రెండవ దేవాలయం గురించి యెహెజ్కేలు దర్శనం (continued)
క్రీ.పూ. 574
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 తరువాత అతడు నన్ను మందిరానికి తీసుకుని వచ్చి దాని పరిశుద్ధ స్థలం ప్రవేశానికి రెండు పక్కల ఉన్న స్తంభాలను కొలిచాడు. అవి ఒక్కొక్కటీ 3 మీటర్ల 20 సెంటి మీటర్లు. 2 ప్రవేశ ద్వారం వెడల్పు 5 మీటర్ల 40 సెంటి మీటర్లు. తలుపు రెండు వైపులా 2 మీటర్ల 70 సెంటి మీటర్లు, దాని పొడవు 22 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు. 3 అతడు లోపలికి పోయి వాకిలి స్తంభాలను కొలిచినప్పుడు అది ఒక్కొక్కటి ఒక మీటరు వెడల్పు ఉన్నాయి. వాకిలి 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు 3 మీటర్ల 80 సెంటి మీటర్లు ఉన్నాయి. 4 అతడు “ఇది అతి పరిశుద్ధస్థలం” అని చెప్పి దాన్ని కొలిచాడు. దాని పొడవు 11 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు.
5 తరువాత అతడు మందిరం గోడను కొలిచినప్పుడు అది, 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, మందిరం పక్కన ఉన్న మేడ గదులు ఒక్కొక్కటి సుమారు 2 మీటర్లు వెడల్పు ఉన్నాయి. 6 ఈ మేడగదులు మూడు అంతస్థులు ఉన్నాయి. ఆ విధంగా అవి ఒక్కొక్క అంతస్తుకు 30 గదులు. ఈ గదులు మందిరం గోడ మీద ఆనుకోలేదు. మందిరం చుట్టూ కట్టిన గోడతో కలిసి ఉన్నాయి. 7 ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొద్దీ వాటి వెడల్పు పెరుగుతూ వచ్చింది. అంటే పైకెక్కిన కొద్దీ మందిరం చుట్టూ ఉన్న మేడగదుల అంతస్థుల వెడల్పు పెరుగుతూ వచ్చింది కాబట్టి మందిరపు పైభాగం వెడల్పు కింది భాగం కంటే ఎక్కువగా ఉంది.
8 ఇంకా నేను చూసినప్పుడు మందిరం చుట్టూ మేడ గదులకు ఎత్తుగా ఉన్న పునాది కనిపించింది. ఆ పునాది ఎత్తు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు. 9 మేడగదుల బయట ఉన్న గోడ వెడల్పు 2 మీటర్ల 70 సెంటి మీటర్లు. మందిరపు మేడగదుల పక్కన ఖాళీ స్థలం ఉంది. 10 గదుల మధ్య మందిరం చుట్టూ నాలుగు వైపులా 11 మీటర్లు వెడల్పున స్థలం విడిచిపెట్టారు. 11 మేడగదుల గుమ్మాలు ఖాళీగా ఉన్న స్థలం వైపు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరపు వైపు, మరొకటి దక్షిణం వైపు ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ 2 మీటర్ల 70 సెంటి మీటర్లు వెడల్పు ఉంది. 12 ఆవరణం ఎదురుగా పడమటి వైపు ఒక కట్టడం ఉంది. దాని వెడల్పు 38 మీటర్లు, దాని గోడ వెడల్పు 2 మీటర్ల 70 సెంటి మీటర్లు, గోడ పొడవు 49 మీటర్లు. 13 మందిరం పొడవును కొలిచినప్పుడు అది 44 మీటర్లు ఉంది. ఆ కట్టడం, దాని గోడల కొలత 54 మీటర్లు. 14 తూర్పు వైపు మందిరం పొడవు 54 మీటర్లు. 15 మందిరం వెనక భాగంలోని ఖాళీ స్థలానికి ఎదురుగా ఒక కట్టడం ఉంది. దాని రెండు వైపులా ఉన్న వసారాల పొడవు 54 మీటర్లు.
