యూదయ విగ్రహారాధన కారణంగా రానున్న విపత్తుల ప్రవచనం
యూదయ విగ్రహారాధన, వేషధారణల కారణంగా దాని మీదికి రానున్న విపత్తుల గురించిన ఒక ప్రవచనం.
క్రీ.పూ. 710
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
9 మైదానాల్లోని జంతువులన్నీ! అడవిలోని క్రూర జంతువులన్నీ! రండి! తినండి!
10 వారి కాపలాదారులంతా గుడ్డివాళ్ళు. వాళ్ళంతా తెలివితక్కువ వాళ్ళు. వాళ్ళంతా మొరగలేని మూగకుక్కలు.
పడుకుని కలలు కంటారు. నిద్ర అంటే వారికి చాలా ఇష్టం.
11 వారు తిండి కోసం అత్యాశపడే కుక్కలు. ఎంత తిన్నా వాటికి తృప్తి లేదు. వాళ్ళు తెలివిలేని కాపరులు.
వాళ్ళంతా తమకిష్టమైన దారిలో వెళతారు. ప్రతివాడూ సొంతలాభం కోసం వెతుకుతాడు.
12 వాళ్ళిలా అంటారు “రండి. ద్రాక్షమద్యం, మత్తిచ్చే పానీయాలు తాగుదాం.
రేపు ఇవాళ లాగా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది.”
57:1 నీతిమంతులు చనిపోతున్నారు గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు.
నిబంధన ప్రజలు చనిపోతున్నారు గానీ ఎవరికీ అర్థం కావడం లేదు.
కీడు చూడకుండా నీతిమంతులను తీసివేయడం జరుగుతూ ఉంది.
2 అతడు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాడు.
యథార్ధంగా ప్రవర్తించేవారు తమ పడకల మీద విశ్రాంతి తీసుకుంటారు.
3 మంత్రకత్తె కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరిక్కడికి రండి!
4 మీరెవర్ని ఎగతాళి చేస్తున్నారు?
ఎవర్ని చూసి నోరు తెరచి నాలుక చాస్తున్నారు?
మీరు తిరుగుబాటు చేసేవారూ మోసగాళ్ళూ కారా?
5 సింధూర వృక్షాల కింద, పచ్చని ప్రతి చెట్టు కింద, కామంతో రగిలిపోయే మీరు,
లోయల్లో రాతిసందుల కింద, మీరు మీ పిల్లలను చంపుతున్నారు.
6 లోయలోని రాళ్ళే మీ భాగం. అవే మీ వంతు.
వాటికే పానార్పణ పోస్తున్నారు. వాటికే నైవేద్యం అర్పిస్తున్నారు. వీటిలో నేను ఆనందించాలా?
7 ఉన్నత పర్వతం మీద నీ పరుపు వేసుకున్నావు.
బలులు అర్పించడానికి నువ్వు అక్కడికే ఎక్కి పోయావు.
8 తలుపు వెనుక ద్వారబంధాల వెనుక నీ గుర్తులు ఉంచావు.
నన్ను వదిలిపెట్టి బట్టలు ఊడదీసి మంచమెక్కావు. నీ పరుపు వెడల్పు చేసుకున్నావు.
నువ్వు వాళ్ళతో నిబంధన చేసుకున్నావు. వాళ్ళ మంచాలంటే నీకిష్టం. నువ్వు వాళ్ళ మానం చూశావు.
9 నువ్వు నూనె తీసుకుని రాజు దగ్గరికి వెళ్లావు. ఎన్నో పరిమళ ద్రవ్యాలను తీసుకెళ్ళావు.
నీ రాయబారులను దూరప్రాంతాలకు పంపుతావు. పాతాళానికి దిగిపోయావు.
10 నీ దూర ప్రయాణాలతో నువ్వు అలసిపోయావు. అయితే “అది వ్యర్ధం” అని ఎన్నడూ అనలేదు.
నువ్వు నీ చేతుల్లో బలం తెచ్చుకున్నావు. కాబట్టి నువ్వు నీరసించిపోలేదు.
11 ఎవరికి జడిసి, భయపడి అంత మోసం చేశావు?
నా గురించి ఆలోచించలేదు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు.
