ఏలీయా పరలోకానికి కొనిపోబడడం
క్రీ.పూ. 896
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 యెహోవా ఏలీయాను సుడిగాలిలో పరలోకానికి తీసుకువెళ్ళే సమయం దగ్గర పడింది. కాబట్టి ఏలీయా ఎలీషాతో కలసి గిల్గాలు నుండి ప్రయాణమయ్యాడు. 2 అప్పుడు ఏలీయా “నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో. నన్ను బేతేలుకు వెళ్ళమని యెహోవా చెప్పాడు” అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా “యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను. నేను నిన్ను విడిచి పెట్టను” అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ బేతేలుకు వెళ్ళారు.
3 బేతేలులో ఉన్న ప్రవక్తల సమాజం వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. “ఈ రోజు నీ దగ్గరనుండి నీ గురువుని యెహోవా తీసుకు వెళ్తాడని తెలుసా?” అని ఎలీషాను ప్రశ్నించారు. దానికి ఎలీషా “నాకు తెలుసులే. మీరు దాని గురించి మాట్లాడకండి” అని జవాబిచ్చాడు. 4 అప్పుడు ఏలీయా “నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో. నన్ను యెరికోకి వెళ్ళమని యెహోవా చెప్పాడు” అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా “యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను, నేను నిన్ను విడిచి పెట్టను” అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ యెరికోకి వెళ్ళారు.
5 అప్పుడు యెరికోలో కూడా ప్రవక్తల బృందం ఉంది. వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. “ఈ రోజు నీ దగ్గరనుండి నీ గురువుని యెహోవా తీసుకు వెళ్తాడని తెలుసా?” అని ఎలీషాను ప్రశ్నించారు. దానికి ఎలీషా “నాకు తెలుసులే. మీరు దాని గురించి మాట్లాడకండి” అని జవాబిచ్చాడు. 6 అప్పుడు ఏలీయా “నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో. నన్ను యొర్దానుకి వెళ్ళమని యెహోవా చెప్పాడు” అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా “యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను, నేను నిన్ను విడిచి పెట్టను” అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ప్రయాణం కొనసాగించారు.
7 తరువాత వాళ్ళిద్దరూ యొర్దాను నదీ తీరాన నిల్చున్నారు. ప్రవక్తల సమాజం వారు యాభై మంది కొంచెం దూరంలో నిలబడి చూస్తూ ఉన్నారు. 8 అప్పుడు ఏలీయా తన పైవస్త్రాన్ని తీసుకుని, దాన్ని చుట్టి దానితో నీటి మీద కొట్టాడు. దాంతో నది అటూ ఇటూగా విడిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ పొడినేల పైన నడుస్తూ దాటిపోయారు.
9 వాళ్ళిద్దరూ నది దాటిన తరువాత ఏలీయా ఎలీషాతో ఇలా అన్నాడు. “నన్ను నీనుండి యెహోవా తీసుకుపోక ముందు నీ కోసం నేనేం చేయాలనుకుంటున్నావో చెప్పు.” అందుకు ఎలీషా “నీ ఆత్మలో రెండు పాళ్ళు నా పైకి వచ్చేలా చెయ్యి” అన్నాడు. 10 అందుకు ఏలీయా “నీవు కఠినమైన విషయం అడిగావు. అయితే యెహోవా నన్ను నీ నుంచి తీసుకు వెళ్ళే సమయంలో ఒకవేళ నేను నీకు కనిపిస్తే అది నీకు జరుగుతుంది. కనిపించకపోతే జరగదు” అన్నాడు.
11 వారు మాట్లాడుతూ ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా అగ్నిజ్వాల వంటి ఒక రథం, అగ్నిజ్వాలల వంటి గుర్రాలూ కనిపించాయి. అవి వారిద్దరి మధ్యకు వచ్చి ఇద్దరినీ వేరు చేశాయి. ఇంతలో ఒక సుడి గాలి లేచింది. ఆ సుడిగాలిలో ఎలీయా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. 12 ఎలీషా అది చూసి “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలుకి రథాలూ, వాళ్ళ రౌతులు నువ్వే” అని కేక పెట్టాడు.
