దావీదు వ్యభిచారం

క్రీ.పూ. 1035

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 దినవృత్తాంతాలు 20:1

1 తరువాతి సంవత్సరం రాజులు సాధారణంగా యుద్ధానికి బయలుదేరే కాలంలో యోవాబు సైన్యంలో శూరులైన వాళ్ళను సమకూర్చి, అమ్మోనీయుల దేశాన్ని ధ్వంసం చేసి, రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. దావీదు యెరూషలేములోనే ఉండగా, యోవాబు రబ్బాను ఓడించి ప్రజలను హతం చేశాడు.

2 సమూయేలు 11:1–12:15

1 వసంత కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరే కాలంలో, అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణాన్ని ఆక్రమించుకోడానికి దావీదు యోవాబునీ తన సేవకులనూ ఇశ్రాయేలు సైన్యమంతటినీ పంపించాడు. దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు.

2 ఒకరోజు సాయంత్రం సమయంలో దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం డాబా మీద నడుస్తున్నాడు. డాబాపై నుండి కిందికి చూస్తున్నప్పుడు స్నానం చేస్తూ ఉన్న ఒక స్త్రీ కనిపించింది. 3 ఆమె ఎంతో అందంగా ఉంది. ఆమె గురించి వివరాలు తెలుసుకు రమ్మని దావీదు ఒకణ్ణి పంపించాడు. అతడు వచ్చి “ఆమె పేరు బత్షెబ. హిత్తీయుడైన ఊరియా భార్య, ఏలీయాము కూతురు” అని చెప్పాడు. 4 దావీదు తన మనుషులను పంపి ఆమెను తన దగ్గరికి పిలిపించాడు. ఆమె అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆమెతో శయనించాడు. ఆమె తనకు కలిగిన మలినం పోగొట్టుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళింది.

5 కొన్ని రోజులకు ఆమె గర్భం ధరించింది. “నేను గర్భవతి నయ్యాను” అని ఆమె దావీదుకు కబురు పంపింది. 6 దావీదు “హిత్తీయుడైన ఊరియాని నా దగ్గరికి పంపించు” అని ఒక వ్యక్తి ద్వారా యోవాబుకు కబురు చేశాడు. 7 యోవాబు ఊరియాని దావీదు దగ్గరికి పంపించాడు. జరుగుతున్న యుద్ధ విశేషాలనూ యోవాబు, ఇతర సైనికుల క్షేమ సమాచారాలనూ దావీదు అతణ్ణి అడిగి తెలుసుకున్నాడు. 8 తరువాత దావీదు “నువ్వు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో” అని ఊరియాకు అనుమతి ఇచ్చాడు. ఊరియా రాజు నగరం నుండి బయలుదేరాడు. రాజు అతని వెనకాలే అతనికి ఒక బహుమానం పంపించాడు. 9 అయితే ఊరియా తన ఇంటికి వెళ్ళకుండా రాజు సేవకులతో కలసి రాజనగర గుమ్మం దగ్గర నిద్రపోయాడు.

10 ఊరియా అతని ఇంటికి వెళ్ళలేదన్న సంగతి దావీదుకు తెలిసింది. అప్పుడు దావీదు ఊరియాను పిలిపించి “నువ్వు ప్రయాణం చేసి అలసిపోయావు కదా, ఇంటికి ఎందుకు వెళ్ళలేదు?” అని అడిగాడు. 11 అందుకు ఊరియా “మందసమూ, ఇశ్రాయేలువారూ యూదావారూ గుడారాల్లో ఉంటున్నారు. నా అధికారి యోవాబూ, మా రాజువైన నీ సేవకులూ బాహ్య ప్రదేశంలో ఉండగా నేను తింటూ, తాగుతూ నా భార్యతో గడపడానికి ఇంటికి వెళ్ళాలా? నీ మీద, నీ ప్రాణం మీద ఒట్టు, నేను అలా ఎంత మాత్రం చేయలేను” అని దావీదుతో అన్నాడు.

