అబ్షాలోము తిరుగుబాటు (continued)

క్రీ.పూ. 1027

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 సమూయేలు 16:1–14

1 దావీదు కొండ అంచుకు అవతల కొంచెం దూరం వెళ్లినప్పుడు మెఫీబోషెతు సేవకుడు సీబా కళ్ళకు గంతలు కట్టిబడి ఉన్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. గాడిదలపై 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, వంద అంజూర ఫలాలున్న కొమ్మలు, ఒక ద్రాక్షారసపు తిత్తి వేయబడి ఉన్నాయి. 2 రాజు “ఇవి ఎందుకు తెచ్చావు?” అని సీబాను అడిగాడు. అప్పుడు సీబా “రాజు పరివారం ఎక్కడానికి గాడిదలు, పనివారు తినడానికి రొట్టెలు, అంజూర ఫలాల కొమ్మలు, ఎడారిలో అలసిపోయిన వారు తాగడానికి ద్రాక్షారసం తెచ్చాను” అని చెప్పాడు.

3 అప్పుడు రాజు “నీ యజమాని కొడుకు ఎక్కడ ఉన్నాడు?” అని అడిగాడు. సీబా “అయ్యా, ఈరోజు ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యాన్ని తనకు తిరిగి ఇప్పిస్తారనుకుని అతడు యెరూషలేములో ఉండిపోయాడు” అని చెప్పాడు. 4 అప్పుడు రాజు “మెఫీబోషెతుకు కలిగినదంతా నీకే దక్కుతుంది” అని సీబాతో చెప్పినప్పుడు సీబా “నా ఏలికవైన రాజా, నాపై నీ కనికరం నిలిచి ఉంటుంది గాక. నీకు ఇవే నా నమస్కారాలు” అన్నాడు.

5 రాజైన దావీదు బహూరీము దగ్గర కు వచ్చినప్పుడు సౌలు కుటుంబానికి చెందిన గెరా కుమారుడు షిమీ అనేవాడు అక్కడికి వచ్చాడు. 6 అతడు దావీదు పక్కనే నడుస్తూ “నరహంతకుడా, దుర్మార్గుడా ఛీ పో, ఛీ పో. రాజ్యాధికారం కోసం నువ్వు తరిమివేసిన సౌలు కుటుంబంవారి ఉసురు యెహోవా నీపైకి రప్పించాడు. 7 నీ కుమారుడు అబ్షాలోము చేతికి యెహోవా రాజ్యాన్ని అప్పగించాడు. నువ్వు హంతకుడివి కాబట్టే ఈ మోసంలో చిక్కుకున్నావు” అని దుర్భాషలాడుతూ వచ్చాడు.

8 రాజైన దావీదు ఇరుపక్కలా ప్రజలు, బలాఢ్యులైన వారంతా ఉన్నప్పటికీ అతడు దావీదు మీదా, అతని సేవకుల మీదా రాళ్లు రువ్వాడు. 9 అప్పుడు సెరూయా కుమారుడు అబీషై “ఈ చచ్చిన కుక్క నా యజమానివి, రాజువు అయిన నిన్ను శపిస్తాడా? నాకు అనుమతి ఇవ్వు, నేను వాడి తల నరుకుతాను” అన్నాడు. 10 అందుకు రాజు “సెరూయా కొడుకుల్లారా, మీకు నామీద ఎందుకింత అభిమానం? దావీదును శపించమని యెహోవా అతనికి చెప్పి ఉన్నట్టయితే అతణ్ణి శపించయ్యండి. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగేవాళ్ళెవరు?” అని చెప్పాడు.

11 తరువాత అబీషైతో, తన సేవకులందరితో, ఇలా చెప్పాడు. “నా కడుపున పుట్టిన నా కొడుకే నన్ను చంపాలని చూస్తున్నప్పుడు ఈ బెన్యామీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యం ఏముంది? వాడి సంగతి వదిలిపెట్టండి. యెహోవా వాడికి సెలవిచ్చాడు, వాడిని తిట్టనివ్వండి. 12 యెహోవా నా బాధలను పట్టించుకుంటాడేమో, వాడు పెట్టిన శాపాలకు బదులు నాకు మేలు చేస్తాడేమో.” 13 తరువాత దావీదు, అతని మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. వారు వెళ్తుండగా షిమీ దావీదుకు ఎదురుగా కొండ పక్కనే నడుస్తూ అతని పైకి రాళ్లు రువ్వుతూ, దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు. 14 రాజు, అతనితో ఉన్నవారంతా బాగా అలసిపోయి ఉండడంవల్ల ఒక చోటికి వచ్చి అలసట తీర్చుకున్నారు.

కీర్తనలు 7

బెన్యామీనీయుడైన కూషు గురించి యెహోవాకు దావీదు కూర్చిన సంగీతం.

1 యెహోవా నా దేవా, నేను నీలో ఆశ్రయం పొందుతాను. నన్ను తరిమే వాళ్ళ నుంచి నన్ను రక్షించు. నన్ను విడిపించు.

2 లేకపోతే, వాళ్ళు సింహంలా నన్ను చీల్చేస్తారు. నాకు క్షేమం కలిగించడం ఎవరివల్లా కానంతగా నన్ను చీల్చివేస్తారు.

3 యెహోవా నా దేవా, నేను చేశానని నా శత్రువులు చెప్పిన పనులేవీ నేను చెయ్యలేదు. నా చేతుల్లో అన్యాయమేమీ లేదు.

4 నాతో శాంతిసమాధానాలతో ఉన్నవాళ్ళ పట్ల నేను ఏ తప్పూ చెయ్యలేదు. విచక్షణ లేకుండా నా విరోధులకు నేను ఏ హానీ చెయ్యలేదు.