ఆ తరువాత ఏలీయా అతనికి మళ్ళీ కనిపించలేదు. అప్పుడు ఎలీషా తాను కట్టుకున్న వస్త్రం తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా చేశాడు.
13 ఏలీయా దగ్గర నుండి జారి పడిన పైవస్త్రాన్ని అతడు తీసుకున్నాడు. దానితో యొర్దాను నదీ తీరానికి వచ్చాడు. 14 నేల మీద పడిన ఎలీయా పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీటిని కొట్టి “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అన్నాడు. అతడు ఆ పైవస్త్రంతో నీటిని కొట్టగానే నది అటూ ఇటూగా విడిపోయింది. ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచి పోయాడు.
15 యెరికోలో ఉన్న ప్రవక్తల సమాజం వారు అతని కోసం చూస్తూ ఉన్నారు. వారు అతని చూడగానే “ఏలీయా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది” అని చెప్పుకున్నారు. వారు అతణ్ణి కలుసుకోడానికి వెళ్ళి నేల వరకూ వంగి అతనికి నమస్కారం చేశారు. 16 వారు అతనితో “నీ సేవకులైన మా దగ్గర యాభై మంది బలమైన వారున్నారు. నీ గురువును వెదకడానికి వాళ్ళను వెళ్ళనివ్వు. ఒకవేళ యెహోవా ఆత్మ అతణ్ణి పైకి తీసుకు వెళ్ళి ఏ పర్వతం మీదనో, ఏ లోయలోనో పడవేసి ఉండవచ్చు” అని మనవి చేశారు. దానికి ఎలీషా “వద్దు, ఎవర్నీ పంపకండి” అని జవాబిచ్చాడు.
17 అయితే వారు అతణ్ణి బాగా ఒత్తిడి చేసి విసిగించారు. దాంతో అతడు “సరే పంపండి” అన్నాడు. అప్పుడు వారు యాభై మందిని పంపించారు. వారు వెళ్లి అతని కోసం మూడు రోజులు గాలించారు గానీ అతణ్ణి కనుక్కోలేక పోయారు. 18 దాంతో వారు యెరికో పట్టణంలోనే ఆగి ఉన్న ఎలీషా దగ్గరికి తిరిగి వచ్చారు. అతడు వాళ్ళతో “వెళ్ళ వద్దని నేను మీకు చెప్పాను కదా” అన్నాడు.
19 తరువాత ఆ పట్టణంలో మనుషులు ఎలీషాతో “మా గోడు వినండి. మా యజమానులైన మీరు చూస్తున్నట్లు ఈ పట్టణ ప్రాంతం మనోహరంగా ఉంది. కానీ ఇక్కడి నీళ్ళు మంచివి కావు. అందుచేత భూమి కూడా నిస్సారంగా ఉంది” అన్నారు. 20 దానికి ఎలీషా “ఒక కొత్త గిన్నెలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకు రండి” అని చెప్పాడు. వారు అలాగే దాన్ని అతని దగ్గరికి తీసుకుని వచ్చారు.
21 అప్పుడు ఎలీషా ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊటలో ఉప్పు వేసి ఇలా అన్నాడు. “యెహోవా ఇలా చెప్తున్నాడు. ఈ నీటిని నేను బాగు చేశాను. కాబట్టి ఇప్పటి నుండి దీని వల్ల చావు అనేది ఉండదు. నిస్సారత ఇక ఉండదు.” 22 అందుచేత ఎలీషా పలికిన మాట ప్రకారం ఆ నీళ్ళు ఈ రోజు వరకూ ఆరోగ్యకరంగా ఉన్నాయి.
23 తరువాత ఎలీషా అక్కడ నుండి బేతేలుకు వెళ్ళాడు. అతడు దారిలో వెళ్తుండగా ఆ పట్టణంలో నుండి కొంతమంది కుర్రవారు వచ్చి “బోడి వాడా, బోడి వాడా, వెళ్లిపో” అంటూ ఎగతాళి చేసారు. 24 ఎలీషా వెనక్కు తిరిగి వాళ్ళను చూసి యెహోవా పేరున వాళ్ళను శపించాడు. అప్పుడు అడవిలో నుండి రెండు ఆడ ఎలుగు బంట్లు వచ్చి వారిలో నలభై రెండు మందిని గాయపరిచాయి. 25 అప్పుడు అతడు అక్కడ నుండి కర్మెలు పర్వతానికి వెళ్ళాడు. అక్కడనుండి షోమ్రోనుకి తిరిగి వెళ్ళాడు.
