అబ్రాముతో దేవుని నిబంధన

క్రీ.పూ. 1912

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆదికాండం 15

1 ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. “అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని” అన్నాడు. 2 అబ్రాము “ప్రభూ యెహోవా, నాకేం ఇస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను కదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా! 3 నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక, చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు” అన్నాడు.

4 యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చి “ఇతడు నీ వారసుడు కాడు. నీ ద్వారా నీకు పుట్టబోయేవాడే నీ వారసుడు అవుతాడు” అన్నాడు. 5 ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి “నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు” అని చెప్పి “నీ సంతానం కూడా అలా అవుతుంది” అని చెప్పాడు.

6 అతడు యెహోవాను నమ్మాడు. ఆ నమ్మకాన్నే ఆయన అతనికి నీతిగా పరిగణించాడు. 7 యెహోవా “నీకు ఈ ప్రదేశాన్ని వారసత్వంగా ఇవ్వడానికి కల్దీయుల ఊర్ అనే పట్టణంలో నుంచి నిన్ను ఇవతలకు తీసుకువచ్చిన యెహోవాను నేనే” అని చెప్పినప్పుడు 8 అతడు “ప్రభూ యెహోవా, ఇది నాకు సొంతం అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు.

9 ఆయన “మూడేళ్ళ వయసు ఉన్న ఒక దూడ, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం పిల్లను నా దగ్గరికి తీసుకురా” అని అతనితో చెప్పాడు. 10 అతడు వాటిని తీసుకుని వాటిని సగానికి రెండు ముక్కలుగా నరికి, రెండు సగాలను ఎదురెదురుగా పెట్టాడు. పక్షులను మాత్రం ఖండించలేదు. 11 ఆ మృతదేహాల మీద గద్దలు వాలగా అబ్రాము వాటిని తోలివేశాడు.

12 చీకటి పడుతున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయం కలిగించే చిమ్మచీకటి అతణ్ణి ఆవరించింది. 13 ఆయన “దీన్ని కచ్చితంగా తెలుసుకో. నీ వారసులు తమది కాని దేశంలో పరదేశులుగా నివాసం ఉంటారు. ఆ దేశవాసులకు బానిసలుగా నాలుగు వందల సంవత్సరాలు అణచివేతకు గురి అవుతారు.

14 వీళ్ళు దాసులుగా ఉన్న ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తాను. ఆ తరువాత వాళ్ళు అపారమైన సంపదతో బయటకు వస్తారు. 15 కాని, నువ్వు నీ తండ్రుల దగ్గరికి ప్రశాంతంగా చేరుకుంటావు. పండు ముసలితనంలో నువ్వు మరణించగా నిన్ను పాతిపెడతారు. 16 అమోరీయుల అక్రమం ఇంకా హద్డు మీరలేదు గనుక, నీ నాలుగవ తరం మనుషులు ఇక్కడికి తిరిగి వస్తారని కచ్చితంగా తెలుసుకో” అని అబ్రాముతో చెప్పాడు.

17 సూర్యుడు అస్తమించి చీకటి పడినప్పుడు, పొగ లేస్తున్న కొలిమి, మండుతున్న కాగడా దిగివచ్చి పేర్చిన మాంస ఖండాల మధ్యగా దాటుకుంటూ వెళ్ళాయి. 18 ఆ రోజున యెహోవా “ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకూ ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను. 19 కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, 20 హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, 21 అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ వారసులకు దాసులుగా చేస్తాను” అని అబ్రాముతో నిబంధన చేశాడు.

ఇష్మాయేలు జననం

ఆదికాండం 16

1 అబ్రాముకు భార్య శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక దాసి ఉంది. ఆమె పేరు హాగరు. 2 శారయి అబ్రాముతో “ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో” అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.

3 అబ్రాము అప్పటికి కనాను దేశంలో పదేళ్ల నుండి నివాసముంటున్నాడు. అబ్రాము భార్య శారయి ఈజిప్టుకు చెందిన తన దాసి హాగరును తన భర్తకు భార్యగా ఉండటానికి ఇచ్చింది. 4 అతడు హాగరుతో సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం ధరించింది. తాను గర్భం ధరించానని తెలుసుకున్న హాగరు తన యజమానురాలిని చులకనగా చూడటం ప్రారంభించింది.

5 అప్పుడు శారయి అబ్రాముతో “నా ఉసురు నీకు తగులుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నా దాసిని నేనే నీ చేతుల్లో పెట్టాను. ఆమె గర్భవతి అయింది. అది తెలిసిన దగ్గరనుండీ అది కన్నూమిన్నూ గానక నన్ను చులకనగా చూడటం మొదలు పెట్టింది. నీకూ నాకూ మధ్యన యెహోవా న్యాయం తీరుస్తాడు” అంది. 6 అందుకు అబ్రాము “ఇలా చూడు, నీ దాసి నీ చెప్పుచేతల్లోనే ఉంది గదా. ఆమె విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో” అన్నాడు. శారయి తన దాసిని రాచి రంపాన పెట్టింది. దాంతో ఆమె శారయి దగ్గర నుండి పారిపోయింది.

7 షూరుకు వెళ్ళే దారిలో అడవిలో నీటి ఊట దగ్గర యెహోవా దూత ఆమెను చూశాడు. 8 ఆమెతో “శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వస్తున్నావ్? ఎక్కడికి వెళ్తున్నావ్?” అని అడిగాడు. అందుకామె “నా యజమానురాలైన శారయి దగ్గరనుండి పారిపోతున్నాను” అంది. 9 అప్పుడు యెహోవా దూత “నువ్వు మళ్ళీ నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళు. ఆమెకు పూర్తిగా అణిగి మణిగి ఉండు” అన్నాడు. 10 యెహోవా దూత ఇంకా ఇలా చెప్పాడు. “నీ సంతానానికి తప్పకుండా ఆధిక్యత కలిగిస్తాను. అది లెక్క పెట్టడానికి వీలు లేనంతగా అయ్యేలా చేస్తాను” అని ఆమెకు చెప్పాడు.

11 తరువాత యెహోవా దూత “ఇలా చూడు, యెహోవా నీ మొర విన్నాడు. ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు. నీకు కొడుకు పుడతాడు. అతనికి ఇష్మాయేలు అనే పేరు పెడతావు. 12 అతడు అడవి గాడిదలా స్వేచ్ఛాజీవిగా ఉంటాడు. అందరూ అతనికి విరోధంగా ఉంటారు. అతడు ప్రతి ఒక్కరికీ తూర్పు దిక్కున నివసిస్తాడు. అతడు తన సోదరులకు వేరుగా నివసిస్తాడు” అని ఆమెకు చెప్పాడు.

13 అప్పుడు ఆమె “నన్ను చూసినవాడు నాకు నిజంగా కనిపించాడు కదా!” అంది. అందుకనే తనతో మాట్లాడిన యెహోవాకు “నన్ను చూస్తున్న దేవుడివి నువ్వే” అనే పేరు పెట్టింది. 14 దీన్ని బట్టి ఆ నీటి ఊటకి “బెయేర్‌ లహాయి రోయి” అనే పేరు వచ్చింది. అది కాదేషుకీ బెరెదుకీ మధ్యలో ఉంది.

15 తరువాత హాగరు అబ్రాము కొడుక్కి జన్మనిచ్చింది. హాగరు ద్వారా పుట్టిన తన కుమారుడికి అబ్రాము ఇష్మాయేలు అనే పేరు పెట్టాడు. 16 అబ్రాము కొడుకు ఇష్మాయేలుకు హాగరు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.