పదవ ప్రయాణం: ఆలూషు నుండి రెఫీదీముకు

నీటి కోసం సణగడం, అమాలేకుతో యుద్ధం

ప్రజలు నీటి కోసం సణుగుతారు, అమాలేకుతో యుద్ధం జరుగుతుంది.

క్రీ.పూ. 1491

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సంఖ్యాకాండం 33:14

14 ఆలూషు నుండి రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి తాగడానికి నీళ్లు లేవు.

నిర్గమకాండం 17

1 యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా సీను ఎడారి ప్రాంతం నుండి ప్రయాణం చేసి రెఫీదీములో దిగారు. అక్కడ ప్రజలు తాగడానికి నీళ్ళు లేవు. 2 దానికి వాళ్ళు మోషే పై నింద మోపుతూ “మాకు తాగడానికి నీళ్లియ్యి” అన్నారు. అప్పుడు మోషే “మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు?” అన్నాడు. 3 ప్రజలు దాహంతో మోషే మీద సణుగుతూ “ఇదేంటి? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకువచ్చావా?” అన్నారు.

4 అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు. “ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో” అన్నాడు. 5 అప్పుడు యెహోవా “ప్రజల పెద్దల్లో కొందరిని వెంటబెట్టుకుని నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని ప్రజలకు ఎదురుగా వెళ్లి నిలబడు. 6 నేను అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. నువ్వు ఆ బండను కర్రతో కొట్టు. అప్పుడు ప్రజలు తాగడానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి” అని మోషేతో చెప్పాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దల కళ్ళెదుట ఆ విధంగా చేశాడు. 7 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన గొడవనుబట్టి, వారు “యెహోవా మన మధ్య ఉన్నాడా, లేడా?” అని యెహోవాను శోధించడాన్నిబట్టి ఆ స్థలానికి “మస్సా” అనీ “మెరీబా” అనీ పేర్లు పెట్టాడు.

8 తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యారు. 9 మోషే యెహోషువతో “మన కోసం కొంతమందిని సిద్ధం చేసి బయలుదేరి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. నేను రేపు దేవుని కర్ర చేత్తో పట్టుకుని ఆ కొండ శిఖరంపై నిలబడతాను” అన్నాడు.

10 యెహోషువ మోషే తనతో చెప్పినట్టు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరం ఎక్కారు. 11 మోషే తన చెయ్యి పైకెత్తి ఉంచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలవ సాగారు. 12 మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను, హూరు ఒక రాయి తెచ్చి మోషేను దానిపై కూర్చోబెట్టారు. అహరోను, హూరు ఇద్దరూ మోషేకు అటు ఇటు ఆనుకుని నిలబడి సూర్యుడు అస్తమించేదాకా అతని చేతులు ఎత్తి పట్టుకున్నారు. 13 ఆ విధంగా యెహోషువ కత్తి బలంతో అమాలేకు రాజును, అతని సైన్యాన్ని ఓడించాడు.

14 అప్పుడు యెహోవా మోషేతో “చిరకాలం జ్ఞాపకం ఉండేలా పుస్తకంలో ఈ విషయం రాసి అది యెహోషువకు వినిపించు. నేను అమాలేకీయులను ఆకాశం కింద నామరూపాలు లేకుండా పూర్తిగా తుడిచి పెట్టేస్తాను” అన్నాడు. 15 తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి “యెహోవా నిస్సీ” అని పేరు పెట్టాడు. 16 అమాలేకీయులు యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా చెయ్యి ఎత్తారు గనక “యెహోవాకు అమాలేకీయులతో తరతరాలకు వైరం ఉంటుంది అని యెహోవా శపథం చేశాడు” అన్నాడు కాబట్టి అతడు ఇలా చేశాడు.

పదకొండవ ప్రయాణం: రెఫీదీము నుండి సీనాయికి

ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం

సంఖ్యాకాండం 33:15

15 రెఫీదీము నుండి సీనాయి అరణ్యంలో ఆగారు.

నిర్గమకాండం 19

1 ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెల మొదటి రోజున సీనాయి ఎడారి ప్రాంతానికి వచ్చారు. 2 వాళ్ళు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చి అక్కడ పర్వతం ఎదుట ఎడారిలో విడిది చేశారు.

3 మోషే యెహోవా సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. యెహోవా ఆ కొండపై నుండి అతణ్ణి పిలిచాడు. యెహోవా మోషేతో “నువ్వు యాకోబు సంతతితో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు.

4 ‘నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో, గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకొన్నానో మీరు చూశారు. 5 ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా. 6 మీరు యాజక రాజ్యంగా పవిత్రప్రజగా ఉంటారు.’ నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాల్సిన మాటలు ఇవే” అన్నాడు.