మోయాబు వారిని ఓడించిన యెహోరాము క్రీ.పూ. 895
6 దాంతో ఇశ్రాయేలు ప్రజలందర్నీ యుద్ధానికి సిద్ధం చేయడానికి యెహోరాము షోమ్రోనులో నుండి ప్రయాణమయ్యాడు.
7 ఇతడు యూదా దేశానికి రాజుగా ఉన్న యెహోషాపాతుకు ఒక సందేశం పంపించాడు. ఆ సందేశంలో “మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేశాడు. మోయాబుపై నేను చేయబోయే యుద్ధంలో నాతో కలిసి వస్తావా?” అని అడిగాడు. దానికి యెహోషాపాతు “నేను యుద్ధానికి వస్తాను. నేనే నువ్వూ, నా ప్రజలు నీ ప్రజలే, నా గుర్రాలు నీ గుర్రాలే అనుకో” అని జవాబిచ్చాడు. 8 అప్పుడు యెహోరాము “దాడి చేయడానికి మనం ఏ దారి గుండా వెళ్దాం?” అని అడిగాడు. అందుకు యెహోషాపాతు “ఎదోము అడవి దారి గుండా వెళ్దాం” అన్నాడు.
9 కాబట్టి ఇశ్రాయేలు, యూదా, ఎదోము దేశాల రాజులు ఏడు రోజుల పాటు ప్రయాణం చేశారు. చివరికి వాళ్ళ సైన్యానికీ, గుర్రాలకూ మిగిలిన పశువులకూ నీళ్ళు లేకుండా పోయాయి. 10 కాబట్టి ఇశ్రాయేలు రాజు “అయ్యోయ్యో, ఎందుకిలా జరిగింది? మోయాబు వాళ్ళ చేతుల్లో ఓడిపోవడానికి రాజులైన మన ముగ్గుర్నీ యెహోవా పిలిచాడా ఏమిటి?” అన్నాడు.
11 కానీ యెహోషాపాతు “మన కోసం యెహోవాను సంప్రదించడానికి ఇక్కడ ఒక్క యెహోవా ప్రవక్త కూడా లేడా?” అని అడిగాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు దగ్గర సైనికోద్యోగి ఒకడు “షాపాతు కొడుకు ఎలీషా ఇక్కడ ఉన్నాడు. అతడు ఇంతకు ముందు ఎలీయా చేతులపై నీళ్ళు పోసే వాడు” అని చెప్పాడు. 12 దానికి యెహోషాపాతు “యెహోవా వాక్కు అతని దగ్గర ఉంది” అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు, ఎదోము రాజు, యెహోషాపాతూ కలసి అతని దగ్గరికి వెళ్ళారు.
13 ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి “నీతో నాకేం పని? నీ తల్లీ తండ్రీ పెట్టుకున్న ప్రవక్తల దగ్గరికి వెళ్ళు” అన్నాడు. ఇశ్రాయేలు రాజు అతనితో “మోయాబు వారు మమ్మల్ని ఓడించాలని యెహోవా మా ముగ్గురు రాజులను పిలిచాడు” అన్నాడు. 14 అప్పుడు ఎలీషా “నేను సైన్యాలకు ప్రభువు అయిన యెహోవా సమక్షంలో నిలబడి ఉన్నాను. ఆ యెహోవా ప్రాణం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న యూదా రాజు యెహోషాపాతును నేను గౌరవించకపోతే నిన్నసలు లక్ష్యపెట్టేవాణ్ణి కాదు. నీ వైపు చూసే వాణ్ణి కాదు. 15 అయితే ఇప్పుడు తీగ వాయిద్యం వాయించగల ఒకణ్ణి నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. తీగ వాయిద్యం వాయించేవాడు ఒకడు వచ్చి వాయిస్తూ ఉండగా యెహోవా హస్తం ఎలీషా పైకి బలంగా వచ్చింది. అప్పుడు అతడు ఇలా అన్నాడు. 16 “యెహోవా ఇలా చెప్తున్నాడు, ఎండిన ఈ నదీ లోయలో అంతటా కందకాలు తవ్వించండి. 17 ఎందుకంటే యెహోవా ఇలా చెప్తున్నాడు, గాలీ ఉండదు, వర్షమూ రాదు. ఈ లోయ అంతా నీటితో నిండిపోతుంది. మీరు ఆ నీరు తాగుతారు. మీ పశువులూ, మీ దగ్గర ఉన్న జంతువులూ తాగుతాయి.