చాలా కాలం నేను మౌనంగా లేను గదా! అయితే నువ్వు నన్నంతగా పట్టించుకోలేదు.
12 నీ నీతి ఎలాంటిదో నేనే వెల్లడిచేస్తాను.
వాటివలన నీకేమీ ప్రయోజనం ఉండదు.
13 నువ్వు కేకలు పెట్టేటప్పుడు నీ విగ్రహాల గుంపు నిన్ను తప్పించాలి!
వాటన్నిటినీ గాలి ఎగరగొట్టేస్తుంది. ఊపిరితో అవన్నీ కొట్టుకుపోతాయి.
అయితే నన్ను నమ్ముకునేవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.
14 ఆయన ఇలా అంటాడు. “కట్టండి, కట్టండి! దారి సిద్ధం చేయండి!
నా ప్రజల దారిలో అడ్డంగా ఉన్న వాటిని తీసేయండి.”
15 ఎందుకంటే, మహా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయినవాడు ఇలా చెబుతున్నాడు. “నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ ఉన్నాను. అయినా, వినయంగల వారితో నలిగిన వారితో కూడా ఉంటాను. వినయం గలవారి ప్రాణాన్ని సేదదీర్చడానికీ నలిగినవారి ప్రాణాన్ని తెప్పరిల్లజేయడానికీ నేనున్నాను.
16 నేను ఎల్లప్పుడూ నిందించను. ఎప్పుడూ కోపంగా ఉండను. అలా ఉంటే మనిషి ఆత్మ నీరసించి పోతుంది. నేను సృష్టించిన మనుషులు నీరసించి పోతారు.
17 అక్రమంగా సంపాదించిన అతని పాపాన్ని బట్టి నేను కోపపడి అతన్ని శిక్షించాను.
నా ముఖాన్ని కోపంతో చాటు చేశాను. అయితే అతడు తనకిష్టమైన దారిలోకి తిరిగి వెళ్ళిపోయాడు.
18 నేనతని ప్రవర్తన చూశాను కానీ అతన్ని బాగుచేస్తాను.
అతనికి దారి చూపుతాను. అతన్నీ అతని కోసం దుఃఖించే వారినీ ఓదారుస్తాను.
19 వారికి కృతజ్ఞతాపూర్వకమైన పెదాలు ఇస్తాను. దూరంగా ఉన్నవారికీ దగ్గరగా ఉన్నవారికీ శాంతి సమాధానాలుంటాయి” అని యెహోవా చెబుతున్నాడు. “నేనే వారిని బాగుచేస్తాను”
20 అయితే దుర్మార్గులు అటూ ఇటూ కొట్టుకునే సముద్రం లాంటి వారు.
దాని నీళ్ళు, బురద పైకి తెస్తూ ఉంటుంది.
21 “దుర్మార్గులకు ప్రశాంతత ఉండదు” అని దేవుడు చెబుతున్నాడు.
58:1 పెద్దగా కేకలు వెయ్యి. ఆపవద్దు. బూరలాగా నీ గొంతెత్తు.
వారు చేసిన తిరుగుబాటు నా ప్రజలకు తెలియజెయ్యి. యాకోబు ఇంటివారికి వారి పాపాలను తెలియజెయ్యి.
2 అయినా వాళ్ళు తమ దేవుని ఆజ్ఞలను వదలని ప్రజలుగా నీతిని అనుసరించే దేశంగా ప్రతిరోజూ నన్ను వెతుకుతూ ఉంటారు.
నా విధానాలను తెలుసుకోవడంలో ఆనందిస్తారు.
తమకు న్యాయమైన తీర్పులు తీర్చాలని నన్ను అడుగుతారు. దేవుడు తమకు దగ్గరవ్వాలని ఆశిస్తారు.
3 “మేమెందుకు ఉపవాసమున్నాం? నువ్వెందుకు చూడవు? మమ్మల్ని మేము ఎందుకు తగ్గించుకున్నాం? నువ్వు గమనించలేదు” అని వాళ్ళు అంటారు.
మీ ఉపవాస దినాన మీరు మీకిష్టం వచ్చినట్టు చేస్తూ మీ పనివాళ్ళను కఠినంగా చూస్తారు.