7 మోషే కొండ దిగి వచ్చి ప్రజల పెద్దలను పిలిపించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారికి తెలియజేశాడు. 8 అందుకు ప్రజలంతా “యెహోవా చెప్పినదంతా మేము చేస్తాం” అని ముక్తకంఠంతో జవాబిచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజలు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేశాడు. 9 యెహోవా మోషేతో “ఇదిగో నేను కారుమబ్బులో నీ దగ్గరికి వస్తున్నాను. నేను నీతో మాట్లాడుతూ ఉండగా ప్రజలు విని ఎప్పటికీ నీ మీద నమ్మకం ఉంచుతారు” అన్నాడు. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పాడు.

10 అప్పుడు యెహోవా మోషేతో “నీవు ప్రజల దగ్గరికి వెళ్లి ఈ రోజూ రేపూ వాళ్ళను పవిత్రపరచు. నా రాక కోసం వాళ్ళు సిద్ధం చెయ్యి. వాళ్ళు తమ బట్టలు ఉతుక్కుని 11 మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండాలి. మూడవ రోజు యెహోవా అనే నేను ప్రజలందరి కళ్ళెదుట సీనాయి కొండ పైకి దిగివస్తాను.

12 నువ్వు కొండ చుట్టూ హద్దు ఏర్పాటు చెయ్యి. ప్రజలతో, ‘మీరు ఈ కొండ ఎక్కకూడదు. దాని అంచును కూడా ముట్టుకోకూడదు. జాగ్రత్త. ఈ కొండను ముట్టుకున్న ప్రతివాడూ మరణశిక్షకు లోనవుతాడు. 13 ఎవ్వరూ తమ చేతులతో ముట్టుకున్న వాణ్ణి తాకకూడదు. రాళ్ళతో గానీ బాణాలతో గానీ కచ్చితంగా అతణ్ణి చంపెయ్యాలి. మనిషైనా జంతువైనా మరణ శిక్ష విధించాల్సిందే. సుదీర్ఘమైన బూర శబ్దం వినినప్పుడు వాళ్ళు కొండ పాదానికి చేరుకోవాలి’ అని చెప్పు” అన్నాడు.

14 అప్పుడు మోషే కొండ దిగి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను పవిత్ర పరిచాడు. ప్రజలు తమ బట్టలు ఉతుక్కున్నారు. 15 అప్పుడు మోషే “మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండండి. మీ భార్యల దగ్గరికి వెళ్లొద్దు.” అని చెప్పాడు. 16 మూడవ రోజు తెల్లవారగానే ఆ కొండ మీద దట్టమైన మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులు వచ్చాయి. భీకరమైన బూర శబ్దం వినిపించినప్పుడు శిబిరంలోని ప్రజలంతా భయంతో వణకిపోయారు. 17 దేవుణ్ణి ఎదుర్కొనడానికి మోషే శిబిరంలో నుండి ప్రజలను బయటకు రప్పించాడు. ప్రజలంతా కొండ పాదం దగ్గర నిలబడ్డారు.

18 మండుతున్న మంటలతో యెహోవా సీనాయి కొండపైకి దిగి వచ్చాడు. ఆ కొండ అంతా పొగ కమ్మింది. అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది. ఆ కొండంతా తీవ్రంగా కంపించింది. 19 ఆ బూర శబ్దం మరింత పెరుగుతూ ఉండగా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఉరుములాంటి కంఠ స్వరంతో అతనికి జవాబిస్తున్నాడు. 20 యెహోవా సీనాయి కొండ శిఖరం మీదికి దిగి వచ్చాడు. కొండ శిఖరం మీదికి రమ్మని మోషేను పిలిచినప్పుడు మోషే ఎక్కి వెళ్ళాడు.

21 అప్పుడు యెహోవా మోషేతో “ఈ ప్రజలు యెహోవాను చూద్దామని హద్దు మీరి వచ్చి వారిలో చాలా మంది నశించిపోకుండేలా నువ్వు కొండ దిగి వెళ్లి వాళ్లను కచ్చితంగా హెచ్చరించు. 22 ఇంకా నన్ను సమీపించే యాజకులు సిద్ధపడి నేను వారిని చంపకుండేలా తమను తాము పవిత్ర పరుచుకోవాలని చెప్పు” అన్నాడు.

23 అందుకు మోషే యెహోవాతో “ప్రజలు సీనాయి కొండ ఎక్కలేరు. నువ్వు కొండకు హద్దులు ఏర్పాటు చేసి దాన్ని పవిత్రంగా ఉంచాలని మాకు కచ్చితంగా ఆజ్ఞాపించావు గదా” అన్నాడు. 24 అప్పుడు యెహోవా “నువ్వు కిందకు దిగి వెళ్లు. నువ్వు అహరోనును వెంటబెట్టుకుని తిరిగి రావాలి. అయితే యెహోవా వారి మీద పడకుండా ఉండేలా యాజకులు, ప్రజలు హద్దు మీరి ఆయన దగ్గరికి ఎక్కి రాకూడదు” అని చెప్పాడు. 25 మోషే ప్రజల దగ్గరికి వెళ్లి ఆ మాట వాళ్ళతో చెప్పాడు.