భాగం 2: దేవాలయం నాశనమయ్యే వరకు బబులోనులో జరిగిన సంఘటనలు
చెర ప్రారంభం నుండి దేవాలయం నాశనమయ్యే వరకు బబులోనులో జరిగిన సంఘటనలు.
బబులోనులో దానియేలు, అతని సహచరుల స్థితిగతులు
క్రీ.పూ. 606
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
8 రాజు తినే ఆహారం, తాగే ద్రాక్షారసం పుచ్చుకుని తనను తాను అపవిత్రం చేసుకోకూడదని దానియేలు నిర్ణయించుకున్నాడు. వాటిని తిని, తాగి అపవిత్రం కాకుండా ఉండేందుకు వాటిని తమకు వడ్డించకుండా చూడమని నపుంసకుల అధికారి దగ్గర అనుమతి కోరుకున్నాడు.
9 దేవుడు ముఖ్య అధికారికి దానియేలు పట్ల దయ, అభిమానం కలిగేలా చేశాడు. 10 ఆ అధిపతి దానియేలుతో “మీకు రాజ భోజనం, ద్రాక్షారసం వడ్డించమని నాకు ఆజ్ఞాపించిన నా యజమానియైన రాజు గురించి నేను భయపడుతున్నాను. మీతోపాటు ఉన్న ఇతర యువకుల ముఖాల కంటే మీ ముఖాలు పాలిపోయి ఉన్నట్టు రాజు కనిపెట్టినప్పుడు మీవల్ల నాకు రాజునుండి ప్రాణాపాయం కలుగుతుంది” అన్నాడు.
11 దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలపై ముఖ్య అధికారి నియమించిన పర్యవేక్షకునితో దానియేలు మాట్లాడాడు. 12 “నీ దాసులమైన మాకు తినడానికి శాకాహారం, తాగడానికి మంచినీళ్లు మాత్రం ఇప్పించు. అలా పది రోజులపాటు ఇచ్చి మమ్మల్ని పరీక్షించు. 13 తరువాత మా ముఖాలను, రాజు నియమించిన భోజనం తిన్న ఇతర యువకుల ముఖాలను పరీక్షించి నీకు తోచినట్టు నీ దాసులమైన మా పట్ల జరిగించు.” 14 ఆ పర్యవేక్షకుడు అందుకు అంగీకరించాడు. పది రోజులపాటు వాళ్ళను పరీక్షించాడు.
15 పది రోజుల గడిచాయి. రాజు నియమించిన భోజనం తినే యువకుల ముఖాల కంటే వీరి ముఖాలు ఆరోగ్యకరంగా కళకళలాడుతూ కనిపించాయి. 16 ఆ పర్యవేక్షకుడు రాజు వాళ్లకు ఇవ్వమని చెప్పిన మాంసాహారం, ద్రాక్షారసం స్థానంలో శాకాహారం ఇవ్వడం మొదలుపెట్టాడు. 17 ఈ నలుగురు యువకుల విషయం ఏమిటంటే, దేవుడు వారికి జ్ఞానం, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత, తెలివితేటలు అనుగ్రహించాడు. దానియేలుకు సకల విధాలైన దైవదర్శనాలకు, కలలకు అర్థాలు, భావాలు వివరించగలిగే సామర్థ్యం దేవుడు అనుగ్రహించాడు.
18 గడువు ముగిసిన తరువాత ఆ యువకులను తన ఎదుట ప్రవేశపెట్టమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. నపుంసకుల అధికారి వాళ్ళను రాజు సమక్షంలో నిలబెట్టాడు. 19 రాజు వాళ్ళను పరిశీలించాడు. వాళ్ళందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలతో సాటియైన వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు. కాబట్టి రాజు వాళ్ళను తన ఆస్థానంలో ఉద్యోగులుగా నియమించాడు. 20 రాజు వీళ్ళతో సంభాషించి వీళ్ళ తెలివితేటలు పరీక్షించాడు. జ్ఞానం, వివేకం ప్రదర్శించే ప్రతి విషయంలో ఈ యువకులు తన రాజ్యమంతటిలో ఉన్న మాంత్రికుల కంటే, ఆత్మలను సంప్రదిస్తామని చెప్పుకునే వారి కంటే పది రెట్లు సమర్థులని రాజు గ్రహించాడు. 21 కోరెషు చక్రవర్తి పాలన మొదటి సంవత్సరం వరకూ దానియేలు అక్కడ ఉన్నాడు.
