హిజ్కియా అనారోగ్యం

హిజ్కియా అనారోగ్యం: పరిచయం.

క్రీ.పూ. 713

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 దినవృత్తాంతాలు 32:24–26

24 ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి చనిపోయేలా ఉన్నాడు. అతడు యెహోవాకు ప్రార్థన చేస్తే, ఆయన అతనితో మాట్లాడి, అతడు బాగుపడతాడనేదానికి ఒక గురుతు ఇచ్చాడు. 25 అయితే హిజ్కియా గర్వించి తనకు చేసిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదు. కాబట్టి అతని మీదికీ యూదా యెరూషలేము మీదికీ యెహోవా కోపం వచ్చింది. 26 అయితే చివరకూ హిజ్కియా తన హృదయ గర్వం విడిచి, తానూ యెరూషలేము నివాసులూ తమను తాము తగ్గించుకున్నారు. కాబట్టి హిజ్కియా రోజుల్లో యెహోవా కోపం ప్రజల మీదికి రాలేదు.

2 రాజులు 20:1–11

1 ఆ రోజుల్లో, హిజ్కియాకు జబ్బు చేసి చావుబతుకుల్లో ఉన్నాడు. ఆమోజు కొడుకూ ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరికి వచ్చి “నీవు చనిపోతున్నావు. ఇక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా చెప్తున్నాడు” అని చెప్పాడు. 2 హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు తిప్పుకుని, 3 “యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనెలా నడుచుకున్నానో, నీ దృష్టిలో అనుకూలంగా అంతా నేనెలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో” అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు.

4 యెషయా మధ్య ప్రాంగణంలోనుంచి అవతలకు వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, 5 “నీవు మళ్ళీ నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్లి, అతనితో ఇలా చెప్పు. నీ పితరుడు దావీదుకు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమంటే, నీవు కన్నీళ్లు విడవడం చూశాను. నేను నీ ప్రార్థన అంగీకరించాను. నేను నిన్ను బాగు చేస్తాను. మూడో రోజు నీవు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్తావు.

6 ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్షు నీకు ఇస్తాను. ఇంకా నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం ఈ పట్టణాన్ని నేను కాపాడుతూ, నిన్నూ, ఈ పట్టాణాన్నీ, అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను” అన్నాడు. 7 తరువాత యెషయా “అంజూరపుపళ్ళ ముద్ద తెప్పించండి” అని చెప్పాడు. వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగు పడ్డాడు.

8 “యెహోవా నన్ను స్వస్థపరుస్తాడు అనడానికీ, నేను మూడో రోజు ఆయన మందిరానికి ఎక్కి వెళ్తాననడానికీ, సూచన ఏంటి?” అని హిజ్కియా యెషయాను అడిగాడు. యెషయా 9 “తాను చెప్పిన మాట యెహోవా నెరవేరుస్తాడు అనడానికి ఆయన ఇచ్చిన సూచన ఏమంటే, నీడ పది మెట్లు ముందుకు నడవాలా? లేక అది పదిమెట్లు వెనక్కు నడవాలా?” అన్నాడు.

10 అందుకు హిజ్కియా “నీడ పది మెట్లు ముందుకు నడవడం తేలికే. కాని నీడ పది గడులు వెనక్కి నడవాలి” అన్నాడు. 11 ప్రవక్త అయిన యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకు నడిచిన నీడ పది మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు.

యెషయా 32–33

1 ఇదిగో, వినండి! ఒక రాజు నీతిమంతంగా రాజ్య పరిపాలన చేస్తాడు. అధిపతులు న్యాయసమ్మతంగా ఏలుబడి చేస్తారు.

2 వాళ్ళల్లో ప్రతి ఒక్కడూ గాలి విసిరినప్పుడు ఆశ్రయంలాగా, తుఫానులో అభయమిచ్చే స్థలంలాగా ఉంటాడు.

ఎడారిలో జలధారల్లా, అలసి సొలసిన దేశంలో నీడనిచ్చే గొప్ప రాతి బండలాగా ఉంటాడు.

3 అప్పుడు చూసే వాళ్ళ కళ్ళు కాంతిహీనంగా ఉండవు. వినేవాళ్ళ చెవులు శ్రద్ధగా వింటాయి.

4 దుడుకుగా ప్రవర్తించేవాళ్ళు వివేకంతో జాగ్రత్తగా ఆలోచిస్తారు. నత్తిగా మాట్లాడేవాడు స్పష్టంగా ధారాళంగా మాట్లాడతాడు.

5 మూర్ఖుణ్ణి ఇకమీదట గౌరవనీయుడని చెప్పరు. మోసగాణ్ణి నియమబద్ధమైన వ్యక్తి అని చెప్పరు.

6 మూర్ఖుడు మూర్ఖంగా మాట్లాడతాడు. అతడి హృదయం దుర్మార్గం గూర్చీ, దైవరహితమైన పనులను గూర్చీ ఆలోచిస్తుంది.

అతడు యెహోవాను గూర్చి తప్పుగా మాట్లాడతాడు.