4 మీరు ఉపవాసమున్నప్పుడు పోట్లాడుకుంటారు. మీ పిడికిళ్ళతో కొట్టుకుంటారు.
మీరు ఈ రోజుల్లో ఉపవాసముండేది మీ స్వరం పైన వినబడాలని కాదు.
5 నేను కోరేది అలాంటి ఉపవాసమా? ప్రతివాడు తనను తాను అణుచుకుంటే సరిపోతుందా?
ఒకడు రెల్లులాగా తలవంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరచుకుని కూర్చోవడం ఉపవాసమా? అలాంటి ఉపవాసం యెహోవాకు ఇష్టమని మీరనుకుంటారా?
6 నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే,
దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం,
అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం.
7 ఆకలితో అలమటించే వాళ్లతో నీ ఆహారం పంచుకోవడం, ఇల్లు లేకుండా తిరిగే పేదవారిని నీ ఇంట్లోకి చేర్చుకోవడం.
దిగంబరిగా నీకెవరైనా కనిపిస్తే, వాడికి బట్టలు ఇవ్వు. నీ సొంత బంధువులకు నీ ముఖం చాటేయవద్దు.
8 అప్పుడు నీ వెలుగు, ఉదయకాంతిలాగా ఉదయిస్తుంది. నీ ఆరోగ్యం నీకు త్వరగా లభిస్తుంది.
నీ నీతి, నీకు ముందుగా వెళ్తుంది. యెహోవా మహిమ నీ వెనుక కావలి కాస్తుంది.
9 అప్పుడు నువ్వు పిలిస్తే యెహోవా జవాబిస్తాడు. సహాయం కోసం నువ్వు మొర్ర పెడితే “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అంటాడు.
ఇతరులను అణిచివేయడం, వేలుపెట్టి చూపిస్తూ నిందించడం, మోసంగా మాట్లాడడం నువ్వు మానుకుంటే,
10 ఆకలితో అలమటించే వారికి నీకున్న దానిలోనుంచి ఇచ్చి, బాధితుల అవసరాలను తీర్చి వాళ్ళను తృప్తి పరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. నీ చీకటి నీకు మధ్యాహ్నం లాగా ఉంటుంది.
11 అప్పుడు యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన నీ ఆత్మను తృప్తిపరుస్తాడు.
నీ ఎముకలను బలపరుస్తాడు. నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉంటావు.
ఎన్నడూ ఆగని నీటి ఊటలాగా ఉంటావు.
12 పురాతన శిథిలాలను నీ ప్రజలు మళ్ళీ కడతారు. అనేక తరాల నుంచి పాడుగా ఉన్న పునాదులను నువ్వు మళ్ళీ వేస్తావు. నిన్ను “గోడ బాగుచేసేవాడు, నివాసాల కోసం వీధులు మరమ్మత్తు చేసేవాడు” అంటారు.
13 విశ్రాంతి దినాన ప్రయాణం చేయకుండా, నా ప్రతిష్ఠిత దినాన్ని నీ సొంత ఆహ్లాదం కోసం వాడకుండా ఉన్నావనుకో.
విశ్రాంతి దినాన్ని మనోహరమైనదిగా భావిస్తూ యెహోవాకు చెందిన విషయాలను పవిత్రంగా గౌరవంగా చేస్తున్నావనుకో.
నీ సొంత వ్యాపారం వదిలేసి విశ్రాంతి దినాన్ని సొంత ఆహ్లాదం కోసం వాడకుండా నీ సొంత మాటలు మాట్లాడకుండా గౌరవిస్తున్నావనుకో.
14 అప్పుడు నువ్వు యెహోవా పట్ల ఆనందిస్తావు. దేశంలో ఉన్నత స్థలాలమీద నేను నిన్ను ఎక్కిస్తాను.
నీ పూర్వీకుడు, యాకోబు స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించేలా చేస్తాను. యెహోవా తెలియచేసిన విషయాలు ఇవే.
59:1 యెహోవా హస్తం రక్షించలేనంత కురుచగా అయిపోలేదు. ఆయన చెవులు వినలేనంత నీరసం కాలేదు.
మీ అపరాధాలు మీకూ మీ దేవునికీ అడ్డంగా వచ్చాయి.
