బారూకు గ్రంథపు చుట్టను మొదటిసారి చదవడం

క్రీ.పూ. 606

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యిర్మీయా 36:1–8

1 యూదా రాజు యోషీయా కొడుకు యెహోయాకీము పాలించిన నాలుగో సంవత్సరంలో యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా చెప్పాడు. 2 “నువ్వు ఒక పుస్తకం తీసుకుని నేను నీతో మాట్లాడిన రోజు మొదలుకుని, అంటే, యోషీయా కాలం మొదలుకుని ఈ రోజు వరకు ఇశ్రాయేలు, యూదా ప్రజల గురించీ, అన్ని జాతుల గురించీ నీతో పలికిన మాటలన్నీ దానిలో రాయి. 3 నేను యూదా ప్రజలకు చెయ్యాలని ఉద్దేశించిన కీడంతటి గురించి వాళ్ళు విని, నేను వాళ్ళ దోషం, వాళ్ళ పాపం క్షమించేలా తమ దుర్మార్గత విడిచి పశ్చాత్తాప పడతారేమో.”

4 యిర్మీయా నేరీయా కొడుకు బారూకును పిలిపించాడు. యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నీ యిర్మీయా చెప్తూ ఉండగా అతడు ఆ పుస్తకంలో రాశాడు. 5 తరువాత యిర్మీయా బారూకుకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. “నేను చెరసాలలో ఉన్నాను కాబట్టి యెహోవా మందిరానికి రాలేను. 6 కాబట్టి నువ్వు వెళ్లి, ఉపవాసదినాన యెహోవా మందిరంలో ప్రజలకు వినిపించేలా, నేను చెప్తూ ఉండగా నువ్వు పుస్తకంలో రాసిన యెహోవా మాటలు ప్రకటించు. తమ పట్టణాలనుంచి వచ్చే యూదా ప్రజలందరికీ వినిపించేలా వాటిని ప్రకటించు.

7 దయ చూపించమని వాళ్ళు చేసే అభ్యర్ధనలు ఒకవేళ యెహోవా దృష్టికి ఆమోదం అవుతాయేమో, ఒకవేళ వాళ్ళు తమ చెడుమార్గం విడిచిపెడతారేమో, ఎందుకంటే ఈ ప్రజల మీద యెహోవా ప్రకటించిన ఉగ్రత, మహాకోపం ఎంతో తీవ్రంగా ఉన్నాయి.” 8 కాబట్టి ప్రవక్త అయిన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు, నేరీయా కొడుకు బారూకు యెహోవా మాటలన్నీ, బిగ్గరగా యెహోవా మందిరంలో చదివి వినిపించాడు.

గ్రంథపు చుట్టను చదివిన తరువాత బారూకుకు ఓదార్పు

యిర్మీయా 45

1 ఇది యిర్మీయా ప్రవక్త నేరీయా కొడుకు బారూకుతో పలికిన మాట. యోషీయా కొడుకూ యూదా రాజూ అయిన యెహోయాకీము పరిపాలనలో నాలుగో సంవత్సరంలో ఇది జరిగింది. ఈ మాటలు యిర్మీయా చెప్తుండగా బారూకు రాశాడు. 2 “బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు ఇలా చెప్తున్నాడు. 3 ‘అయ్యో, నాకు ఎంత శ్రమ! యెహోవా నా బాధకి తోడు వేదనను జోడించాడు. మూలుగులతో అలసిపోయాను. నాకు విశ్రాంతి దొరకడం లేదు’ అని నువ్వు అనుకుంటున్నావు.

4 నువ్వు అతనికి ఈ విధంగా చెప్పాలి. ‘యెహోవా ఈ మాట చెప్తున్నాడు. చూడు, నేను కట్టిన దాన్ని నేనే కూలదోస్తున్నాను. నేను నాటిన దాన్ని నేనే పెకలించి వేస్తున్నాను. భూమి అంతటా ఇదే జరుగుతుంది. 5 కానీ నీ కోసం నువ్వు గొప్ప వాటిని కోరుకుంటున్నావా? గొప్ప వాటి కోసం చూడకు. ఎందుకంటే సర్వ మానవాళికీ వినాశనం కలుగబోతుంది.’ ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ‘కానీ నువ్వు వెళ్ళిన స్థలాలన్నిటిలో దోపిడీ సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణాన్ని నీకిస్తున్నాను.’”

చెర ప్రారంభం

2 రాజులు 24:1

1 యెహోయాకీము రోజుల్లో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చాడు. యెహోయాకీము అతనికి లోబడి మూడు సంవత్సరాలు సేవించిన తరువాత అతని మీద తిరుగుబాటు చేశాడు.

2 దినవృత్తాంతాలు 36:6–7

6 అతని మీదికి బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి అతణ్ణి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకుపోయాడు. 7 నెబుకద్నెజరు యెహోవా మందిరంలోని కొన్ని సామానులు తీసుకు పోయి బబులోనులో ఉన్న తన భవనంలో ఉంచాడు.

దానియేలు 1:1–7

1 యూదా రాజు యెహోయాకీము పరిపాలన మూడో సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించి దాన్ని కొల్లగొట్టాడు. 2 యెహోవా యూదా రాజు యెహోయాకీముపై విజయం ఇచ్చాడు. అతడు దేవుని మందిరంలోని పవిత్ర ఉపకరణాలను అతనికి అప్పగించాడు. అతడు ఆ వస్తువులన్నిటినీ బబులోను దేశానికి తన దేవుడి ఆలయానికి తీసుకువెళ్ళి ఆ పవిత్ర ఉపకరణాలను తన దేవుడి ఖజానాలో ఉంచాడు.

3 తరువాత రాజు తన దేశంలోని ముఖ్య అధికారి అష్పెనజుతో మాట్లాడాడు. బందీలుగా తెచ్చిన ఇశ్రాయేలు రాజు కుటుంబానికీ, రాజవంశాలకు చెంది, 4 ఎలాంటి లోపాలు లేకుండా అందం, తెలివితేటలు, జ్ఞాన వివేకాలు కలిగి ఉన్నవాళ్ళను తెమ్మని చెప్పాడు. అతడు వాళ్ళకు ప్రావీణ్యత కలిగేలా కల్దీయ భాష, సాహిత్యం నేర్పించాలి. 5 రాజు “వారికి ప్రతి రోజూ నేను తినే ఆహారం, తాగే ద్రాక్షారసం ఇవ్వండి. ఆ విధంగా మూడు సంవత్సరాలపాటు వాళ్ళకు శిక్షణ ఇచ్చిన తరువాత వారు నా కొలువులో సేవకులుగా ఉండాలి.”

6 బందీలుగా వెళ్ళిన యూదుల్లో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనే యువకులు ఉన్నారు. 7 నపుంసకుల అధికారి దానియేలుకు బెల్తెషాజరు అనీ, హనన్యాకు షద్రకు అనీ, మిషాయేలుకు మేషాకు అనీ, అజర్యాకు అబేద్నెగో అనీ పేర్లు మార్చాడు.

2 రాజులు 24:3–4

3 మనష్షే చేసిన పనుల కారణంగా, అతడు నిరపరాధులను హతం చేసిన కారణంగా, యూదావారు యెహోవా సముఖం నుంచి తొలగి పోయేలా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ వల్లే ఇది వాళ్లకు జరిగింది. 4 అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపిన కారణంగా, దాన్ని క్షమించడానికి యెహోవాకు మనస్సు లేకపోయింది.