అతడు ఆకలితో ఉన్నవాళ్ళ దగ్గర ఉన్నది కూడా లాగేసుకుంటారు. దాహంతో ఉన్నవాళ్ళకి నీళ్ళు లేకుండా చేస్తాడు.

7 మోసగాడి పద్ధతులన్నీ దుర్మార్గంగా ఉంటాయి. పేదవాళ్ళు సరైనదేదో చెప్పినా, పేదవాళ్ళని నాశనం చేయడానికి వాడు అబద్దాలతో పన్నాగాలు పన్నుతాడు.

8 అయితే ఒక ఘనుడు గౌరవనీయమైన ఆలోచనలు చేస్తాడు. అతడు చేసే గౌరవనీయమైన పనులను బట్టి అతడు నిలబడతాడు.

9 సుఖమైన, తేలికైన జీవితాన్ని జీవించే స్త్రీలారా, లేచి నా మాటలు వినండి.

నిశ్చింతగా ఉన్న ఆడపడుచులు, నా మాటలు వినండి.

10 మరో సంవత్సరం, కొద్ది రోజులకి మీ నమ్మకం వీగిపోతుంది.

నిశ్చింతగా ఉన్న స్త్రీలూ, ద్రాక్షపంట నష్టమౌతుంది. ద్రాక్షపళ్ళు ఇంటికి రావు.

11 సుఖమైన, తేలికైన జీవితాన్ని జీవించే పడతులారా, వణకండి. తమపై నమ్మకం కలిగిన స్త్రీలూ, కలవరపడండి.

చక్కని మీ బట్టలు తీసివేసి నగ్నంగా తయారవ్వండి. మీ నడుముకి గోనెగుడ్డ కట్టుకోండి.

12 ఉల్లాసకరమైన పొలాల కోసం, ఫలభరితమైన ద్రాక్ష తోటల కోసం మీరు ఏడుస్తారు.

13 నా ప్రజల భూమిలో ముళ్ళ తుప్పలూ, గచ్చపొదలూ పెరుగుతాయి.

వేడుకలు జరిగే పట్టణంలో ఒకప్పుడు సంతోషం నిండిన ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటుంది. పైనుండి ఆత్మ కుమ్మరింపు జరిగే వరకూ,

14 రాజ భవనాన్ని విడిచి పెట్టేస్తారు. జనసమ్మర్దమైన పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది.

కొండ, నిఘా గోపురాలు ఇక ఎప్పటికీ గుహల్లా ఉంటాయి.

అవి అడవి గాడిదలు ఆనందించే స్థలంగానూ, పశువులు మేసే స్థలంగానూ ఉంటాయి. దేవుని ఆత్మ కుమ్మరింపు జరిగే వరకూ ఇలా జరుగుతుంది.

15 తర్వాత అరణ్యం ఫలభరితమైన భూమిగా ఉంటుంది. ఫలభరితమైన భూమి అరణ్యంలా ఉంటుంది.

16 అప్పుడు న్యాయం అరణ్యంలో నివసిస్తుంది. ఫలభరితమైన భూమిలో నీతి ఉంటుంది.

17 నీతి శాంతిని కలుగ చేస్తుంది. నీతి ఫలితంగా నిత్యమైన నెమ్మదీ నమ్మకమూ కలుగుతాయి.

18 నా ప్రజలు శాంతిభరితమైన చోట, సురక్షితమైన ఇళ్ళల్లో నివసిస్తారు.

19 కానీ వడగళ్ళు పడి అరణ్యం నాశనమైనప్పుడు పట్టణం పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుంది.

20 మీలో నీటి ప్రవాహాల పక్కనే విత్తనాలు నాటుతూ, అక్కడ తమ ఎద్దులనూ, గాడిదలనూ తిరగనిచ్చేవాడు ధన్యుడు.

33:1 దోపిడీకి గురి కాకుండా దోచుకుంటూ ఉండే నీకు బాధ!

ద్రోహానికి గురి కాకుండానే ద్రోహం చేస్తూ ఉండే నీకు బాధ!

నువ్వు నాశనం చేయడం ముగించిన తర్వాతే నువ్వు నాశనం అవుతావు.

నువ్వు ద్రోహం చేయడం ముగించిన తర్వాత నీకు ద్రోహం జరుగుతుంది.

2 యెహోవా, నీ కోసం వేచి చూస్తున్నాం. మమ్మల్ని కరుణించు.

ప్రతి ఉదయం మాకు సహాయంగా, ఆపదల్లో మాకు రక్షగా ఉండు.

3 మహా శబ్దాన్ని విని జనాలు పారిపోతారు. నువ్వు లేచినప్పుడు దేశాలు చిందర వందర అవుతాయి.

4 మిడతలు తిని వేసినట్టు మీ సంపదలు దోపిడీకి గురౌతాయి. మిడతల దండులా శత్రువులు దానిమీద పడతారు.

5 యెహోవా మహా ప్రశంస పొందాడు. ఆయన ఉన్నత స్థలంలో నివసిస్తున్నాడు. ఆయన సీయోనును నీతితో, న్యాయంతో నింపుతాడు.