12 అప్పుడు దావీదు “ఈరోజు కూడా నువ్వు ఇక్కడే ఉండు. రేపు నిన్ను పంపిస్తాను” అని ఊరియాతో చెప్పాడు. ఊరియా ఆ రోజు, తరువాతి రోజు యెరూషలేములో ఉండిపోయాడు. 13 ఈలోగా దావీదు ఊరియాను భోజనానికి పిలిపించాడు. దావీదు అతడు బాగా తిని, తాగి మత్తుడయ్యేలా చేశాడు. సాయంత్రమయ్యాక అతడు బయలుదేరి వెళ్లి మళ్ళీ తన ఇంటికి వెళ్ళకుండా రాజు సేవకుల మధ్య నిద్రపోయాడు.

14 తెల్లవారిన తరువాత దావీదు “యుద్ధం భీకరంగా జరుగుతున్న చోట ఊరియాను ముందు వరుసలో నిలబెట్టి అతడు చనిపోయేలా చేసి అక్కడి నుండి వెళ్ళిపో” అని 15 యోవాబుకు ఉత్తరం రాయించి దాన్ని ఊరియా చేత పంపించాడు. 16 యోవాబు అమ్మోనీయుల పట్టాణాన్ని ఆక్రమించే సమయంలో యుద్ధం భీకరంగా జరిగే స్థలాన్ని గుర్తించి ఆ స్థలానికి ఊరియాను పంపాడు. 17 ఆ పట్టణం వారు బయటికీ వచ్చి యోవాబుతో యుద్ధం చేసినప్పుడు కొందరు దావీదు సేవకులతో పాటు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.

18 యోవాబు ఈ యుద్ధ సమాచారాన్ని ఒక సైనికుడి ద్వారా దావీదుకు తెలియజేశాడు. 19 యోవాబు ఆ సైనికుడితో “యుద్ధ సమాచారం రాజుకు చెప్పిన తరువాత రాజు కోపం తెచ్చుకుని ‘మీరు యుద్ధం తీవ్రంగా జరుగుతున్న పట్టణానికి దగ్గరగా ఎందుకు వెళ్లారు? 20 గోడపైకి ఎక్కి వాళ్ళు బాణాలు వేస్తారని మీకు తెలియదా? 21 ఎరుబ్బెషెతు కొడుకు అబీమెలెకు ఎలా చనిపోయాడు? తేబేసు దగ్గర ఒక స్త్రీ తిరగలి రాయిని గోడపై నుండి అతని మీద వేయడం వల్లనే గదా అతడు చనిపోయింది? ప్రాకారం దగ్గరికి మీరెందుకు వెళ్ళారు?’ అని అడిగితే, నువ్వు, ‘తమ సేవకుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని చెప్పు” అని చెప్పి ఆ సైనికుణ్ణి పంపాడు.

22 యోవాబు పంపిన సైనికుడు వచ్చి దావీదుకు విషయమంతా చెప్పాడు. 23 ఎలాగంటే “వారి సైనికులు మమ్మల్ని తరుముతూ యుద్ధభూమిలో మాకు ఎదురు పడినప్పుడు మేము వారిని సరిహద్దుల వరకూ తరిమి గెలిచాము. 24 అప్పుడు గోడలపై నుండి విలుకాళ్ళు తమ సైనికులపై బాణాలు కురిపించారు. రాజు సేవకుల్లో కొందరితో సహా తమరి సేవకుడు, హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.” 25 అప్పుడు దావీదు “నువ్వు యోవాబుతో ఈ మాట చెప్పు. ‘జరిగినదాన్ని బట్టి నువ్వు బాధపడవద్దు. కత్తి ఒకసారి ఒకరిని, మరోసారి మరొకరిని చంపుతుంది. పట్టణం మీద యుద్ధం మరింత తీవ్రతరం చేసి దాన్ని ఓడించు’ అని యోవాబుకు ధైర్యం చెప్పు” అని ఆ సైనికునికి చెప్పి పంపించాడు.

