దేవుడు అబ్రాహామును పరీక్షించడం

అబ్రాహాముకు ఎదురైన శోధన.

క్రీ.పూ. 1871

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆదికాండం 22:1–19

1 ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన “అబ్రాహామూ” అని పిలిచినప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 2 అప్పుడు ఆయన అబ్రాహాముతో “నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు” అన్నాడు. 3 కనుక అబ్రాహాము తెల్లవారగానే లేచి తన గాడిదకు జీను కట్టి సిద్ధం చేసి, దహనబలి కోసం కట్టెలు కొట్టి, తన కొడుకు ఇస్సాకుతో పాటు ఇద్దరు పనివాళ్ళనూ వెంటబెట్టుకుని దేవుడు తనకు చెప్పిన ప్రాంతానికి ప్రయాణమయ్యాడు.

4 మూడవ రోజు అబ్రాహాము తలెత్తి దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూశాడు. 5 తన పనివాళ్ళతో “మీరు గాడిదతో ఇక్కడే ఉండండి. నేనూ అబ్బాయీ అక్కడికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మీ దగ్గరికి వస్తాం” అని చెప్పాడు.

6 అప్పుడు అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెలు తీసుకుని తన కొడుకు ఇస్సాకు తలపై పెట్టాడు. తన చేతిలో నిప్పు, కత్తి పట్టుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలసి కొండపైకి ఎక్కుతున్నారు.

7 ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును “నాన్నా” అని పిలిచాడు. దానికి అబ్రాహాము “ఏం నాయనా” అన్నాడు. అప్పుడతడు “చూడండి, మన దగ్గర నిప్పూ కట్టెలూ ఉన్నాయి గానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది?” అని అడిగాడు. 8 దానికి అబ్రాహాము “కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు” అన్నాడు.

9 దేవుడు అబ్రాహాముకు చెప్పిన స్థలానికి వారు చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం నిర్మించి దానిపై కట్టెలు పేర్చాడు. ఇస్సాకును తాళ్ళతో బంధించాడు. ఆ బలిపీఠంపై పేర్చిన కట్టెలపై అతణ్ణి పడుకోబెట్టాడు. 10 తరువాత అబ్రాహాము తన కుమారుణ్ణి వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు.

11 అప్పుడు ఆకాశం నుండి యెహోవా దూత “అబ్రాహామూ, అబ్రాహామూ” అని పిలిచాడు. దానికతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 12 అప్పుడు ఆయన “ఆ బాలునిపై చెయ్యి వేయకు. అతనికి ఏ హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది” అన్నాడు.

13 అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పోట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు. 14 అబ్రాహాము ఆ చోటును “యెహోవా యీరే” అని పిలిచాడు. కాబట్టి “యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు” అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది.

15 యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు 16 “నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను. 17 నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు.

18 నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.” 19 తరువాత అబ్రాహాము తన పనివాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళంతా కలసి బెయేర్షెబాకు వెళ్ళారు. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించాడు.

శారా మరణం, సమాధి చేయబడడం క్రీ.పూ. 1859

ఆదికాండం 23

1 శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది. 2 కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే కిరియత్ ఆర్బా అనే ప్రాంతంలో ఆమె మరణించింది. అప్పుడు అబ్రాహాము శారా కోసం దుఃఖించడానికి, విలపించడానికీ వచ్చాడు.

3 తరువాత అబ్రాహాము చనిపోయిన తన భార్య దగ్గరనుండి లేచి హేతు వారసులతో ఇలా మాట్లాడాడు, 4 “నేను మీ మధ్య ఒక పరదేశిగానూ పరాయి వాడిగానూ ఉన్నాను. చనిపోయిన నా భార్య నా కళ్ళెదుట ఉంది. చనిపోయిన నా వాళ్ళను పాతిపెట్టడానికి నాకు ఒక స్మశాన భూమిని సొంతానికి ఇవ్వండి” అన్నాడు.

5 దానికి హేతు వారసులు ఇలా అన్నారు “అయ్యా, మేము చెప్పేది వినండి. నువ్వు మా మధ్య ఒక మహారాజులా ఉన్నావు. 6 మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్ఠమైన దాంట్లో చనిపోయిన నీ వాళ్ళను పాతి పెట్టు. చనిపోయిన నీ భార్యను పాతి పెట్టడానికి మాలో ఎవరూ తమ భూమిని నీకివ్వడానికి నిరాకరించరు.”

