ఆరాధనను సంస్కరించిన హిజ్కియా (continued)

హిజ్కియా స్వభావం, అతడు చేసిన ఆరాధన సంస్కరణ.

క్రీ.పూ. 726

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 దినవృత్తాంతాలు 30–31

1 హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కాపండగ ఆచరించడానికి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి రావాలని ఇశ్రాయేలు, యూదావారందరికీ వార్తాహరులనూ, ఎఫ్రాయిమీయులకు మనష్షే వారికి ఉత్తరాలనూ పంపాడు. 2 అప్పుడు తమను పవిత్రం చేసుకున్న యాజకులు చాలినంతమంది లేరు గనక ప్రజలు యెరూషలేములో సమకూడలేదు. కాబట్టి మొదటి నెలలో పస్కాపండగ జరపలేక పోయారు. 3 రాజూ, అతని అధికారులూ, యెరూషలేములో ఉన్న సమాజం వారంతా పస్కాను రెండవ నెలలో ఆచరించాలని నిర్ణయించారు.

4 ఈ విషయం రాజుకూ సమాజం వారందరికీ సమంజసం అనిపించింది. 5 చాలా కాలం నుంచి లేఖనంలో రాసినట్టు ఎక్కువమంది ప్రజలు పండగ ఆచరించ లేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండగ ఆచరించడానికి రావాలని బెయేర్షెబా నుంచి దాను వరకూ ఇశ్రాయేలు దేశమంతా చాటించాలని వారు నిర్ణయించారు.

6 కాబట్టి వార్తాహరులు రాజు దగ్గరా అతని అధికారుల దగ్గరా ఉత్తరాలు తీసుకు, యూదా ఇశ్రాయేలు దేశాలంతా తిరిగి రాజాజ్ఞను ఇలా చాటించారు, “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగండి. మీరు ఆయన వైపు తిరిగితే, అప్పుడు అష్షూరు రాజుల చేతిలోనుంచి తప్పించుకుని మిగిలిన మీ వైపు ఆయన తిరుగుతాడు. 7 తమ పూర్వీకుల దేవుడైన యెహోవా పట్ల ద్రోహంగా ప్రవర్తించిన మీ పూర్వీకులలాగా మీ సోదరులలాగా మీరు ప్రవర్తించవద్దు. మీరు చూస్తున్నట్టు ఆయన వారిని నాశనానికి అప్పగించాడు. 8 మీ పూర్వికుల్లాగా మీరు అవిధేయులుగ ప్రవర్తించ కండి. యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతంగా పరిశుద్ధ పరచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుంచి తొలగి పోయేలా ఆయన్ని సేవించండి.

9 మీరు యెహోవా వైపు తిరిగితే మీ సోదరుల పైనా, మీ పిల్లల పైనా వారిని బందీలుగా తీసుకు పోయిన వారికి దయ కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా కృప, జాలి గలవాడు కాబట్టి మీరు ఆయనవైపు తిరిగితే ఆయన మీ వైపునుంచి తన ముఖం తిప్పుకోడు.”

10 వార్తాహరులు జెబూలూను దేశం వరకూ, ఎఫ్రాయిము మనష్షేల దేశాల్లో ఉన్న ప్రతి పట్టణానికీ వెళ్ళారు గాని అక్కడి వారు ఎగతాళి చేసి వారిని అపహసించారు. 11 అయినా, ఆషేరు మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకుని యెరూషలేము వచ్చారు. 12 యెహోవా ఆజ్ఞను బట్టి రాజు, అతని అధికారులు, ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేలా యూదా వారికి ఏక మనస్సు కలిగించ డానికి దేవుని హస్తం వారి మీద ఉంది.

13 రెండవ నెలలో పొంగని రొట్టెల పండగ ఆచరించడానికి ప్రజలు గొప్ప సమూహంగా యెరూషలేములో సమకూడారు. 14 యెరూషలేములో ఉన్న బలిపీఠాలను ధూపవేదికలను తీసివేసి, కిద్రోను వాగులో పారవేశారు. 15 రెండవ నెల 14 వ రోజున వారు పస్కాగొర్రెపిల్లను వధించారు. యాజకులు లేవీయులు సిగ్గుపడి, తమను ప్రతిష్ఠించుకుని దహనబలిపశువులను యెహోవా మందిరంలోకి తీసుకు వచ్చారు.

16 దేవుని సేవకుడు మోషే నియమించిన ధర్మశాస్త్రంలోని ఉపదేశం ప్రకారం, వారు తమ స్థలం లో నిలబడ్డారు. యాజకులు, లేవీయుల చేతికి బాలి రక్తం అందించగా వారు దాన్ని చిలకరించారు. 17 సమాజంలో తమను పరిశుద్ధ పరచుకొనని వారు అనేకమంది ఉన్నారు. అలా పరిశుద్ధ పరచుకొనని వారి కోసం పస్కా పశువులను లేవీయులు వధించాల్సి వచ్చింది.

