు. 25 దాను గోత్రం వారు అతనితో “జాగ్రత్త! నీ స్వరం మా వాళ్లకు ఎవరికీ వినపడనీయకు. వాళ్ళకు నీమీద కోపం వచ్చిందంటే నీమీద దాడి చేసి నిన్నూ నీ కుటుంబాన్నీ చంపేస్తారు” అన్నారు. 26 ఈ విధంగా దాను గోత్రం వారు తమ మార్గాన వెళ్ళిపోయారు. వాళ్ళు తన కంటే బలవంతులని అర్థం చేసుకున్న మీకా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. 27 దాను గోత్రం వాళ్ళు మీకా తయారు చేసుకున్న వాటినీ, అతని యాజకుడినీ పట్టుకున్న తరువాత లాయిషుకు వచ్చారు. అక్కడ నిర్భయంగా క్షేమంగా నివసిస్తున్న వారిని కత్తితో చంపేశారు. ఆ పట్టణాన్ని తగులబెట్టారు. 28 ఆ పట్టణం సీదోనుకు దూరంగా ఉండటం వల్లా, వాళ్లకు ఎవరితోనూ సంబంధం లేకపోవడం వల్లా వాళ్ళను రక్షించడానికి ఎవరూ రాలేదు. ఆ పట్టణం బెత్రేహోబు లోయకు దగ్గరగా ఉంది. దాను గోత్రం వాళ్ళు ఆ పట్టణాన్ని పునర్నిర్మాణం చేశారు. 29 తమ పూర్వీకుడైన దాను పేరును బట్టి ఆ పట్టణానికి దాను అని పేరు పెట్టారు. అంతకు ముందు ఆ పట్టణం పేరు లాయిషు.
30 దాను గోత్రం వాళ్ళు చెక్కిన ప్రతిమను పెట్టుకున్నారు. మోషే మనుమడూ, గెర్షోము కొడుకు అయిన యోనాతాను అనే వాడూ, అతని కుమారులూ ఆ దేశ ప్రజలు బందీలుగా వెళ్ళే వరకూ వారికి యాజకులుగా ఉన్నారు. 31 దేవుని మందిరం షిలోహులో ఉన్నంత కాలం వాళ్ళు మీకా చేయించిన చెక్కిన విగ్రహాన్ని పూజించారు.