2 మీ పాపాలు ఆయన ముఖం మీకు కనబడకుండా చేశాయి. అందుచేత ఆయన వినడం లేదు.
3 మీ చేతులు రక్తంతో మీ వేళ్లు అపరాధాలతో మరకలయ్యాయి.
మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి. మీ నాలుక ద్వేషంతో మాటలాడుతున్నది.
4 ఎవడూ న్యాయంగా దావా వేయడం లేదు. ఎవడూ నిజాయితీతో తన వాదన వినిపించడం లేదు.
వాళ్ళు వట్టి మాటలను నమ్ముకుని అబద్ధాలు చెబుతారు. చెడును గర్భం ధరించి పాపాన్ని కంటారు.
5 వాళ్ళు విషసర్పాల గుడ్లను పొదుగుతారు. సాలెగూడు నేస్తారు.
ఆ గుడ్లు తినే వాళ్ళు చస్తారు. ఒకవేళ గుడ్డు పగిలితే విషసర్పం బయటికి వస్తుంది.
6 వారి సాలెగూళ్ళు బట్టలు నేయడానికి పనికిరావు. వాళ్ళు నేసిన దానితో ఎవరూ కప్పుకోలేరు.
వాళ్ళ పనులు పాపిష్టి పనులు. దుష్టక్రియలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి.
7 వారి కాళ్లు పాపం చేయడానికి పరుగెడుతున్నాయి. నిరపరాధుల రక్తాన్ని ఒలకపోయడానికి అవి త్వరపడుతున్నాయి.
వారి ఆలోచనలు పాపిష్టి ఆలోచనలు. వారి దారులు దుర్మార్గం, నాశనం.
8 శాంతి మార్గం వారికి తెలియదు. వారి నడతల్లో న్యాయం కనబడదు.
వాళ్ళు వంకరదారులు కల్పించుకున్నారు. ఆ దారుల్లో నడిచే వాళ్ళకు శాంతి కలగదు.
9 కాబట్టి న్యాయం మాకు దూరంగా ఉంది. నీతి మమ్మల్ని అందుకోవడం లేదు.
వెలుగుకోసం మేము కనిపెడుతూ ఉన్నాం గానీ అంతా చీకటిగానే ఉంది. కాంతి కోసం చూస్తూ ఉన్నాం, గానీ అంధకారంలోనే నడుస్తున్నాం.
10 గోడకోసం గుడ్డివారిలాగా, కళ్ళులేని వారిలాగా తడవులాడుతున్నాం.
మసక చీకటి అయినట్టు మధ్యాహ్నకాలంలో కాలుజారి పడుతున్నాము. బలవంతుల మధ్యలో మేము చచ్చిన వాళ్ళలాగా ఉన్నాం.
11 మేము ఎలుగుబంట్లలాగా గుర్రుమంటున్నాం. గువ్వలలాగా మూలుగుతున్నాం.
న్యాయం కోసం చూస్తున్నాం, గానీ అది దొరకడం లేదు. విడుదల కోసం చూస్తున్నాం గానీ అది మాకు దూరంగా ఉంది.
12 మా అక్రమాలన్నీ నీ ఎదుట ఉన్నాయి. మా పాపాలు మామీద సాక్ష్యం చెబుతున్నాయి.
మా అక్రమాలు మాకు కనబడుతున్నాయి. మా పాపాలు మాకు తెలుసు.
13 యెహోవాను తిరస్కరించి మన దేవుని నుంచి తొలగిపోయి తిరుగుబాటు చేశాం.
దుర్మార్గతనూ అవిధేయతనూ ప్రోత్సహించాం. అబద్ధాలూ సణుగులూ మనసులో కల్పించుకున్నాం.
14 న్యాయాన్ని వెనక్కి నెట్టేశాము. నీతి దూరంగా నిల్చుంది.
సత్యం నడివీధిలో పడి ఉంది. నిజాయితీ లోపలికి రాలేదు.
15 విశ్వసనీయత ఎటో పోయింది. దుర్మార్గాన్ని విసర్జించేవాడు దోపిడీకి గురి అవుతున్నాడు.
న్యాయం జరగకపోవడం చూసి యెహోవా ఎంతో బాధపడ్డాడు.