18 ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను ప్రదేశాలనుంచి వచ్చిన ప్రజల్లో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండా లేఖనాలకు విరుద్ధంగా పస్కా భుజించారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థించాడు, 19 “పరిశుద్ధమందిర శుద్ధీకరణ ప్రమాణాల ప్రకారం అశుద్ధంగా ఉన్నవారు, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వెదకడానికి తమ హృదయాన్ని సిద్ధపరచుకుంటే, అలాటి వారినందరినీ దయ గల యెహోవా క్షమించును గాక.” 20 యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ప్రజలను బాగుచేశాడు.

21 యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలువారు ఏడు రోజులు తను పరిశుద్ధ పరచుకోకుండా ఉండిపోయిన వారు అనేకమంది ఉన్నారు. అలా పరిశుద్ధ పరచుకొనని వారి కోసం పస్కా పశువులను లేవీయులు వధించాల్సి వచ్చింది. ఏడూ రోజులపాటు రొట్టెల పండగను చాలా ఆనందంగా ఆచరించారు. లేవీయులూ, యాజకులూ సంగీత వాద్యాలతో పాటలు పాడుతూ ప్రతిరోజూ యెహోవాను స్తుతించారు. 22 యెహోవా సేవను అర్థం చేసుకున్న లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు పలికాడు. ఏడురోజులపాటు వారు సమాధాన బలులు అర్పిస్తూ, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఏడు రోజులు పస్కా పండగ సమయమంతా తమ నియమిత భాగం తింటూ ఆచరించారు.

23 సమాజమంతా ఇది చూసి, ఇంకా 7 రోజులు పండగ ఆచరించాలని ఆలోచించి మరి 7 రోజులు ఆనందంగా దాన్ని ఆచరించారు. 24 యూదా రాజు హిజ్కియా, సమాజానికి బలి అర్పణల కోసం 1,000 కోడెలను, 7,000 గొర్రెలను ఇచ్చాడు. అధికారులు 1,000 కోడెలను, 10,000 గొర్రెలూ మేకలూ ఇచ్చారు. చాలామంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు.

25 అప్పుడు యాజకులు, లేవీయులు, యూదా, ఇశ్రాయేలువారిలో నుంచి వచ్చిన సమాజమంతా, ఇశ్రాయేలు దేశంలోనుంచి వచ్చి యూదాలో నివాసమున్న అన్యులు కూడా సంతోషించారు. 26 యెరూషలేము నివాసులు ఎంతో ఆనందించారు. ఇశ్రాయేలు రాజు దావీదు కొడుకు సొలొమోను కాలం తరువాత ఇలా జరగలేదు. 27 అప్పుడు లేవీయులైన యాజకులు లేచి ప్రజలను దీవిస్తే వారి మాటలు వినబడ్డాయి. వారి ప్రార్థన దేవుడు ఉండే పరిశుద్ధ స్థలం, అంటే పరలోకానికి చేరింది.

31:1 ఇదంతా అయిపోయిన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా యూదా పట్టణాలకు వెళ్లి, విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి, అషేరా దేవతాస్తంభాలను విరగగొట్టి, యూదా బెన్యామీను దేశాలంతటా ఉన్నఉన్నత పూజా స్థలాలను, బలిపీఠాలను, పడగొట్టారు. తరువాత ఎఫ్రాయిమూ, మనష్షే ప్రాంతాల్లో కూడా ఇలానే పూర్తిగా నాశనం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా తమ తమ పట్టణాలకూ, గ్రామాలకూ తిరిగి వెళ్లిపోయారు.

2 హిజ్కియా యాజకులకూ, లేవీయులకూ వారి వారి సేవాధర్మం ప్రకారం, వారి వారి వరసలు నియమించాడు. దహనబలులూ సమాధాన బలులూ, శాంతి బలులూ అర్పించడానికీ, ఇతర సేవలూ చేయడానికీ యెహోవా మందిర గుమ్మాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికీ, స్తుతులు చెల్లించడానికీవారిని నియమించాడు.

3 యెహోవా ధర్మశాస్త్రంలో రాసినట్టుగా ఉదయ సాయంత్రాలు అర్పించవలసిన దహనబలుల కోసం విశ్రాంతిదినాలకూ, అమావాస్యలకూ నియామక కాలాలకూ అర్పించవలసిన దహనబలుల కోసం తన సొంత ఆస్తిలోనుంచి రాజు ఒక భాగాన్ని ఏర్పాటు చేశాడు. 4 యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం యాజకులూ, లేవీయులూ తమ పని శ్రద్ధగా జరుపుకొనేలా, వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు అతడు ఆజ్ఞాపించాడు.

5 ఆ ఆజ్ఞ జారీ అయిన వెంటనే ఇశ్రాయేలీయులు తమ మొదటి పంట ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, తేనె, పొలంలోని పంటనూ విస్తారంగా తీసుకు వచ్చారు. అంతే కాక అన్నిటిలోనుంచి పదవ వంతును విస్తారంగా తెచ్చారు.

