సౌలు ఆస్థానం నుండి పారిపోయే వరకు దావీదు (continued)
క్రీ.పూ. 1063
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 మీరు దావీదును చంపేయాలని సౌలు తన కొడుకు యోనాతానుతో, సేవకులందరితో చెప్పాడు. 2 అయితే, సౌలు కొడుకు యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి యోనాతాను, దావీదుతో ఇలా అన్నాడు “నా తండ్రి సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఉదయాన్నే జాగ్రత్తపడి రహస్య స్థలం లో దాక్కో. 3 నేను నా తండ్రి దగ్గర నిలబడి నిన్ను గూర్చిన సమాచారం ఏదైనా తెలిసినప్పుడు పొలంలోకి వచ్చి నీకు తెలియచేస్తాను” అన్నాడు.
ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన.
1 నేను యెహోవాలో ఆశ్రయం కోరాను. పక్షిలాగా కొండల్లోకి ఎగిరిపో, అని నువ్వు నా ప్రాణంతో ఎందుకు చెబుతావు?
2 ఎందుకంటే, చూడు! దుర్మార్గులు విల్లెక్కుపెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థహృదయుల మీద వెయ్యడానికి తమ బాణాలు వింటి నారికి తగిలించి సిద్ధంగా ఉన్నారు.
3 పునాదులు పాడైపోతే న్యాయవంతులు ఏం చెయ్యగలరు?
4 యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. ఆయన కళ్ళు గమనిస్తున్నాయి. ఆయన కళ్ళు మనుషులను పరిశీలన చేస్తున్నాయి.
5 యెహోవా న్యాయవంతులనూ, దుర్మార్గులనూ, ఇద్దరినీ పరిశీలన చేస్తున్నాడు. హింసించడం పనిగా పెట్టుకున్న వాళ్ళను ఆయన ద్వేషిస్తాడు.
6 దుర్మార్గుల మీద ఆయన రగులుతున్న నిప్పు కణికెలు, అగ్నిగంధకం కురిపిస్తాడు. ఆయన గిన్నెలోని వడగాలి వాళ్ళ పానీయభాగం అవుతుంది.
7 ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు. ఆయన నీతిన్యాయాలను ప్రేమిస్తాడు. నిజాయితీపరులు ఆయన ముఖం చూస్తారు.
4 యోనాతాను తన తండ్రి సౌలుతో దావీదును గూర్చి సానుభూతిగా మాట్లాడి “నీ సేవకుడైన దావీదు నీపట్ల ఎలాంటి తప్పూ చేయలేదు, పైగా ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నువ్వు అతనికి ఎలాంటి కీడూ తలపెట్టవద్దు. 5 అతడు తన ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప విజయం కలుగజేశాడు. అది నీకు కూడా సంతోషం కలిగించింది కదా, కారణం లేకుండా దావీదును చంపి నిరపరాధి ప్రాణం తీసిన పాపం నీకు ఎందుకు?” అని చెప్పినప్పుడు, 6 సౌలు యోనాతాను చెప్పింది విని “యెహోవా మీద ఒట్టు, అతనికి మరణ శిక్ష విధించను” అని ప్రమాణం చేశాడు.
7 అప్పుడు యోనాతాను దావీదును పిలిపించి ఆ విషయాలన్నీ అతనికి తెలియచేశాడు. దావీదును సౌలు దగ్గరికి తీసుకొచ్చినపుడు దావీదు ముందులాగే అతని ఆవరణంలో ఉన్నాడు. 8 తరువాత యుద్ధం జరినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి, చాలామందిని చంపేశాడు.
9 యెహోవా దగ్గర నుండి దురాత్మ వచ్చి సౌలును ఆవహించాడు. సౌలు ఈటె పట్టుకుని యింటి ఆవరణంలో కూర్చుని ఉన్నాడు. దావీదు తంతి వాద్యం వాయిస్తుంటే, 10 సౌలు ఒకే దెబ్బతో దావీదు గోడకు అతుక్కునేలా తన చేతిలోని ఈటె విసిరాడు. దావీదు పక్కకు తొలగడంతో అది అతని పక్కగా గోడకు గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రి తప్పించుకుని పారిపోయాడు.
11 ఉదయాన్నే అతణ్ణి చంపాలని కనిపెడుతూ దావీదును పట్టుకోడానికి సౌలు దావీదు ఇంటికి తన సైనికులను పంపాడు. దావీదు భార్య మీకాలు “ఈ రాత్రి నీ ప్రాణాన్ని నీవు దక్కించుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు” అని చెప్పి 12 కిటికీగుండా దావీదును కిందికి దింపితే అతడు తప్పించుకుని పారిపోయాడు.