18 యెహోవా దృష్టికి ఇది చాలా తేలికైన విషయం. పైగా ఆయన మోయాబు వాళ్ళపై మీకు విజయం ఇస్తాడు. 19 మీరు ప్రాకారాలున్న ప్రతి పట్టణాన్నీ, ప్రతి మంచి పట్టణాన్నీ వశం చేసుకోవాలి. అక్కడ మీరు ప్రతి మంచి చెట్టునీ నరికి వేయాలి. నీళ్ళ ఊటలను పూడ్చి వేయాలి. మంచి భూములను రాళ్ళతో నింపి పాడు చేయాలి.”
20 కాబట్టి మరుసటి ఉదయం నైవేద్యం అర్పించే సమయానికి ఎదోము వైపు నుండి నీళ్ళు పారుతూ వచ్చాయి. వారున్న ఆ ప్రాంతమంతా జలమయం అయింది.
21 తమతో యుద్ధం చేయడానికి రాజులు వచ్చారని మోయాబు వారు విన్నారు. వాళ్ళలో యువకులు మొదలు వృద్ధుల వరకూ ఆయుధాలు ధరించ గలిగిన వాళ్ళంతా ఆ దేశం సరిహద్దులో సమకూడారు. 22 ఉదయాన్నే వారు లేచి చూసినప్పుడు సూర్య కాంతి ఆ నీళ్ల మీద ప్రతిబింబిస్తూ ఉంది. అవతల నుండి మోయాబు వాళ్ళకు ఆ నీళ్లు రక్తంలా కనిపించాయి. 23 “అదంతా రక్తం! రాజులు నాశనమయ్యారు. వారు ఒకళ్లనొకళ్ళు చంపుకున్నారు. మోయాబు వీరులారా, రండి, మనం వెళ్ళి దోపుడు సొమ్ము పట్టుకుందాము” అని చెప్పుకున్నారు.
24 వారు ఇశ్రాయేలు శిబిరం దగ్గరికి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం మోయాబు వాళ్ళపై మెరుపు దాడి చేశారు. మోయాబు వారు ఇశ్రాయేలు సైన్యం ఎదుట నిలవలేక కాళ్ళకు బుద్ధి చెప్పారు. ఇశ్రాయేలు సైన్యం మోయాబులో చొరబడి వాళ్ళను తరిమి చంపారు. 25 వాళ్ళ పట్టణాలను ధ్వంసం చేశారు. అంతా తలో రాయి వేసి సారవంతమైన భూములను రాళ్ళతోనింపారు. నీళ్ళ ఊటలు పూడ్చివేశారు. మంచి చెట్లు అన్నిటినీ నరికి వేశారు. ఒక్క కీర్హరెశెతు అనే పట్టణాన్ని మాత్రం దాని ప్రాకారంతో ఉండనిచ్చారు. కానీ ఒడిసెల విసిరే వారు దాన్ని కూడా చుట్టుముట్టి రాళ్ళు విసురుతూ దానిపై దాడి చేశారు.
26 మోయాబు రాజు మేషా, యుద్ధంలో ఓడిపోయామని గ్రహించి ఏడువందల మంది ఖడ్గధారులను తనతో తీసుకుని సైన్యాన్ని ఛేదించుకుంటూ ఎదోము రాజు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కాని అది వాళ్ళకు సాధ్యం కాలేదు. 27 అప్పుడు అతడు తన తరువాత రాజు కావలసిన తన పెద్ద కొడుకుని పట్టుకుని పట్టణం గోడ పైన దహనబలిగా అర్పించాడు. కాబట్టి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తీవ్రమైన కోపం రేగింది. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం మేషా రాజును విడిచిపెట్టి తమ స్వదేశానికి తిరిగి వచ్చారు.