16 అప్పుడా వ్యక్తి గర్భాలయం, ఆవరణపు మంటపాలు, గడపలు, కమ్ములు ఉన్న కిటికీలను, మూడు అంతస్థుల చుట్టూ ఉన్న వసారాలను కొలిచాడు. గడపలకెదురుగా నేల నుండి కిటికీలు చెక్కతో కప్పి ఉన్నాయి. 17 గుమ్మాలకు పైన మందిరానికి బయట, లోపల ఉన్న గోడంతా, చుట్టూ గోడ పైనా, కెరూబులు, ఖర్జూరపు చెట్టు చెక్కి ఉన్నాయి. 18 రెండు కెరూబుల మధ్య ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. ప్రతి కెరూబుకు రెండేసి ముఖాలున్నాయి. 19 ఇటు ఖర్జూరపు చెట్టు వైపున మనిషి ముఖం, అటు ఖర్జూరపు చెట్టు వైపున సింహం ముఖం ఉన్నాయి. మందిరం అంతా ఆ ప్రకారమే ఉన్నాయి. 20 నేల మొదలుకుని గుమ్మం పైవరకూ మందిరపు గోడకు కెరూబులు, ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. 21 మందిరపు ద్వారబంధాలు నలు చదరంగా ఉన్నాయి. పరిశుద్ధస్థలపు ద్వారబంధాలు కూడా అలాగే ఉన్నాయి. 22 బలిపీఠం చెక్కతో చేశారు. దాని ఎత్తు 1 మీటరు 60 సెంటి మీటర్లు, పొడవు ఒక మీటరు. దాని పీఠం, మూలలు, పక్కలు చెక్కతో చేసినవి. అతడు నాతో “ఇది యెహోవా సముఖంలో ఉండే బల్ల” అని చెప్పాడు.
23 మందిరానికి, పరిశుద్ధ స్థలానికి రెండు గుమ్మాలున్నాయి. 24 ఒక్కొక గుమ్మం రెండేసి మడత రెక్కలతో ఉంది. 25 అంతే కాక గోడల మీద ఉన్నట్టుగా మందిరపు గుమ్మాల మీద కూడా కెరూబులు, ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. బయటి వసారాకి విచిత్రంగా చేసిన చెక్క చూరు ఉంది. 26 మరియు వసారాకి, రెండు వైపులా గోడలకు, మేడగదులకు రెండు వైపులా కమ్ములు వేసిన కిటికీలు, ఖర్జూరపు చెట్ల ఆకారాలు చెక్కి ఉన్నాయి.
42:1 ఆ మనిషి ఉత్తరం వైపుకు నన్ను నడిపించి బయటి ఆవరణలోకి తోడుకుని వచ్చి ఖాళీ స్థలానికీ ఉత్తరాన ఉన్న కట్టడానికీ ఎదురుగా ఉన్న గదుల దగ్గర నిలబెట్టాడు. 2 ఆ కట్టడం గుమ్మం ఉత్తరం వైపుకు తిరిగి 54 మీటర్ల పొడవు, 27 మీటర్ల వెడల్పు ఉంది. 3 ఆ గదులు పరిశుద్ధ స్థలానికి 11 మీటర్లు దూరంలో ఉండి బయటి ఆవరణపు తాపడం చేసిన నేలకు ఎదురుగా మూడో అంతస్థులోని వసారాలు ఒకదాని కొకటి ఎదురుగా ఉన్నాయి. 4 ఆ గదులకు ఎదురుగా 5 మీటర్ల 40 సెంటి మీటర్ల వెడల్పు, 54 మీటర్ల పొడవు గల వసారా ఉంది. ఆ గదుల గుమ్మాలన్నీ ఉత్తరం వైపుకు చూస్తున్నాయి.