26 ఊరియా భార్య బత్షెబ తన భర్త చనిపోయిన సంగతి విని విలపించింది. 27 విలాప సమయం ముగిసిన తరువాత దావీదు తన మనుషులను పంపి ఆమెను తన భవనానికి రప్పించుకున్నాడు. ఆమె దావీదుకు భార్యగా ఉండి ఒక కొడుకును కన్నది. అయితే దావీదు చేసిన ఈ పని యెహోవా దృష్టిలో పాపంగా నిలిచిపోయింది.

12:1 యెహోవా ప్రవక్త అయిన నాతానును దావీదు దగ్గరికి పంపించాడు. అతడు వచ్చి దావీదుతో ఇలా అన్నాడు. “ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. 2 ఒకడు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు. ధనవంతుడికి చాలా గొర్రె మందలూ, పశువులూ ఉన్నాయి. 3 బీదవాడికి మాత్రం అతడు కొనుక్కొన్న ఒక చిన్న ఆడ గొర్రెపిల్ల తప్ప ఇంకేమీ లేదు. ఆ గొర్రెపిల్ల అతని దగ్గర, అతని బిడ్డల దగ్గర పెరుగుతూ వారి చేతిముద్దలు తింటూ, వారి గిన్నెలోనిది తాగుతూ ఉండేది. వారి పక్కన పండుకొంటూ అతని కూతురులాగా ఉండేది.

4 ఇలా ఉండగా ఒక అతిథి ధనవంతుని దగ్గరికి వచ్చాడు. తన దగ్గరికి వచ్చిన అతిథికి విందు ఏర్పాటు చేయడానికి తన సొంత గొర్రెలను గానీ, పశువులను గానీ ముట్టుకోవడానికి ఇష్టపడక, ఆ బీదవాడి గొర్రెపిల్లను పట్టుకుని, ఆ అతిథికి విందు సిద్ధం చేశాడు.” 5 దావీదు ఈ మాటలు విని అలా చేసినవాడి మీద తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు. “యెహోవా మీద ఒట్టు. ఈ పని చేసినవాడు తప్పకుండా మరణశిక్షకు పాత్రుడు. 6 వాడు దయ లేకుండా ఈ పని చేశాడు కాబట్టి ఆ గొర్రెపిల్లకు బదులు నాలుగు గొర్రెపిల్లలు తిరిగి ఇవ్వాలి” అని నాతానుతో అన్నాడు.

7 నాతాను దావీదును చూసి “ఆ మనిషివి నువ్వే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఇశ్రాయేలీయులపై నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి, సౌలు నుండి నిన్ను కాపాడాను. నీ యజమాని ఇంటిని నీకు అనుగ్రహించి 8 అతడి స్త్రీలను నీ కౌగిటిలోకి చేర్చాను. ఇశ్రాయేలు వారిపై, యూదా వారిపై నీకు అధికారం అప్పగించాను. నువ్వు గనుక ఇది చాలదని భావిస్తే నేను ఇంకా ఎక్కువగా నీకు ఇచ్చి ఉండేవాడిని. 9 నీవు యెహోవా మాటను ధిక్కరించి ఆయన దృష్టికి చెడ్డ పని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్యగా చేసుకోవడానికి కుట్ర పన్నావు. అమ్మోనీయుల చేత అతణ్ణి చంపించావు.

10 నువ్వు నన్ను లక్ష్యపెట్టక హిత్తీయుడైన ఊరియా భార్యను నీ భార్యగా చేసుకొన్నావు కాబట్టి నీ ఇంటివారిపై కత్తి ఎల్లకాలం నిలిచి ఉంటుంది.