యెహెజ్కేలుకు బాధ్యత అప్పగించడం క్రీ.పూ. 595
1 నా వయస్సు ముప్ఫయ్యవ సంవత్సరం నాలుగో నెల ఐదో రోజున ఉన్నట్టుండి ఆకాశం తెరుచుకుంది. నేను దైవ దర్శనాలు చూశాను. ఆ రోజుల్లో నేను కెబారు నది దగ్గర బందీల మధ్య నివసిస్తున్నాను. 2 అది యెహోయాకీను రాజును బందీగా పట్టుకెళ్ళిన తరువాత ఐదో సంవత్సరం. ఆ నెల ఐదో రోజున 3 కల్దీయుల దేశంలో కెబారు నది పక్కన బూజీ కొడుకూ, యాజకుడూ అయిన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు బలంగా వచ్చింది. అక్కడే యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది.
4 అప్పుడు ఉత్తరం వైపు నుండి ఒక తుఫాను వస్తుండడం చూశాను. ఒక మహా మేఘం, దానిలో ప్రజ్వలించే అగ్ని కనిపించాయి. ఆ మేఘంలో గొప్ప కాంతి కనిపించింది. ఆ కాంతి దాన్ని ఆవరించి ఉంది. ఆ మేఘంలో మండే అగ్ని మెరుగు పెట్టిన కంచులా ఉంది. 5 దాని మధ్యలో నాలుగు జీవుల్లాంటి ఒక స్వరూపం కనిపించింది. అవి మానవ రూపంలో ఉన్నాయి. 6 ఒక్కో దానికి నాలుగు ముఖాలు ఉన్నాయి. అలాగే నాలుగు రెక్కలు ఉన్నాయి.
7 వాటి కాళ్లు తిన్నగా ఉన్నాయి. వాటి అరికాళ్ళు దూడ డెక్కల్లా ఉన్నాయి. అవి మెరుగు పెట్టిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి. 8 అయినా మనుషులకున్నట్టే వాటికి చేతులు ఉన్నాయి. అవి వాటి నాలుగు రెక్కల కింద ఉన్నాయి. నాలుగు జీవుల ముఖాలూ, రెక్కలూ ఇలా ఉన్నాయి. 9 వాటి రెక్కలు పక్కనే ఉన్న మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. అవి వెళ్తున్నప్పుడు ఏ వైపుకీ తిరగడం లేదు. అవన్నీ ముందుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
10 వాటి ముఖాలు ఎదుట నుంచి చూస్తే మనిషి ముఖాల్లా ఉన్నాయి. కుడివైపు నుండి చూస్తే సింహం ముఖంలా ఎడమవైపు నుండి చూస్తే ఎద్దు ముఖంలా ఉన్నాయి. ఇంకా ఈ నాలుగు జీవులకీ డేగ లాంటి ముఖాలు ఉన్నాయి. 11 వాటి ముఖాలు అలాంటివే. వాటి రెక్కలు పైకి విచ్చుకుని ఉన్నాయి. దాంతో ఒక జత రెక్కలు మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. ఇంకో జత రెక్కలు వాటి దేహాలను కప్పుతూ ఉన్నాయి. 12 అవి అన్నీ ముందుకు సాగి వెళ్తున్నాయి. అటూ ఇటూ తిరుగకుండా ఆత్మ నిర్దేశించిన మార్గంలో వెళ్తున్నాయి.
13 ఈ జీవులు రగులుతున్న నిప్పు కణికల్లా, దివిటీల్లా కనిపిస్తున్నాయి. ప్రకాశవంతమైన అగ్ని ఆ జీవుల మధ్య కదులుతూ ఉంది. అక్కడ నుండి మెరుపులు వస్తున్నాయి. 14 ఆ జీవులు వెనక్కీ ముందుకీ కదులుతున్నాయి. దాంతో అవి మెరుపుల్లా కనిపిస్తున్నాయి.
15 తరువాత నేను ఆ జీవులను చూస్తుంటే వాటి పక్కనే నేలపైన చక్రాల వంటివి కనిపించాయి. 16 ఆ చక్రాల నిర్మాణం ఇలా ఉంది, ప్రతి చక్రం గోమేధికంలా ఉంది. నాలుగు చక్రాలూ ఒకేలా ఉన్నాయి. ఒక చక్రంలో మరో చక్రం ఇమిడి ఉన్నట్టుగా ఉన్నాయి.
17 అవి కదిలినప్పుడు అన్నీ నాలుగు వైపులకీ కదులుతున్నాయి. ఏదీ వెనక్కి తిరగడం లేదు. 18 వాటి అంచులు ఎత్తుగా ఉండి భయం పుట్టిస్తున్నాయి. వాటి అంచుల చుట్టూ కళ్ళు ఉన్నాయి. 19 ఆ జీవులు కదిలినప్పుడల్లా వాటితో పాటు ఆ చక్రాలు కూడా కదిలాయి. జీవులు భూమి పై నుండి పైకి లేచినప్పుడు ఆ చక్రాలు కూడా లేచాయి. 20 ఆత్మ ఎక్కడికి కదిలి వెళ్తున్నాడో జీవులు కూడా అక్కడికి వెళ్తున్నాయి. చక్రాలు జీవులతో పాటు లేస్తున్నాయి. ఎందుకంటే ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది. 21 ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది కాబట్టి జీవులు కదిలినప్పుడు చక్రాలు కూడా కదిలాయి. జీవులు నిశ్చలంగా నిలిచిపోయినప్పుడు చక్రాలు కూడా నిలిచిపోయాయి. జీవులు భూమిపై నుండి పైకి లేచినప్పుడు చక్రాలు కూడా లేచాయి.
22 ఆ జీవుల తలల పైగా విశాలమైనది ఒకటి కనిపించింది. అది మెరుస్తున్న మంచు గడ్డలా ఆ జీవుల తలల పైగా వ్యాపించినట్టు కనిపించింది. అది అద్భుతం గానూ, ఆశ్చర్యాన్ని కలిగించేది గానూ ఉంది. 23 ఆ విశాలమైన దాని కింద జీవులు తమ రెక్కలు చాపుకుని ఉన్నాయి. ఒకదాని రెక్కలు మరోదాని రెక్కలను తాకుతూ ఉన్నాయి. ప్రతి జీవీ తన రెండు రెక్కలతో తన దేహాన్ని కప్పుకుంటూ ఉంది. అలా ప్రతి జీవికీ దేహాన్ని కప్పుకోడానికి రెండు రెక్కలున్నాయి.
24 ఆ తరువాత నేను వాటి రెక్కల శబ్దం విన్నాను. అది పరుగులెత్తే నీటి శబ్దంలా ఉంది. సర్వశక్తిగల దేవుని స్వరంలా ఉంది. అవి కదిలినప్పుడల్లా గాలివాన శబ్దం వినిపించింది. ఒక సైన్యం చేస్తున్న శబ్దంలా తోచింది. అవి కదలకుండా ఆగినప్పుడు తమ రెక్కలను కిందకి వాల్చి ఉంచాయి. 25 అవి ఆగిపోయి తమ రెక్కలు చాపినప్పుడు వాటి తలల పైన ఉన్న విశాలమైన దానికి పైగా ఒక స్వరం వినిపించింది.
26 వాటి తలల పైగా ఉన్న ఆ విశాలమైనదాని పైన ఒక సింహాసనం లాంటిది కనిపించింది. అది నీలకాంత మణిలా ఉంది. ఆ సింహాసనం పైన మానవ స్వరూపంలో ఉన్న ఒక వ్యక్తి కూర్చున్నట్లు కనిపించింది.
27 అప్పుడు ఒక ఆకారాన్ని నేను చూశాను. అతని నడుము పైగా అగ్నితో మండుతున్న లోహంలా నాకు కనిపించింది. అతని నడుము కింద చుట్టూ అగ్నిలా, ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. 28 అది వర్షం కురిసినప్పుడు మబ్బుల్లో కనిపించే మేఘధనస్సులా, దాని చుట్టూ ఉండే ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. అది యెహోవా మహిమలా కనిపించింది. అది చూసి నేను సాగిలపడ్డాను. అప్పుడు ఒక స్వరం నాతో మాట్లాడటం నేను విన్నాను.