యోబు తన పాపాల వల్ల బాధపడుతున్నాడని ఎలీఫజు చెప్పడం

యోబు బాధలు అతని పాపాలకు శిక్ష అని వాదించే ఎలీఫజు ప్రారంభించిన, యోబుకు అతని స్నేహితులకు మధ్య మొదటి వాదం.

క్రీ.పూ. 2130

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోబు 4–5

1 అందుకు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు.

2 ఎవరైనా ఈ విషయం గురించి నీతో మాట్లాడితే నీకు చిరాకు కలుగుతుందా? అయితే నీతో మాట్లాడకుండా నిదానంగా ఎవరు ఉంటారు?

3 నువ్వు చాలా మందికి బుద్ధినేర్పించావు. అనేకమంది నిస్సహాయులను బలపరిచావు.

4 దారి తప్పిన వాళ్ళను నీ మాటలతో ఆదుకున్నావు. మోకాళ్లు సడలిన వాళ్ళను బలపరిచావు.

5 అయితే ఇప్పుడు నీకు కష్టం కలిగినప్పుడు దుఃఖంతో అల్లాడుతున్నావు. నీకు కలిగిన కష్టం వల్ల తల్లడిల్లిపోతున్నావు.

6 నీకున్న భక్తి నీలో ధైర్యం కలిగించదా? నిజాయితీ గల ప్రవర్తన నీ ఆశాభావానికి ఆధారం కాదా?

7 జ్ఞాపకం చేసుకో, నీతిమంతుడు ఎప్పుడైనా నాశనం అయ్యాడా? నిజాయితీపరులు ఎక్కడైనా తుడిచి పెట్టుకుపోయారా?

8 నాకు తెలిసినంత వరకు దుష్టత్వాన్ని దున్ని, కీడు అనే విత్తనాలు చల్లే వాళ్ళు ఆ పంటనే కోస్తారు.

9 దేవుడు గాలి ఊదినప్పుడు వాళ్ళు నశించిపోతారు. ఆయన కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు లేకుండాా పోతారు.

10 సింహాల గర్జనలు, క్రూరసింహాల గాండ్రింపులు ఆగిపోతాయి. కొదమసింహాల కోరలు విరిగిపోతాయి.

11 తిండి లేకపోవడం చేత ఆడ సింహాలు నశించిపోతాయి. సింహపు కూనలు చెల్లాచెదరైపోతాయి.

12 నాకొక రహస్యం తెలిసింది. ఒకడు గుసగుసలాడుతున్నట్టు అది నా చెవికి వినబడింది.

13 మనుషులకు రాత్రివేళ గాఢనిద్ర పట్టే సమయంలో వచ్చే కలవరమైన కలలో అది వచ్చింది.

14 నాకు భయం వణుకు కలిగింది. అందువల్ల నా ఎముకలన్నీ వణికిపోయాయి.

15 ఒకడి ఊపిరి నా ముఖానికి తగిలింది. నా శరీరం పై వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి.

16 ఒక రూపం నా కళ్ళెదుట నిలిచింది. నేను దాన్ని గుర్తు పట్టలేకపోయాను. మెల్లగా వినిపించే ఒక స్వరం విన్నాను. ఆ స్వరం “దేవుని సన్నిధిలో అపవిత్రులు నీతిమంతులవుతారా?

17 తమ సృష్టికర్త ఎదుట ఒకడు పవిత్రుడౌతాడా?” అంటుంది.

18 తన సేవకుల పట్ల ఆయనకు నమ్మకం పోయింది. తన దూతల్లోనే ఆయన తప్పులు వెతుకుతున్నాడు.

19 అలాంటిది బంకమట్టి ఇళ్ళలో నివసించే వాళ్ళలో, మట్టిలో పుట్టిన వాళ్ళలో, చిమ్మెట చితికిపోయేలా చితికిపొయే వాళ్ళలో ఇంకెన్ని తప్పులు ఆయన చూస్తాడు!

20 ఉదయం నుండి సాయంత్రం మధ్యకాలంలో వాళ్ళు ముక్కలైపోతారు. ఎవరూ గుర్తించకుండానే వాళ్ళు శాశ్వతంగా నాశనమైపోతారు.

21 వాళ్ళ డేరాల తాళ్ళు పెరికివేస్తారు. వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండానే మరణమైపోతారు. నేడు ఆ విధంగానే జరుగుతుంది గదా.

5:1 నువ్వు మొర్రపెట్టినప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు?

2 తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు.