11 నా మాట విను. యెహోవానైన నేను చెప్పేదేమిటంటే, నీ సంతానం మూలంగా నేను నీకు కీడు కలుగజేస్తాను. నువ్వు చూస్తుండగానే నేను నీ భార్యలను మరొకరికి అప్పగిస్తాను. 12 పగలు సమయంలోనే వారు నీ భార్యలతో శయనిస్తారు. నువ్వు నీ పాపం రహస్యంగా చేశావు గానీ ఇశ్రాయేలీయులంతా చూస్తుండగా పట్టపగలే నేను చెప్పినదంతా జరుగుతుంది” అని అన్నాడు.

13 అందుకు దావీదు “నేను పాపం చేశాను” అని నాతానుతో అన్నాడు. అప్పుడు నాతాను “నీ పాపాన్ని బట్టి నువ్వు చనిపోయేలా యెహోవా నిన్ను శిక్షించక పోవచ్చు. 14-15 అయితే నువ్వు చేసిన ఈ పనివల్ల యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నువ్వు ఒక మంచి కారణం చూపించావు. కాబట్టి నీకు పుట్టబోయే పసికందు తప్పకుండా చనిపోతాడు” అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు.

కీర్తనలు 51

ప్రధాన సంగీతకారుడి కోసం. బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరకు నాతాను వచ్చినప్పుడు దావీదు రాసిన కీర్తన.

1 దేవా, నీ నిబంధన కృప కారణంగా నన్ను కనికరించు. నీ అధికమైన కరుణను బట్టి నా దోషాలను తుడిచివెయ్యి.

2 నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు.

3 నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది.

4 నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు.

5 ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను.

6 ఇదిగో, నువ్వు నా హృదయంలో నమ్మదగ్గవాడుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. నా హృదయంలో జ్ఞానాన్ని తెలుసుకునేలా చేస్తావు.

7 నన్ను హిస్సోపుతో శుభ్రం చెయ్యి. నేను పవిత్రుణ్ణి అవుతాను. నన్ను కడుగు. నేను మంచు కంటే తెల్లగా ఉంటాను.

8 నువ్వు విరిచిన ఎముకలు హర్షించడానికై ఆనందమూ, సంతోషమూ నాకు వినిపించు.

9 నా పాపాలనుండి నీ ముఖం తిప్పుకో. నా దోషాలన్నిటినీ తుడిచి పెట్టు.

10 దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు.

11 నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయవద్దు. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయవద్దు.

12 నీ రక్షణలోని ఆనందాన్ని నాలో తిరిగి దయచెయ్యి. అంగీకరించే ఆత్మతో నన్ను బలపరచు.

13 అప్పుడు అతిక్రమాలు చేసేవాళ్ళకు నీ మార్గాలు బోధిస్తాను. అప్పుడు పాపులు నీ వైపు తిరుగుతారు.

14 నా రక్షణకు ఆధారమైన దేవా, రక్తాన్ని చిందించినందుకు నన్ను క్షమించు. నీ నీతిన్యాయాలను బట్టి నేను ఆనందంతో బిగ్గరగా గానం చేస్తాను.

15 ప్రభూ, నా పెదాలను తెరువు. నా నోరు నీకు స్తుతి పాడుతుంది.

16 నీకు బలుల్లో సంతోషం ఉండదు. ఒకవేళ నువ్వు బలినే కోరుకుంటే నేను అర్పిస్తాను. దహన బలుల్లో నీకు సంతోషం ఉండదు.

17 విరిగిన మనస్సే దేవునికి సమర్పించే నిజమైన బలి. దేవా, విరిగి పరితాపం చెందిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు.

18 నీ సంతోషాన్ని బట్టి సీయోనుకు మేలు చెయ్యి. యెరూషలేము గోడలను తిరిగి నిర్మించు.

19 అప్పుడు నీతిమయమైన బలులు నీకు సంతోషం కలిగిస్తాయి. దహనబలుల్లోనూ, సర్వాంగ బలుల్లోనూ నువ్వు సంతోషిస్తావు. అప్పుడు ప్రజలు నీ బలిపీఠంపై ఎద్దులను అర్పిస్తారు.