మిస్పాలో దావీదు
క్రీ.పూ. 1060
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
3 తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పాకు వచ్చి “దేవుడు నాకు ఏమి చేస్తాడో నేను తెలుసుకొనేంత వరకూ నా తలిదండ్రులను నీ దగ్గర ఉండనివ్వు” అని మోయాబు రాజును అడిగి, 4 వారిని అతనికి అప్పగించాడు. దావీదు దాక్కుని ఉన్న రోజుల్లో వారు మోయాబు రాజు దగ్గర ఉండిపోయారు. 5 ఆ తరువాత గాదు ప్రవక్త వచ్చి “కొండల్లో ఉండకుండాా యూదా దేశానికి పారిపో” అని దావీదుతో చెప్పడంవల్ల దావీదు వెళ్ళి హారెతు అడవిలో దాక్కున్నాడు.
6 దావీదు, అతని అనుచరులు ఫలానా చోట ఉన్నారని సౌలుకు తెలిసింది. అప్పుడు సౌలు గిబియా దగ్గర రమాలో ఒక కర్పూర వృక్షం కింద చేతిలో ఈటె పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని సేవకులు అతని చుట్టూ నిలబడి ఉన్నారు.
7 సౌలు తన చుట్టూ నిలబడి ఉన్న సేవకులతో ఇలా అన్నాడు “బెన్యామీనీయులారా, వినండి. యెష్షయి కొడుకు మీకు పొలాలు, ద్రాక్షతోటలు ఇస్తాడా? మిమ్మల్ని వందమంది, వెయ్యిమంది సైనికులపై అధిపతులుగా చేస్తాడా? 8 మీరెందుకు నా మీద కుట్ర పన్నుతున్నారు? నా కొడుకు యెష్షయి కొడుకుతో ఒప్పందం చేసుకున్నాడని మీలో ఎవరూ నాతో చెప్పలేదే. ఈ రోజు జరుగుతున్నట్టు నా కోసం కాపు కాసేలా నా కొడుకు నా సేవకుడు, దావీదును రెచ్చగొట్టినా, నా విషయంలో మీలో ఎవరికీ విచారం లేదు” అన్నాడు.
9 అప్పుడు ఎదోమీయుడు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలబడి “యెష్షయి కొడుకు పారిపోయి నోబులో ఉంటున్న అహీటూబు కొడుకు అహీమెలెకు దగ్గరికి వచ్చినప్పుడు నేను చూశాను. 10 అహీమెలెకు అతని తరపున యెహోవా దగ్గర విచారణ చేసి, ఆహారం, ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గం అతనికి ఇచ్చాడు” అని చెప్పాడు. 11 రాజు, యాజకుడూ అహీటూబు కొడుకు అయిన అహీమెలెకును, నోబులో ఉన్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరినీ పిలిపించాడు. వారు రాజు దగ్గరికి వచ్చినప్పుడు, 12 సౌలు “అహీటూబు కొడుకా, విను” అన్నప్పుడు, అతడు “నా యజమానీ, చెప్పండి” అన్నాడు.
13 సౌలు “నువ్వు, యెష్షయి కొడుకు నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారేంటి? నీవు అతనికి భోజనం, కత్తి ఇచ్చి అతనికి సహాయ పడమని దేవుని దగ్గర విన్నపం చేసావు. నేడు జరుగుతూ ఉన్నట్టు అతడు నానుండి దాక్కుని, రేపు నాపై తిరగబడతాడు గదా?” అన్నాడు. 14 అహీమెలెకు “రాజా, నీకు దావీదు కంటే నమ్మకమైనవాడు నీ సేవకులందరిలో ఎవరు ఉన్నారు? పైగా అతడు నీ అల్లుడు. రాజు సైన్యపు బాధ్యతలు నేరవేరుస్తూ నీ నగరంలో పేరుగాంచిన దావీదు వంటి గౌరవనీయుడు ఎవరున్నారు? 15 ఈ సంగతి గూర్చి కొంచెం కూడా నాకు తెలియదు. అతని తరపున నేను దేవుని దగ్గర విచారణ చేయడం ఇప్పుడే మొదలుపెట్టానా? రాజు అలా భావించకూడదు. రాజు తమ దాసుడనైన నా మీదా నా తండ్రి ఇంటి వారందరిమీదా ఈ నేరం మోపకూడదు” అని రాజుకు జవాబిచ్చాడు. 16 రాజు “అహీమెలెకూ, నీకూ, నీ తండ్రి ఇంటివారికందరికీ చావు తప్పదు” అన్నాడు. 17 “వీరు దావీదుతో చేతులు కలిపారు. అతడు పారిపోయిన సంగతి తెలిసినప్పటికీ నాకు చెప్ప లేదు. కాబట్టి యెహోవా యాజకులైన వీరిని వధించండి” అని తన చుట్టూ నిలబడి ఉన్న సైనికులను ఆజ్ఞాపించాడు. సైనికులు యెహోవా యాజకులను చంపడానికి వెనకడుగు వేశారు.
18 రాజు దోయేగును చూసి “నువ్వు ఈ యాజకుల మీద పడి చంపు” అని చెప్పాడు. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు, యాజకుల పై దాడిచేసి ఏఫోదు ధరించుకుని ఉన్న 85 మందిని చంపాడు. 19 ఇంకా యాజకుల పట్టణమైన నోబులొ కాపురం ఉంటున్నవారిని కత్తితో చంపేశాడు. మగవాళ్ళను, ఆడవాళ్ళను, చిన్నపిల్లలను, పసిపిల్లలను, ఎద్దులను, గాడిదలను, అన్నిటినీ కత్తితో చంపేశాడు.
ప్రధాన సంగీతకారుడి కోసం. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంట్లో ఉన్నాడు, అని చెప్పినప్పుడు దావీదు రాసిన దైవధ్యానం.
1 బలశాలీ, సమస్యను సృష్టించి ఎందుకు గర్విస్తున్నావు? దేవుని నిబంధన కృప నిత్యమూ ఉంటుంది.
2 నీ నాలుక నాశనాన్ని ఆలోచిస్తుంది. అది పదునైన కత్తిలా వంచన చేస్తూ ఉంది.
3 నువ్వు మంచి కంటే దుర్మార్గాన్ని ఎక్కువ ప్రేమిస్తావు. న్యాయం మాట్లాడటం కంటే అబద్దం మాట్లాడటం నీకిష్టం.
4 కపటమైన నాలుకా! ఇతరులను మింగేసే మాటలను నువ్వు ప్రేమిస్తావు.
5 కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను నీ గుడారంలో నుండి పెరికి వేస్తాడు. సజీవులుండే ప్రాంతం నుండి నిన్ను పెల్లగిస్తాడు.
6 న్యాయవంతులు అది చూసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. వారు నవ్వుతూ ఇలా అంటారు.
7 చూడండి, ఇతడు దేవుణ్ణి తన బలంగా చేసుకోకుండా తనకున్న అధిక ఐశ్వర్యంపై నమ్మకముంచాడు. నాశనకరమైన తన మార్గంలోనే స్థిరంగా నిలిచాడు.
8 కానీ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. దేవుని నిబంధన కృపలో నేను ఎన్నటికీ నమ్మకముంచుతాను.
9 దేవా, నువ్వు చేసిన వాటిని బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నీ భక్తుల సమక్షంలో నీ నామాన్ని బట్టి ఆశతో ఎదురుచూస్తాను.