5 పైన గదులకు వసారాలుండడం వలన వాటి ఎత్తు తక్కువై మధ్యగదులు ఇరుకుగా ఉన్నాయి. 6 మూడో అంతస్థులో ఉన్న గదులకు ఆవరణకు ఉన్న స్తంభాలు లేవు కాబట్టి అవి కింద గదులకంటే, మధ్య గదులకంటే చిన్నవిగా కట్టి ఉన్నాయి. 7 గదుల వరుసను బట్టి బయటి ఆవరణ వైపు గదులకు ఎదురుగా 27 మీటర్ల పొడవు ఉన్న ఒక గోడ ఉంది. 8 బయటి ఆవరణలోని గదుల పొడవు 27 మీటర్లు ఉంది గాని మందిరం ముందటి ఆవరణ 54 మీటర్ల పొడవు ఉంది. 9 ఈ గదులు గోడకింద నుండి లేచినట్టుగా కనిపిస్తున్నాయి. బయటి ఆవరణలో నుండి వాటిలో ప్రవేశించడానికి తూర్పువైపున మార్గం ఉంది.
10 ఖాళీ స్థలానికి, కట్టడానికి ఎదురుగా ఆవరణపు గోడ వారున తూర్పువైపు కొన్ని గదులున్నాయి. 11 వాటి ఎదుట ఉన్న మార్గం ఉత్తరం వైపు ఉన్న గదుల మార్గం లాగా ఉంది. వాటి కొలతల ప్రకారమే ఇవి కూడా కట్టి ఉన్నాయి. వీటి ద్వారాలు కూడా వాటి లాగానే ఉన్నాయి. 12 దక్షిణం వైపు గదుల తలుపుల్లాగా వీటి తలుపులు కూడా ఉన్నాయి. ఆ మార్గం ఆవరణంలోకి పోయేవారికి తూర్పుగా ఉన్న గోడ ఎదురుగానే ఉంది.
13 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. “ఖాళీ స్థలానికి ఎదురుగా ఉన్న ఉత్తరపు గదులు, దక్షిణపు గదులు పవిత్రమైన యాజకులవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధమైన ఆహారాన్ని తింటారు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను, అంటే నైవేద్యాన్ని, పాప పరిహారార్థ బలి పశుమాంసాన్ని, అపరాధ పరిహారార్థ బలి పశుమాంసాన్ని ఉంచుతారు. ఆ స్థలం అతి పరిశుద్ధం. 14 యాజకులు లోపల ప్రవేశించేటప్పుడు పరిశుద్ధ స్థలాన్ని విడిచి బయటి ఆవరణంలోకి పోకుండా అక్కడే తాము పరిచర్యకు ధరించే వస్త్రాలను ఉంచాలి. అవి ప్రతిష్ఠితాలు కాబట్టి ప్రజలకు చెందిన దేనినైనా వారు తాకాలంటే వారు వేరే బట్టలు ధరించుకోవాలి.”
15 అతడు లోపలి మందిరాన్ని కొలవడం ముగించి నన్ను బయటికి తీసుకొచ్చి తూర్పువైపు తిరిగి ఉన్న గుమ్మానికి వచ్చి చుట్టూ కొలిచాడు. 16 తూర్పు వైపున కొలకర్రతో కొలిచినప్పుడు అది 270 మీటర్లు ఉంది. 17 ఉత్తరం వైపు 270 మీటర్లు, 18 దక్షిణం వైపు 270 మీటర్లు, 19 పడమర వైపు 270 మీటర్లు ఉంది. 20 ఆవిధంగా అతడు నాలుగు వైపులా కొలిచాడు. పవిత్రమైన, పవిత్రం కాని స్థలాలను వేరు చేయడానికి దానిచుట్టూ నాలుగు వైపులా 270 మీటర్లు ఉన్న నలుచదరపు గోడ కట్టి ఉంది.