దావీదు వ్యభిచారం (continued)

క్రీ.పూ. 1035

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కీర్తనలు 103

దావీదు కీర్తన.

1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.

2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు.

3 ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు.

4 నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.

5 నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.

6 యెహోవా న్యాయమైన దాన్ని జరిగిస్తాడు. అణగారిన వారందరికీ న్యాయం చేస్తాడు.

7 ఆయన మోషేకు తన విధానాలూ ఇశ్రాయేలు వంశస్థులకు తన కార్యాలూ తెలియచేశాడు.

8 యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది.

9 ఆయన ఎప్పుడూ అదుపులో పెట్టేవాడు కాదు. ఆయన అస్తమానం కోపంగా ఉండడు.

10 మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు.

11 భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.

12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.

13 తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.

14 మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.

15 మనిషి రోజులు గడ్డి మొక్కలాంటివి. పొలంలో పూసే పువ్వులాగా అతడు పూస్తాడు.

16 దానిమీద గాలి వీస్తే అది ఇక ఉండదు.

17 యెహోవాను గౌరవించే వారి పట్ల ఆయన కృప తరతరాలకూ ఉంటుంది. ఆయన నీతి వారి వారసులకు కొనసాగుతుంది.

18 వాళ్ళు ఆయన నిబంధన పాటిస్తారు. ఆయన ఆదేశాలను మనసులో ఉంచుకుంటారు.

19 యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశాడు. ఆయన రాజ్యం అందరినీ పాలిస్తూ ఉంది.

20 యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి.

21 యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి.

22 యెహోవా చేసిన జీవులారా, ఆయనను స్తుతించండి. ఆయన రాజ్యంలోని ప్రతి ప్రదేశంలో ఉన్న మీరంతా ఆయనను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.

2 సమూయేలు 12:16–23

16 యెహోవా ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డను మొత్తి జబ్బు పడేలా చేశాడు. 17 దావీదు ఉపవాసం ఉండి లోపలికి వెళ్లి బిడ్డ కోసం దేవుణ్ణి బతిమిలాడుతూ రాత్రంతా నేల మీద పడి ఉన్నాడు. ఇంట్లో ప్రముఖులు అతణ్ణి నేలపై నుండి లేపడానికి ప్రయత్నించారు. కానీ దావీదు ఒప్పుకోలేదు, వారితో కలసి భోజనం చేయలేదు.

18 ఏడవ రోజు బిడ్డ చనిపోయాడు. దావీదు సేవకులు “బిడ్డ బతికి ఉన్నపుడు అతనితో ఏమి చెప్పినా అతడు మన మాట వినలేదు. 19 ఇప్పుడు బిడ్డ చనిపోయాడని చెబితే తనకు తాను ఏదైనా హాని చేసుకొంటాడేమో” అనుకున్నారు. వారు బిడ్డ చనిపోయాడన్న సంగతి అతనితో చెప్పడానికి భయపడ్డారు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుకోవడం గమనించి బిడ్డ చనిపోయాడని అర్థం చేసుకున్నాడు. “బిడ్డ చనిపోయాడా?” అని తన సేవకులను అడిగాడు. వారు “చనిపోయాడు” అని జవాబిచ్చాడు.

20 అప్పుడు దావీదు నేలపై నుండి లేచి స్నానంచేసి నూనె రాసుకుని వేరే బట్టలు ధరించాడు. యెహోవా మందిరంలో ప్రవేశించి దేవునికి మొక్కి, తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తీసుకురమ్మన్నాడు. వారు భోజనం తెచ్చి వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు.

21 అతని సేవకులు “బిడ్డ బతికి ఉన్నప్పుడు ఉపవాసంతో బిడ్డ కోసం ఏడుస్తూ ఉన్నావు, వాడు చనిపోయినప్పుడు లేచి భోజనం చేశావు. నువ్వు ఇలా చేయడంలో అర్థం ఏమిటి?” అని దావీదును అడిగారు. 22 అప్పుడు దావీదు “బిడ్డ బతికి ఉన్నప్పుడు దేవుడు నన్ను కరుణించి బిడ్డను బతికిస్తాడన్న ఆశతో నేను ఉపవాసముండి ఏడుస్తూ వేడుకొన్నాను. 23 ఇప్పుడు బిడ్డ చనిపోయాడు కనుక నేనెందుకు ఉపవాసముండాలి? బిడ్డను నేను తిరిగి రప్పించగలనా? నేనే వాడి దగ్గరకు వెళ్తాను గానీ వాడు నా దగ్గరికి మళ్ళీ రాడు కదా” అని వారితో చెప్పాడు.

2 సమూయేలు 12:26–31

26 యోవాబు అమ్మోనీయుల ముఖ్య పట్టణం రబ్బా మీద యుద్ధం చేసి ఆక్రమించుకున్నాడు. మిగతా నగరాలకు నీరు ఇక్కడినుండే సరఫరా అవుతుంది. 27 యోవాబు దావీదు దగ్గరికి మనుషులను పంపి “నేను రబ్బా మీద యుద్ధం చేసి నీరు సరఫరా చేసే పట్టణాన్ని అక్రమించుకొన్నాను. 28 నేను ఆక్రమించుకొన్న పట్టణానికి నా పేరు పెట్టుకోకుండేలా మిగిలిన సైన్యాన్ని సమకూర్చి పట్టణంపై దాడి చెయ్యి” అని కబురు చేశాడు.

29 కాబట్టి దావీదు సైన్యాన్ని సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధం చేసి దాన్ని పట్టుకుని, వారి రాజు కిరీటాన్ని అతని తలమీద నుండి తీసివేయించాడు. దాన్ని దావీదు తల మీద పెట్టారు. దాన్ని విలువైన రత్నాలతో చెక్కారు. దాని బరువు సుమారు నాలుగు కిలోలు. 30 ఇంకా అతడు ఆ పట్టణంలో నుండి ఎంతో విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని వెళ్ళాడు. 31 పట్టుకున్న వారిని బయటికి తీసుకువచ్చి రంపాలతో, పదునైన ఇనుప పనిముట్లతో, ఇనుప గొడ్డళ్ళతో పని చేసేవారిగా, ఇటుక బట్టీల్లో పనిచేసేవారిగా నియమించాడు. అమ్మోనీయుల పట్టణాలన్నిటిలో అతడు ఇలాగే చేశాడు. ఆ తరువాత దావీదు, అతని మనుషులూ తిరిగి యెరూషలేము చేరుకున్నారు.

1 దినవృత్తాంతాలు 20:2–3

2 దావీదు వచ్చి, వాళ్ళ రాజు తల మీద ఉన్న కిరీటం తీసుకున్నాడు. దాని బరువు 34 కిలోగ్రాములు. అందులో విలువైన రత్నాలు పొదిగి ఉన్నాయి. దాన్ని దావీదు ధరించాడు. ఇంకా అతడు ఎంతో విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణంలో నుంచి తీసుకుపోయాడు. 3 దాని ప్రజలను అతడు బయటకు తీసుకొచ్చి, వాళ్ళతో రంపాలతో, ఇనుప పనిముట్లతో, గొడ్డళ్లతో బలవంతంగా పని చేయించాడు. ఈ విధంగా అతడు అమ్మోనీయుల పట్టణాలన్నిటికీ చేశాడు. తరువాత దావీదూ, సైన్యమూ, యెరూషలేముకు తిరిగి వచ్చారు.