3 మూర్ఖుడు వేరు పారడం నేను కనుగొన్నాను. అయితే వెంటనే అతని నివాసస్థలం శాపగ్రస్థమైనదని తెలుసుకున్నాను.

4 అతని పిల్లలకు క్షేమం దూరం అవుతుంది. గుమ్మాల దగ్గరే వాళ్ళు నశించిపోతారు. వాళ్ళను విడిపించేవాడు ఎవ్వరూ లేరు.

5 ఆకలితో ఉన్నవాళ్ళు అతని పంటను తినివేస్తారు. ముళ్ళ పొదల్లో ఉన్నదాని నుండి కూడా వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళ ఆస్తి కోసం తహతహలాడే వాళ్ళు దాన్ని మింగేస్తారు.

6 దుమ్ము నుండి కష్టాలు పుట్టవు. భూమిలోనుండి బాధ మొలవదు.

7 నిప్పురవ్వలు పైకి ఎగిసినట్టు మనుషులు బాధలు అనుభవించడానికే పుడుతున్నారు.

8 అయితే నేను నా దేవుడి ఆశ్రయం కోరేవాణ్ణి. నా సంగతులు దేవునికే అప్పగించే వాణ్ణి.

9 ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆ ఆశ్చర్య క్రియలు లెక్కకు మించినవి.

10 ఆయన భూమి మీద వానలు కురిపిస్తాడు. పంట పొలాల మీద నీళ్లు ప్రవహింపజేస్తాడు.

11 ఆ విధంగా ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు. దుఃఖపడే వాళ్ళకు ఊరట కలిగిస్తాడు.

12 వంచకులు చేసే కుట్రలు నెరవేరకుండా వాళ్ళ ఆలోచనలు భగ్నం చేస్తాడు.

13 దేవుడు జ్ఞానుల యుక్తి మూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు. కపట క్రియలు జరిగించేవాళ్ళ తలంపులు తారుమారు చేస్తాడు.

14 వెలుగు ఉండే సమయంలో వాళ్లను చీకటి కమ్ముకుంటుంది. ఒకడు రాత్రిలో తడుములాడినట్టు వాళ్ళు మధ్యాహ్న సమయంలో తడుములాడతారు.

15 బలాఢ్యుల నోటి నుంచి వచ్చే కత్తిలాంటి మాటల బారి నుండి, వాళ్ళ చేతి నుండి ఆయన దరిద్రులను రక్షిస్తాడు.

16 కాబట్టి పేదవాళ్ళకు ఆశాభావం కలుగుతుంది. అన్యాయానికి నోరు మూతబడుతుంది.

17 దేవుడు ఎవరిని గద్దించి శిక్షకు పాత్రునిగా చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించు.

18 ఆయన గాయాలు రేపుతాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన దెబ్బ తీస్తాడు, తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు.

19 ఆరు కష్టాలు కలిగినప్పుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు. ఏడు కష్టాలు వచ్చినా నీకు ఏ అపాయం కలుగదు.

20 కరువుకాటకాల వల్ల కలిగే మరణం నుండి, యుద్ధ సమయంలో కత్తివాత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు.

21 దూషణ మాటల వల్ల కలిగే అవమానం నుండి నిన్ను తప్పిస్తాడు. నీపై వినాశనం విరుచుకుపడినా నువ్వు దానికి భయపడవు.

22 కరువులు, ప్రళయాలు వచ్చినా నువ్వు వాటిని లక్ష్యపెట్టవు. క్రూర మృగాలకు నీవు భయపడవు.

23 నీ పొలంలోని రాళ్ళతో కూడా నీవు ఒప్పందం చేసుకుంటావు. అడవి జంతువులతో సఖ్యంగా ఉంటావు.

24 నువ్వు నివసించే నీ గుడారం క్షేమకరమని నువ్వు తెలుసుకుంటావు. నీ గొర్రెల దొడ్డిలోకి వెళ్తే ఒక్కటి కూడా తప్పిపోలేదని గ్రహిస్తావు.

25 నీ సంతానం విస్తరిస్తుందనీ, నీ వారసులు భూమి మీద పచ్చికలాగా వృద్ధి చెందుతారనీ నీకు నిశ్చయత కలుగుతుంది.

26 ధాన్యం పనలను కళ్ళానికి మోసుకు పోయినట్టు నిండు వృద్ధాప్యంలో నువ్వు సమాధికి చేరతావు.

27 ఈ విషయాలన్నీ మేము తరచి తరచి పరిశీలించాం. ఇవన్నీ వాస్తవాలు. నీకు ఉపయోగపడే ఈ మాటలన్నీ జాగ్రత్తగా విని అర్థం చేసుకో.