13 తరువాత మీకాలు ఒక విగ్రహం తీసుకు మంచంమీద ఉంచి తలవైపు మేక చర్మం ఉంచి దుప్పటితో కప్పివేసింది. 14 సౌలు దావీదును పట్టుకోవడానికి సైనికులను పంపినపుడు “అతడు అనారోగ్యంతో మంచాన ఉన్నాడు” అని చెప్పింది.
15 దావీదును చూసేందుకు సౌలు సైనికులను పంపి “అతణ్ణి మంచంతోసహా తీసుకురండి. నేను అతణ్ణి చంపుతాను” అన్నాడు.
16 ఆ సైనికులు లోపల జొరబడి చూసినప్పుడు తల వైపున మేక చర్మం ఒక మంచంపై ఉన్న విగ్రహం కనబడింది. 17 అప్పుడు సౌలు “నా శత్రువు తప్పించుకుపోయేలా చేసి నన్ను ఎందుకు మోసం చేసావు” అని మీకాలును అడిగితే, మీకాలు “నా చేతిలో నీ ప్రాణం ఎందుకు పోగొట్టుకుంటావ్, ‘నన్ను వెళ్లనివ్వు’ అని దావీదు తనతో చెప్పాడు” అని సౌలుతో చెప్పింది.
ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు పంపిన మనుషులు ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం).
1 నా దేవా, నా శత్రువుల బారినుంచి నన్ను తప్పించు. నా మీద దండెత్తే వారికి చిక్కకుండా నన్ను కాపాడు.
2 పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు. రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు.
3 నా ప్రాణం తీయడానికి వారు కాపుకాశారు. యెహోవా, నేను దోషం చేసినందుకో, పాపం చేసినందుకో కాదు.
4 నాలో ఏ అక్రమం లేకపోయినా వారు నా మీదికి పరిగెత్తి రావడానికి సిద్ధపడ్డారు. లేచి నాకు సహాయం చెయ్యి.
5 సేనల ప్రభువైన యెహోవా, ఇశ్రాయేలు దేవా, అన్యజాతులను శిక్షించడానికి మేలుకో. ఆ దుర్మార్గుల్లో ఎవరినీ కనికరించవద్దు.
6 సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.
7 మన మాటలు ఎవరు వింటారులే అనుకుని వారు తమ నోటితో మాటలు వెళ్లగక్కుతారు. వారి పెదాల్లో కత్తులున్నాయి.
8 అయితే యెహోవా, నువ్వు వాళ్ళను చూసి నవ్వుతావు. అన్యజాతులను నువ్వు ఎగతాళి చేస్తావు.
9 దేవా, నా బలమా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నా ఎత్తయిన బురుజు నువ్వే.
10 నా దేవుడు తన నిబంధన నమ్మకత్వంలో నన్ను కలుసుకుంటాడు. నా శత్రువులకు జరిగిన దాన్ని దేవుడు నాకు చూపిస్తాడు.
11 వారిని చంపొద్దు. ఎందుకంటే నా ప్రజలు దాన్ని మరచిపోతారేమో. మా ధ్వజం లాంటి నువ్వు నీ బలంతో వారిని చెల్లాచెదరు చేసి అణగ గొట్టు.
12 వారి పెదాల మాటలను బట్టి, వారి నోటి పాపాన్ని బట్టి, వారు పలికిన శాపాలను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వంలో చిక్కుకునేలా చెయ్యి.
13 వారు ఇకపై కనబడకుండా పోయేలా కోపంతో వారిని నిర్మూలించు. దేవుడు యాకోబు సంతానాన్ని ఏలుతున్నాడని భూదిగంతాల వరకూ మనుషులు తెలుసుకునేలా చెయ్యి.
14 సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.
15 తిండికోసం అటూ ఇటూ తిరుగుతారు. ఇంకా తృప్తి కలగకపోతే రాత్రి అంతా కనిపెడతారు.
16 నీవు నాకు ఎత్తయిన బురుజుగా ఉన్నావు. ఆపద రోజున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలాన్ని గూర్చి నేను కీర్తిస్తాను. ఉదయాన నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను.
17 దేవుడు నాకు ఎత్తయిన కోటగా, నిబంధనా దేవుడుగా ఉన్నాడు. నా బలమా, నేను నిన్ను కీర్తిస్తాను.