నోబులోని అహీమెలెకు దగ్గరికి పారిపోయిన దావీదు

క్రీ.పూ. 1060

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 సమూయేలు 21:1–9

1 దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. అహీమెలెకు దావీదు రావడం చూసి భయపడి “నువ్వు ఒంటరిగా వచ్చావెందుకు?” అని అడిగాడు, 2 దావీదు “రాజు నాకు ఒక పని అప్పగించి, ‘నేను నీకు ఆజ్ఞాపించి పంపిస్తున్న పని ఎలాటిదో అది ఎవ్వరితో చెప్పవద్దు’ అన్నాడు. ఒక చోటికి వెళ్ళమని యువకులకు నేను చెప్పాను. 3 తినడానికి నీ దగ్గర ఏం ఉన్నాయి? ఐదు రొట్టెలు గానీ ఇంకా ఏమైనా ఉంటే అవి నాకు ఇవ్వు” అని యాజకుడైన అహీమెలెకును అడిగాడు. 4 యాజకుడు “మామూలు రొట్టెలు నా దగ్గర లేవు. పవిత్రమైన రొట్టెలు మాత్రమే ఉన్నాయి. పనివాళ్ళు స్త్రీలకు దూరంగా ఉన్నట్టైతే వారు ప్రతిష్ఠితమైన రొట్టెలు తినవచ్చు” అని దావీదుతో అన్నాడు.

5 అప్పుడు దావీదు “మేము బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు రోజులు నిజంగా స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పనివాళ్ళ బట్టలు పవిత్రంగానే ఉన్నాయి. ఒకవేళ మేము చేయబోయే పని అపవిత్రమైనదైతే ఏంటి? రాజాజ్ఞ బట్టి అది పవిత్రంగా ఎంచబడుతుంది” అని యాజకునితో అన్నాడు. 6 అప్పుడు యెహోవా సన్నిధానం నుండి తీసిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేనందువల్ల, వేడిగా రొట్టెలు చేసే రోజున తీసిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చాడు.

7 ఆ రోజున సౌలు సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధానంలో ఉన్నాడు. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకు నాయకుడు.

8 “రాజు పని త్వరగా జరగాలన్న తొందరలో నా కత్తిని, ఆయుధాలను నేను తీసుకు రాలేదు. ఇక్కడ నీ దగ్గర కత్తి గానీ ఈటె గానీ ఉందా?” అని దావీదు అహీమెలెకును అడిగితే, 9 యాజకుడు “ఏలా లోయలో నువ్వు చంపిన గొల్యాతు అనే ఫిలిష్తీయుడి కత్తి ఉంది. అదిగో బట్టతో చుట్టి ఏఫోదు వెనక ఉంది. అది తప్ప ఇక్కడ మరి ఏ కత్తీ లేదు. దాన్ని తీసుకోవడం నీకు ఇష్టమైతే తీసికో” అన్నాడు. దావీదు “దానికి మించింది వేరొకటి లేదు. అది నాకివ్వు” అన్నాడు.

గాతు రాజైన ఆకీషు దగ్గరికి పారిపోయిన దావీదు

1 సమూయేలు 21:10–15

10 దావీదు సౌలుకు భయపడినందువల్ల ఆ రోజునే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరికి వచ్చాడు. 11 ఆకీషు సేవకులు “ఈ దావీదు ఆ దేశపు రాజు కదా? ఆ దేశపు ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేల మందిని హతం చేసారని పాడిన పాటలు ఇతని గురించినవే గదా” అని అతని గురించి రాజుతో చెబుతుంటే, 12 దావీదు ఈ మాటలను తన మనస్సులో పెట్టుకుని గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు.

13 అందుకని దావీదు వారి ముందు తన ప్రవర్తన మార్చుకుని పిచ్చివాడిలా నటిస్తూ, గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మిని తన గడ్డంపైకి కారనిస్తూ ఉన్నాడు. వారు దావీదును పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి పనులు చేస్తూ వచ్చాడు.

14 అది చూసి ఆకీషు రాజు “మీరు చూశారుగా, అతనికి పిచ్చి పట్టింది, ఇతడిని నా దగ్గరికి ఎందుకు తీసుకువచ్చారు? 15 పిచ్చి పనులు చేసేవాడితో నాకేం పని? నా సముఖంలో పిచ్చి పనులు చేయడానికి ఇతడిని తీసుకువచ్చారేంటి? వీడు నా ఇంట్లోకి రావచ్చా?” అని తన సేవకులతో అన్నాడు.

కీర్తనలు 56

ప్రధాన సంగీతకారుని కోసం. యోనతేలెం రెహూకిం అనే రాగంతో పాడేది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నపుడు అతడు రాసిన కీర్తన.

1 దేవా, నన్ను కరుణించు. మనుషులు నన్ను మింగివేయాలని చూస్తున్నారు. వారు రోజంతా నా మీద పోరాడుతూ నన్ను అణచివేస్తున్నారు.