5 నేను చెప్పేది సత్యం కాకపోతే నా శత్రువు నన్ను తరిమి పట్టుకుంటాడు గాక. బ్రతికి ఉన్న నా శరీరాన్ని తొక్కి, నేలరాసి దుమ్ములో అవమానకరమైన స్థితిలో నన్ను పడవేస్తాడు గాక. సెలా.

6 యెహోవా, కోపంతో లేచి రా, నా శత్రువుల ఆగ్రహానికి విరోధంగా నిలబడు. నా నిమిత్తం లేచి వచ్చి వాళ్ళ కోసం నువ్వు ఆజ్ఞాపించిన న్యాయ విధులను జరిగించు.

7 నీ చుట్టూ జాతులు సమాజంగా కూడి ఉన్నాయి. మరొకసారి నువ్వు వాళ్ళ మీద నీ న్యాయమైన స్థానాన్ని చేపట్టు.

8 యెహోవా, జాతులకు తీర్పు తీర్చు. నేను ఏ తప్పూ చెయ్యలేదు గనక, నేను న్యాయం జరిగించాను గనక, యెహోవా, మహోన్నతుడా, నా మాట నిజం చెయ్యి.

9 దుర్మార్గుల దుష్ట కార్యాలు అంతం అగు గాక. కానీ హృదయాలనూ, మనస్సులనూ పరిశీలించే న్యాయమూర్తివైన దేవా, న్యాయవంతులైన ప్రజలను స్థిరపరుచు.

10 హృదయంలో యథార్థంగా ఉన్న వాళ్ళను రక్షించే ఆ దేవుని దగ్గర నుంచే నా డాలు వస్తుంది.

11 దేవుడు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చే న్యాయమూర్తి. ఆయన ప్రతిరోజూ ఆగ్రహించే దేవుడు.

12 ఒకడు తన మనస్సు తిప్పుకోకపోతే, దేవుడు తన ఖడ్గానికి పదును పెట్టి, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తాడు.

13 అతని మీద ఉపయోగించడానికి ఆయుధాలు సిద్ధం చేస్తాడు. తన బాణాలను అగ్ని బాణాలుగా చేస్తాడు.

14 దుష్టత్వాన్ని గర్భం ధరించినవాడి సంగతి ఆలోచించండి. అతడు నాశనకరమైన ప్రణాళికలు రచిస్తూ, హానికరమైన అబద్ధాలకు జన్మనిస్తాడు.

15 వాడు గుంట తవ్వి, దాన్ని లోతు చేసి, తాను తవ్విన గుంటలో తానే పడిపోతాడు.

16 అతడు రచించిన నాశనకరమైన ప్రణాళికలు అతని తల మీదకే వస్తాయి. అతడు ఆలోచించిన హింస అతని తల మీదకే వచ్చిపడుతుంది.

17 యెహోవా న్యాయాన్నిబట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. సర్వోన్నతుడైన యెహోవాకు స్తుతి కీర్తన పాడతాను.

2 సమూయేలు 16:15–23

15 అబ్షాలోము, అహీతోపెలు, ఇశ్రాయేలువారంతా యెరూషలేము చేరుకున్నారు. 16 దావీదుతో స్నేహంగా ఉన్న అర్కీయుడు హూషై అనేవాడు అబ్షాలోము దగ్గరికి వచ్చాడు. అబ్షాలోమును చూసి “రాజు సదాకాలం జీవిస్తాడు గాక, రాజు సదాకాలం జీవిస్తాడు గాక” అని చెప్పాడు. 17 అప్పుడు అబ్షాలోము “నీ స్నేహితునికి నువ్వు చేసే ఉపకారమిదేనా? నీ స్నేహితునితో కలసి ఎందుకు వెళ్ళలేదు?” అని అడిగాడు. 18 హూషై “యెహోవా, ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులంతా ఎవరు రాజుగా ఉండాలని కోరుకుంటారో నేను అతని పక్షం వహిస్తాను. అతని దగ్గరే ఉంటాను. 19 నేనెవరికి సేవ చేయాలి? నీ తండ్రి కుమారుడికి నేను సేవ చేయాలి గదా. నీ తండ్రికి చేసినట్టు నీకు కూడా సేవ చేస్తాను” అని అబ్షాలోముతో చెప్పాడు.

20 తరువాత అబ్షాలోము అహీతోపెలును పిలిపించాడు. “మనం ఏ ఏ పనులు చెయ్యాలో ఆలోచిద్దాం” అన్నాడు. 21 అప్పుడు అహీతోపెలు “నీ తండ్రి బయలుదేరినప్పుడు ఇంటికి కాపలా ఉంచిన నీ తండ్రి ఉపపత్నులతో నువ్వు శయనించడం వల్ల నువ్వు నీ తండ్రికి మరింత అసహ్యుడవయ్యావని ఇశ్రాయేలీయులంతా తెలుసుకొంటారు. అప్పుడు నీ పక్షం వహించిన వారందరికీ ధైర్యం పెరుగుతుంది” అన్నాడు. 22 తరువాత వారు మేడపైన అబ్షాలోముకు గుడారం వేశారు. ఇశ్రాయేలీయులకందరికీ తెలిసేలా అతడు తన తండ్రి ఉపపత్నులతో లైంగికంగా కలిశాడు. 23 ఆ రోజుల్లో అహీతోపెలు ఏదైనా ఆలోచన చెప్పితే అది దేవుని దగ్గర విచారణ చేయగా వచ్చినట్టుగా ఉండేది. దావీదు, అబ్షాలోము కూడా అలాగే భావించేవారు.