యూదుల పునరుద్ధరణకు కోరెషు ఆజ్ఞ
క్రీ.పూ. 536
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 యెహోవా తాను యిర్మీయా ద్వారా పలికిన మాటలు నెరవేర్చడానికి పర్షియా రాజు కోరెషు పాలన మొదటి సంవత్సరంలో రాజు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా రాతపూర్వకంగా చాటింపు వేయించి ఇలా ప్రకటించాడు. 2 “పర్షియా రాజు కోరెషు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశంలో ఉండే దేవుడైన యెహోవా లోకంలో ఉన్న ప్రజలందరినీ నాకు లోబరిచాడు. ఆయన యూదా దేశంలో ఉన్న యెరూషలేములో తనకు మందిరం కట్టించాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. 3 మీలో ఆయన ప్రజలందరికీ దేవుడు తోడుగా ఉంటాడు గాక. వారు యూదా దేశంలోని యెరూషలేముకు బయలుదేరి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టాలి. 4 యెరూషలేములో వివిధ ప్రాంతాల్లో మిగిలి ఉన్న ప్రజలు దేవుని మందిరం కట్టించడానికి ఇష్టపూర్తిగా తమ దగ్గరున్న వెండి బంగారాలను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయం చేయాలి.”
యాత్రల కీర్తన
1 సీయోను నగరవాసులను యెహోవా చెరలో నుండి తిరిగి రప్పించినప్పుడు మనం కల కంటున్నవాళ్ళ వలే ఉన్నాం.
2 మన నోరు నవ్వుతో నిండిపోయింది. మన నాలుక ఆనంద గీతాలు ఆలపిస్తుంది. అప్పుడు యెహోవా వీళ్ళ కోసం గొప్పకార్యాలు జరిగించాడు, అని అన్యజనులు చెప్పుకున్నారు.
3 మనకి ఎంత ఆనందం! ఎందుకంటే యెహోవా మన కోసం ఘన కార్యాలు చేశాడు.
4 దక్షిణ ప్రాంతపు సెలయేరులవలే యెహోవా, మా అదృష్టాన్ని తిరిగి చిగురింపజెయ్యి.
5 కన్నీళ్లు కారుస్తూ విత్తనాలు చల్లేవాళ్ళు కేరింతలతో పంట కోస్తారు.
6 విత్తనాలు చేతబట్టుకుని ఏడుస్తూ చల్లేవాడు సంబరంగా పనలు మోసుకుంటూ తిరిగి వస్తాడు.
ప్రధాన సంగీతకారుని కోసం. కోరహు వారసుల కీర్తన.
1 యెహోవా, నువ్వు నీ దేశాన్ని దయ చూశావు, యాకోబు వంశస్తుల క్షేమాన్ని తిరిగి ఇచ్చావు.
2 నీ ప్రజల పాపాలు క్షమించావు, వారి పాపాలన్నీ కప్పివేశావు. సెలా.
3 నీ ఉగ్రతనంతా మానుకున్నావు, నీ తీవ్ర కోపాన్ని చల్లార్చుకున్నావు.
4 మా రక్షణకర్తవైన దేవా, మమ్మల్ని ఉద్ధరించు. మా మీద నీ కోపం చాలించు.
5 మా మీద కలకాలం కోపంగా ఉంటావా? తరతరాలుగా నీ కోపం సాగిస్తావా?
6 నీ ప్రజలు నీ వలన సంతోషించేలా నువ్వు మళ్ళీ మమ్మల్ని బ్రతికించవా?
7 యెహోవా, నీ కృప మాకు చూపించు, నీ రక్షణ మాకు అనుగ్రహించు.
8 యెహోవా దేవుడు తెలియచేసే మాట నేను వింటాను, ఆయన తన ప్రజలతో తన నమ్మకమైన అనుచరులతో శాంతితో మసలుతాడు. అయితే వాళ్ళు మళ్ళీ మూర్ఖులు కాకూడదు.
9 ఆయన పట్ల భయభక్తులున్న వారికి ఆయన రక్షణ అతి సమీపంగా ఉంది. అప్పుడు మన దేశంలో మహిమ నిలిచి ఉంటుంది.
10 నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం కలుసుకున్నాయి, నీతిన్యాయాలు, శాంతిసమాధానాలు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి.
11 భూమిలోనుంచి విశ్వాస్యత మొలుస్తుంది. ఆకాశం నుంచి విజయం తొంగిచూస్తుంది.
12 యెహోవా తన మంచి దీవెనలనిస్తాడు. మన భూమి దాని పంటనిస్తుంది.
13 నీతి ఆయనకు ముందుగా నడుస్తుంది. ఆయన అడుగుజాడలకు దారి ఏర్పరస్తుంది.
22 పారసీకదేశపు రాజు కోరెషు పాలన మొదటి సంవత్సరం యిర్మీయా ద్వారా పలికిన తన మాట నెరవేర్చడానికి యెహోవా పారసీకదేశపు రాజు కోరెషు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా చాటించి రాత పూర్వకంగా ఇలా ప్రకటన చేయించాడు. 23 “పారసీకదేశపు రాజు కోరెషు ఆజ్ఞాపించేది ఏంటంటే పరలోకంలో ఉన్న దేవుడైన యెహోవా అన్ని రాజ్యాలనూ నా వశం చేశాడు. యూదాలో ఉన్న యెరూషలేములో తనకు మందిరాన్ని కట్టించమని నాకు ఆజ్ఞాపించాడు. ఆయన ప్రజలైన మీరెవరైనా యెరూషలేము వెళ్ళవచ్చు. మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక.”