2 గర్వంగా నాతో పోరాడేవారు అనేకులున్నారు. రోజంతా నా కోసం కాపు కాసి నన్ను మింగాలని చూస్తున్నారు.

3 నాకు భయం కలిగిన రోజున నిన్ను ఆశ్రయిస్తాను.

4 నేను ఆయన మాటలను కీర్తిస్తాను. నేను భయపడను. ఎందుకంటే దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను. మనుషులు నన్నేమి చేయగలరు?

5 రోజంతా వాళ్ళు నా మాటల్లో తప్పులు వెతుకుతారు. నాకు ఎప్పుడు హాని చేయాలా అని చూస్తుంటారు.

6 వాళ్ళు గుంపులు గుంపులుగా కాపు కాస్తారు. నన్ను చంపాలని నన్ను వెంబడిస్తూ ఉంటారు.

7 దేవా, నీ కోపంతో ప్రజలను అణగదొక్కు. వాళ్ళు చేస్తున్న దుష్ట క్రియల ఫలితాలు అనుభవించేలా చెయ్యి.

8 నా పలాయనాలను నువ్వు లెక్కించావు. నా అశ్రువులు నీ ఎదుట ఉన్న సీసాలో నింపావు. అవన్నీ నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా.

9 నేను నీకు మొరపెట్టిన రోజున నా శత్రువులు వెనక్కి మళ్లుతారు. దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు.

10 నా దేవుణ్ణి బట్టి ఆయన నామాన్ని కీర్తిస్తాను. యెహోవాను బట్టి ఆయన వాక్కును ఘనపరుస్తాను.

11 నేను దేవునిపై నమ్మకం పెట్టుకున్నాను. నేను భయపడను, మనుషులు నన్నేమి చేయగలరు?

12 దేవా, నువ్వు చావునుండి నా ప్రాణాన్ని తప్పించావు. నేను జీవపు వెలుగులో దేవుని ఎదుట సంచరించాలని నా అడుగులు జారకుండా తప్పించావు.

13 అందుకే నేను నీకు మొక్కుకున్నాను. నీకు స్తుతియాగాలు అర్పిస్తాను.

కీర్తనలు 34

అబీమెలెకు సమక్షంలో పిచ్చివాడిలాగా నటించినప్పుడు అతడు దావీదును వెళ్ళగొట్టగా దావీదు రాసిన కీర్తన.

1 అన్ని సమయాల్లో నేను యెహోవాను స్తుతిస్తాను. నా నోట్లో నిత్యమూ ఆయన స్తుతి ఉంటుంది.

2 నేను యెహోవాను స్తుతిస్తాను. అణచివేతకు గురైన వాళ్ళు అది విని సంతోషిస్తారు గాక!

3 నాతో కలసి యెహోవాను ప్రశంసించండి. మనం అందరం కలసి ఆయన నామాన్ని పైకెత్తుదాం.

4 నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీదా నాకు విజయమిచ్చాడు.

5 ఆయన వైపు చూసే వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు.

6 అణచివేతకు గురైన ఈ వ్యక్తి విలపించాడు. దాన్ని యెహోవా విన్నాడు. సమస్యలన్నిటి నుండి అతణ్ణి రక్షించాడు.

7 యెహోవా అంటే భయమూ భక్తీ ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు.

8 యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి.

9 యెహోవా ఎన్నుకున్న ప్రజలారా! ఆయన అంటే భయమూ, భక్తీ కలిగి ఉండండి. ఆయనంటే భయభక్తులు ఉన్నవాడికి ఎలాంటి కొరతా ఉండదు.

10 సింహం పిల్లలు ఆహారం లేక ఆకలితో ఉంటాయి. కాని యెహోవాను సమీపించి ప్రార్ధించే వారికి అన్ని మేళ్లూ కలుగుతాయి.

11 పిల్లలూ, రండి, నా మాటలు వినండి. యెహోవా అంటే భయభక్తులు నేను మీకు బోధిస్తాను.

12 జీవితాన్ని కాంక్షించేవాడు, ఎక్కువ కాలం జీవించాలని ఆశించే వాడు, చక్కని జీవితం కావాలి అనుకునేవాడు ఏం చేయాలి?

13 దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో.

14 చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు.

15 యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి.

16 చెడు కార్యాలు చేసే వాళ్ళ జ్ఞాపకం భూమిపై ఉండకుండా చేయడానికి యెహోవా వాళ్లకు విరోధంగా ఉన్నాడు.

17 ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.

18 విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.

19 ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు.

20 ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతాడు. వాటిలో ఒక్కటి కూడా విరిగి పోదు.

21 చెడుతనం దుర్మార్గులను హతం చేస్తుంది. ధర్మాత్ముణ్ణి అసహ్యించుకునే వాడు శిక్ష పొందుతాడు.

22 యెహోవా తన సేవకుల ప్రాణాలను విడుదల చేస్తాడు. ఆయన శరణు వేడిన వాడికి శిక్ష ఉండదు.