7 అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు వారసుల ముందు సాగిల పడ్డాడు. 8 “చనిపోయిన నా భార్యను పాతిపెట్టే విషయంలో మీరు నాతో ఏకీభవిస్తే నా మాట వినండి. సోహరు కొడుకైన ఎఫ్రోనుతో నా తరపున మాట్లాడండి. 9 అతని పొలం చివరన ఉన్న మక్పేలా గుహను నాకు ఇమ్మని అతనితో మనవి చేయండి. అది నా సొంత స్మశానంగా ఉండటానికి దాన్ని పూర్తి వెలకు నాకు అమ్మమని చెప్పండి” అన్నాడు.

10 ఆ ఎఫ్రోను హేతు సంతతివారి మధ్యలోనే కూర్చుని ఉన్నాడు. హిత్తీయుడైన ఎఫ్రోను ఆ పట్టణ ద్వారం లో ప్రవేశించే వారందరి ముందు హేతు సంతతివారు వింటుండగా అబ్రాహాముకు ఇలా చెప్పాడు. 11 “అయ్యా, అలా కాదు. నేను చెప్పేది వినండి. ఆ పొలాన్నీ దానిలో ఉన్న గుహను కూడా మీకిస్తున్నాను. నా ప్రజలందరి సమక్షంలోనే దాన్ని మీకిస్తున్నాను. చనిపోయిన మీ భార్యను పాతిపెట్టడానికి మీకిస్తున్నాను.”

12 అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల ముందు సాగిల పడ్డాడు. 13 “నీ కిష్టమైతే నా మనవి విను. ఆ పొలానికి వెల చెల్లిస్తాను. నా దగ్గర వెల పుచ్చుకో. అప్పుడు నా భార్యను అక్కడ పాతిపెడతాను” అని అందరికీ వినపడేలా చెప్పాడు.

14 దానికి ఎఫ్రోను ఇలా జవాబిచ్చాడు. 15 “అయ్యా, విను. ఆ భూమి వెలగా నాలుగు వందల షెకెల్ల వెండి చెల్లిస్తే చాలు. ఆ మాత్రం మొత్తం నీకూ నాకూ ఎంత? చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో” అన్నాడు. 16 అబ్రాహాము ఎఫ్రోను చెప్పిన మాట విన్నాడు. హేతు కుమారులకు వినబడేలా ఎఫ్రోను చెప్పిన వెలను అంటే వర్తకుల తూకం ప్రకారం నాలుగు వందల షెకెల్ల వెండిని అబ్రాహాము తూచి అతనికి ఇచ్చాడు.

17 ఆ విధంగా మమ్రే పక్కనే ఉన్న మక్పేలా లోని ఎఫ్రోను పొలం, దాంట్లో ఉన్న గుహ, ఆ పొలంలోనూ దాని సరిహద్దుల్లోనూ ఉన్న చెట్లతో సహా 18 ఆ ఊరి ద్వారంలో ప్రవేశించే వారందరి ముందు హేతు వారసుల సమక్షంలో అబ్రాహాముకు స్వాధీనం అయింది.

19 ఆ తరువాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే మమ్రే పక్కనే ఉన్న మక్పేలా పొలం లోని గుహలో తన భార్య శారాను పాతిపెట్టాడు. 20 ఆ విధంగా ఆ పొలాన్నీ, దాంట్లో ఉన్న గుహనీ శ్మశానం కోసం అబ్రాహాముకు హేతు సంతతి వారు ఇవ్వడం వల్ల అవి అతని సొంతం అయ్యాయి.

రిబ్కా కుటుంబం

ఆదికాండం 22:20–24

20 ఆ సంగతులన్నీ జరిగిన తరువాత తన సోదరుడైన నాహోరుకు మిల్కా ద్వారా పిల్లలు కలిగారు అనే వార్త అబ్రాహాముకు చేరింది. 21 ఆ పిల్లలు ఎవరంటే, పెద్ద కొడుకు ఊజు, అతడి తమ్ముడు బూజు, అరాము తండ్రి కెమూయేలు, 22 కెసెదు, హజో, పిల్దాషు, జిద్లాపు, బెతూయేలు. ఈ బెతూయేలు రిబ్కాకు తండ్రి.

23 అబ్రాహాము సోదరుడైన నాహోరుకు ఆ ఎనిమిదిమందీ మిల్కా ద్వారా కలిగారు. 24 అతని ఉంపుడుకత్తె రెయూమా ద్వారా అతనికి తెబహు, గహము, తహషు, మయకా పుట్టారు.