6 యూదా పట్టణాల్లో నివసిస్తున్న ఇశ్రాయేలువారు, యూదావారు ఎద్దులు గొర్రెల్లో పదవవంతు, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువుల్లో పదవ వంతు తీసుకు వచ్చి కుప్పలుగా పోశారు. 7 వారు మూడవ నెలలో కుప్పలు వేయడం మొదలుపెట్టి ఏడవ నెలలో ముగించారు. 8 హిజ్కియా, అతని అధికారులూ వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను దీవించారు.

9 హిజ్కియా ఆ కుప్పలను గురించి యాజకులను లేవీయులను ప్రశ్నించాడు. సాదోకు సంతతివాడు ప్రధానయాజకుడైన అజర్యా అతనికి ఇలా జవాబిచ్చాడు. 10 “యెహోవా మందిరంలోకి ప్రజలు కానుకలు తీసుకురావడం మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినా ఇంకా చాలా మిగిలి పోతున్నది. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించినందుకు ఇంత గొప్పరాశి మిగిలింది.”

11 హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచాలని ఆజ్ఞ ఇచ్చాడు. 12 తరువాత వారు కానుకలనూ పదవ భాగాలనూ ప్రతిష్ట చేసిన వస్తువులనూ నమ్మకంగా లోపలకు తెచ్చారు. లేవీయుడైన కొనన్యా వాటికి నిర్వహణాధికారి. అతని సోదరుడైన షిమీ అతనికి సహకారి. 13 యెహీయేలు, అజజ్యా, నహతు. అశాహేలు, యెరీమోతు, యోజాబాదు, ఎలీయేలు, ఇస్మక్యా, మహతు, బెనాయా అనేవారు కొనన్యా చేతి కింద, అతని సోదరుడు షిమీ చేతి కింద తనిఖీ చేసేవారుగా ఉన్నారు. రాజైన హిజ్కియా దేవుని మందిరానికి అధికారిగా ఉన్న అజర్యా వారిని నియమించారు.

14 తూర్పువైపు గుమ్మం దగ్గర పాలకుడూ లేవీయుడైన ఇమ్నా కొడుకు కోరే, దేవునికి సమర్పించిన స్వేచ్ఛార్పణల మీద అధికారి. ప్రజలు యెహోవాకు తెచ్చిన కానుకలనూ ప్రతిష్టిత వస్తువులనూ పంచిపెట్టడం అతని పని. 15 అతని చేతి కింద ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా, షెకన్యా అనేవారున్నారు. వారు నమ్మకమైనవారు కాబట్టి యాజకుల పట్టణాల్లో ప్రముఖులనీ సామాన్యులనీ తేడా లేకుండా తమ సోదరులకు వరస క్రమాల ప్రకారం వారి భాగాలను పంచిపెట్టడానికి వారిని నియమించారు.

16 అంతేకాక మూడేళ్ళు మొదలు అంతకు పైవయసుండి వంశవృక్షాల్లో నమోదైన మగపిల్లలకు కూడా వంతుల ప్రకారం పంచిపెట్టారు. వారి వారి వరసల ప్రకారం బాధ్యతల ప్రకారం సేవచేయడానికి ప్రతిరోజూ యెహోవా మందిరంలోకి వచ్చేవారందరికీ పంచిపెట్టారు. 17 ఇరవై ఏళ్ళు మొదలు అంతకు పై వయసుండి వంతుల ప్రకారం సేవచేయడానికి తమ తమ పూర్వీకుల వంశాల ప్రకారం యాజకుల్లో సరిచూడబడిన లేవీయులకు పంచిపెట్టారు.

18 అంటే నమ్మకమైనవారై తమ్మును ప్రతిష్ఠించుకునిన లేవీయులకు తమ పిల్లలతో భార్యలతో కొడుకులతో కూతుర్లతో 19 సమాజమంతా సరిచూడబడినవారికి, ఆ యా పట్టణాలకు చేరిన గ్రామాల్లో ఉన్న అహరోను వంశస్థులైన యాజకులకు, వంతులు ఏర్పరచడానికి వారిని నియమించారు. పేరుల ప్రకారం చెప్పబడిన ఆ ప్రజలు యాజకుల్లో పురుషులందరికి, లేవీయుల్లో వంశాల ప్రకారం సరిచూడబడిన వారందరికి వంతులు ఏర్పరచడానికి వారిని నియమించారు.

20 హిజ్కియా యూదా దేశమంతటా ఇలా జరిగించాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా యధార్థంగా నమ్మకం గా ప్రవర్తించాడు. 21 దేవుని మందిర సేవకోసం, ధర్మశాస్త్రం కోసం, ఆజ్ఞల కోసం మొదలుపెట్టిన ప్రతి పనిలో అతడు తన దేవుణ్ణి వెతికి అనుసరించాడు. హృదయపూర్వకంగా అనులు జరిగించాడు గనక వర్ధిల్లాడు.