6 నీ కాలంలో నీ స్థిరత్వం ఆయనే.

నీకు పుష్కలమైన రక్షణ, జ్ఞానమూ, వివేకమూ ఆయనే. యెహోవా భయం అతని ఐశ్వర్యం.

7 వాళ్ళ రాయబారులు వీధిలో ఏడుస్తున్నారు. సంధిని కోరుకునే వాళ్ళ రాజనీతిజ్ఞులు ఒకటే రోదిస్తున్నారు.

8 రాజమార్గాలు నిర్మానుష్యమై పోయాయి. వాటి మీద ప్రయాణీకులు ఎవ్వరూ లేరు.

సంధి ఒప్పందాలను ఉల్లంఘించారు. సాక్షులను అలక్ష్యం చేశారు. పట్టణాలను అవమానపరిచారు.

9 దేశం దుఖిస్తుంది. క్షీణించి పోతుంది. లెబానోను కలవరపడి వాడిపోతుంది.

షారోను ఎడారిలా ఉంది. బాషాను, కర్మెలు తమ చెట్ల ఆకులు రాలుస్తున్నాయి.

10 “ఇప్పుడు నేను నిలబడతాను” అని యెహోవా అనుకున్నాడు. “ఇప్పుడే నా ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తాను. నన్ను నేను గొప్ప చేసుకుంటాను.

11 మీరు పొట్టును గర్భం ధరించారు. చెత్త పరకలను కంటారు. మీ శ్వాస అగ్నిలా మిమ్మల్ని కాల్చేస్తుంది.

12 జనాలు సున్నంలా కాలిపోతారు. ముళ్ళ పొదలను నరికి కాల్చినట్టుగా కాలిపోతారు.

13 దూరంలో నివసించే మీరు నేను చేసిందేమిటో వినండి. సమీపంలో ఉన్న వాళ్ళు నా శక్తిని అంగీకరించండి.”

14 సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు. దేవుణ్ణి లెక్క చెయ్యని వారికి వణుకు పట్టుకుంది.

మనలో మండే అగ్నితో కలసి ప్రయాణించే వాడు ఎవరు? నిత్యమూ మండే వాటితో ఎవరు నివసిస్తారు?

15 నీతి కలిగి జీవించేవాడూ, యథార్ధంగా మాట్లాడేవాడూ, అవినీతి వల్ల కలిగే లాభాన్ని అసహ్యించుకునే వాడూ, లంచాన్ని తిరస్కరించేవాడూ, హింసాత్మక నేరం చేయాలని ఆలోచించని వాడూ చెడుతనం చూడకుండా కళ్ళు మూసుకునే వాడూ,

16 అలాంటి వాడు ఉన్నత స్థలాల్లో నివసిస్తాడు. అతనికి పర్వత శిఖరాలపైని శిలలు ఆశ్రయంగా ఉంటాయి. ఆహారమూ, నీళ్ళూ క్రమంగా అతనికి లభ్యమౌతాయి.

17 నీ కళ్ళు రాజును అతని సౌందర్యమంతటితో చూస్తాయి. విశాలమైన దేశాన్ని నీ కళ్ళు చూస్తాయి.

18 నీ హృదయం భయాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. శాస్త్రి ఎక్కడ ఉన్నాడు? డబ్బును తూచిన వాడు ఎక్కడ ఉన్నాడు? గోపురాలను లెక్కించేవాడు ఎక్కడ ఉన్నాడు?

19 నువ్వు అర్థం చేసుకోలేని తెలియని భాష మాట్లాడుతూ తిరస్కరించే ఆ జనాన్ని నువ్వు చూడవు.

20 మన పండగల పట్టణం అయిన సీయోనుని చూడండి!

యెరూషలేమును ప్రశాంతమైన నివాస స్థలంగా నువ్వు చూస్తావు. అది తొలగించలేని గుడారంగా ఉంటుంది.

దాని మేకులను ఎన్నటికీ ఊడదీయరు. దాని తాళ్లలో దేనినీ తెంచరు.

21 దానికి ప్రతిగా విశాలమైన నదులూ, నీటి వాగులూ ఉన్న ఆ స్థలంలో యెహోవా తన ప్రభావంతో మనతో ఉంటాడు.

తెడ్లు వేసుకుంటూ అక్కడ ఏ యుద్ధనౌకా ప్రయాణించదు. పెద్ద నౌకలేవీ అక్కడ ప్రయాణించవు.

22 ఎందుకంటే యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు.

23 నీ ఓడ తాళ్లు వదులై పోయాయి. స్తంభం అడుగు భాగం స్థిరంగా లేదు. ఓడ తెరచాపను ఎవరూ విప్పడం లేదు. విస్తారమైన దోపిడీ సొమ్మును పంచుకుంటారు. అప్పుడు కుంటి వాళ్ళు కూడా ఆ సొమ్ములో భాగం పొందుతారు.

24 సీయోనులో నివాసం చేసే వాళ్ళెవ్వరూ “నాకు ఆరోగ్యం బాగా లేదు” అని చెప్పరు. అక్కడి ప్రజలు చేసిన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది.