చెరకు కారణమైన విగ్రహారాధనల దర్శనం (continued)

బబులోను చెరకు దారితీసిన విగ్రహారాధనల దర్శనం.

క్రీ.పూ. 594

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహెజ్కేలు 10:1–11:21

1 అప్పుడు నేను కెరూబుల తలలకి పైగా ఉన్న గుమ్మటం వైపుకి చూశాను. వాళ్లకి పైగా అది నీలమణిలా మెరుస్తూ కనిపించింది. అది ఒక సింహాసనం ఆకారంలో ఉంది. 2 అప్పుడు యెహోవా నార బట్టలు వేసుకున్న వ్యక్తితో ఇలా చెప్పాడు. “నువ్వు చక్రాల మధ్యకు, కెరూబుల కిందకు వెళ్ళు. కెరూబుల మధ్యలో ఉన్న నిప్పు కణికలతో రెండు చేతులూ నింపుకో. వాటిని పట్టణంలో వెదజల్లు.” నేను చూస్తుండగా ఆ వ్యక్తి వెళ్ళాడు.

3 అతడు లోపలికి వెళ్ళినప్పుడు కెరూబులు మందిరం కుడివైపున నిలబడి ఉన్నారు. లోపలి ఆవరణను మేఘం కమ్మివేసింది. 4 యెహోవా మహిమ తేజస్సు కెరూబుల పైనుండి పైకి వెళ్ళి మందిరం గడప దగ్గర నిలిచింది. దాంతో మేఘం మందిరాన్ని నింపివేసింది. ఆవరణ అంతా యెహోవా మహిమ తేజస్సుతో వెలిగి పోతూ ఉంది. 5 అప్పుడు బయట ఆవరణలో కెరూబుల రెక్కల చప్పుడు వినబడింది. అది సర్వశక్తిగల దేవుడు మాట్లాడినప్పుడు ఆయన స్వరంలా ఉంది.

6 అప్పుడు నార బట్టలు వేసుకున్న వ్యక్తిని ఇలా ఆదేశించాడు. “కెరూబుల మధ్యలో ఉన్న చక్రాల దగ్గర ఉన్న అగ్నిని తీసుకో.” అప్పుడు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి ఒక చక్రం పక్కనే నిలబడ్డాడు. 7 కెరూబుల్లో ఒకడు కెరూబుల మధ్య ఉన్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి నార బట్టలు వేసుకున్న వ్యక్తి చేతుల్లో ఉంచాడు. ఆ వ్యక్తి అగ్నిని చేతుల్లోకి తీసుకుని బయటకి వెళ్ళాడు. 8 అప్పుడే కెరూబుల రెక్కల కింద మనిషి హస్తం లాంటిది నాకు కనిపించింది.

9 నేను ఇంకా చూస్తూ ఉన్నాను. కెరూబుల దగ్గర నాలుగు చక్రాలున్నాయి. ఒక్కో కెరూబు దగ్గర ఒక్కో చక్రం ఉంది. ఆ చక్రాలు వైఢూర్యంతో చేసినట్టుగా ఉన్నాయి. 10 ఆ నాలుగు చక్రాలు ఒకే విధంగా ఉన్నాయి. అవి ఒక చక్రంలో మరో చక్రం అమర్చినట్టుగా ఉన్నాయి. 11 అవి కదులుతూ ఉన్నప్పుడు అన్ని వైపులకీ వెళ్తున్నట్టుంది. అవి ఏ పక్కకీ తిరగడం లేదు. అవి కెరూబుల ముఖాలు ఏ వైపుకి ఉన్నాయో ఆ వైపుకే వెళ్తున్నాయి. అవి పక్కకి తిరగకుండా ముందుకే వెళ్తున్నాయి.

12 ఆ నాలుగు కెరూబుల వీపులూ, చేతులూ, రెక్కలతో సహా వాటి శరీరమంతా కళ్ళు ఉన్నాయి. నాలుగు చక్రాలు కూడా కళ్ళతో చుట్టూ కప్పి ఉన్నాయి. 13 నేను వింటుండగా “చక్ర భ్రమణం” అని వాటిని పిలిచినట్టు విన్నాను. 14 ఒక్కో కెరూబుకీ నాలుగు ముఖాలున్నాయి. మొదటి ముఖం కెరూబులా ఉంది. రెండోది మనిషిలా ఉంది. మూడో ముఖం సింహంలా ఉంది. నాలుగోది డేగ ముఖంలా ఉంది.

15 అప్పుడు ఈ కెరూబులు పైకి లేచాయి. కెబారు నది దగ్గర నాకు కనబడిన జీవులు ఇవే. 16 కెరూబులు కదిలినప్పుడల్లా చక్రాలు కూడా వాటితోనే కదిలాయి. కెరూబులు భూమి పైనుండి ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు చక్రాలు తిరగలేదు. 17 కెరూబులు నిలిచిపోయినప్పుడు చక్రాలు కూడా నిలిచిపోయాయి. కెరూబులు లేచినప్పుడు చక్రాలు కూడా లేచాయి. ఎందుకంటే ఆ జీవుల ప్రాణం చక్రాల్లో ఉంది.

18 అప్పుడు యెహోవా మహిమ తేజస్సు మందిరం గడప నుండి లేచి కెరూబులకు పైగా వెళ్ళి ఆగింది. 19 కెరూబులు నేను చూస్తుండగా తమ రెక్కలు అల్లార్చి బయటకు వెళ్ళాయి. వాటితో పాటు చక్రాలు కూడా వాటి పక్కనే పైకి లేచాయి. అవి యెహోవా మందిరానికి తూర్పున ఉన్న ద్వారం దగ్గర నిలిచాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ తేజస్సు వాటికి పైగా వచ్చి నిలిచింది.

20 కెబారు నది దగ్గర ఇశ్రాయేలు ప్రజల దేవుని కింద నాకు కనబడిన జీవులు ఇవే. అవి కెరూబులని నేను తెలుసుకున్నాను! 21 ఒక్కో దానికి నాలుగు ముఖాలూ నాలుగు రెక్కలూ ఆ రెక్కల కింద మనిషి చేతుల్లాంటివీ ఉన్నాయి. 22 వాళ్ళ ముఖాలు కెబారు నది దగ్గర నాకు కలిగిన దర్శనంలో నేను చూసిన రూపాల్లాగే ఉన్నాయి. అవి అన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి.

11:1 ఆ తరువాత ఆత్మ నన్ను పైకి ఎత్తి యెహోవా మందిరానికి తూర్పున ఉన్న ద్వారం దగ్గరికి తీసుకు వచ్చాడు. ద్వారం దగ్గర వాకిట్లో ఇరవై ఐదు మంది నాకు కనిపించారు. వాళ్ళలో అజ్జూరు కొడుకు యజన్యా, బెనాయా కొడుకు పెలట్యా, ఇంకా ప్రజల నాయకులూ ఉన్నారు.

2 దేవుడు నాకిలా చెప్పాడు. “దురాలోచనలు చేస్తూ పట్టణంలో దుర్మార్గపు ఆలోచనలు చేసేది వీళ్ళే. 3 వాళ్ళిలా అంటున్నారు, ‘ఇల్లు కట్టడానికి ఇది సమయం కాదు. ఈ పట్టణం పాత్ర అయితే మనం దానిలో ఆహారం’ 4 కాబట్టి వాళ్లకి విరోధంగా ప్రవచనం పలుకు. నరపుత్రుడా, ప్రవచించు.”

5 ఆ తరువాత యెహోవా ఆత్మ నా పైకి వచ్చాడు. ఆయన నాకిలా చెప్పాడు. “నువ్వు ఇలా చెప్పు, యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు అలాగే ఆలోచిస్తున్నారు. మీ మనస్సుల్లోకి వచ్చే ఆలోచనలు నాకు తెలుసు. 6 ఈ పట్టణంలో మీ చేతుల్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య పెంచుతున్నారు. మీ వల్ల చనిపోయిన వాళ్ళతో పట్టణ వీధులు నిండిపోయాయి. 7 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు చంపి పట్టణంలో పడవేసిన శవాలే ఆహారం. ఈ పట్టణం వంట పాత్ర. కానీ మిమ్మల్ని మాత్రం పట్టణంలో ఉండకుండాా తీసివేస్తాను.

8 మీరు కత్తికి భయపడుతున్నారు. కాబట్టి మీ పైకి కత్తినే పంపుతాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

9 “నేను మిమ్మల్ని పట్టణంలో నుండి తీసివేస్తాను. మీకు శిక్ష విధిస్తాను. మిమ్మల్ని విదేశీయుల చేతులకు అప్పగిస్తాను. 10 మీరు కత్తి చేత కూలిపోతారు. ఇశ్రాయేలు సరిహద్దుల్లోనే మీకు తీర్పు తీర్చి శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.

11 ఈ పట్టణం మీకు వంటపాత్రగా ఉండదు. మీరు దానిలో ఆహారంగా ఉండరు. ఇశ్రాయేలు సరిహద్దుల్లోనే మీకు తీర్పు తీర్చి శిక్షిస్తాను. 12 అప్పుడు ఎవరి చట్టాలను అనుసరించి మీరు జీవించకుండా, ఎవరి శాసనాలను పాటించకుండా మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల శాసనాలను పాటించారో ఆ యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.”

13 నేను ఆ ప్రకారమే ప్రవచిస్తూ ఉండగా బెనాయా కొడుకైన పెలట్యా చచ్చిపోయాడు. దాంతో నేను సాష్టాంగపడి పెద్ద స్వరంతో “అయ్యో! ప్రభూ, యెహోవా, ఇశ్రాయేలులో మిగిలిన వాళ్ళని సమూలంగా నాశనం చేస్తావా?” అన్నాను.

14 అప్పుడు యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా అన్నాడు. 15 “నీ సోదరులను గూర్చీ నీ గోత్రం వాళ్ళను గూర్చీ ఇశ్రాయేలు ప్రజలందరిని గూర్చీ యెరూషలేము పట్టణవాసులు ‘మీరంతా యెహోవాకు చాలా దూరంగా ఉన్నారు. ఈ దేశాన్ని దేవుడు మాకు స్వాధీనం చేశాడు’ అని చెప్తున్నారు.”

16 కాబట్టి వాళ్ళకి ఇలా చెప్పు. “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, దూరంగా ఉన్న జాతుల్లోకి నేను వారిని తొలగించినా, ఇతర దేశాల్లోకి వాళ్ళని నేను చెదరగొట్టినా వాళ్ళు చెదరిపోయిన దేశాల్లో నేను వారికి కొంతకాలం పరిశుద్ద ఆలయంగా ఉంటాను” 17 కాబట్టి ఇలా చెప్పు “యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. నేను ఇతర జనాల మధ్యలో నుండి మిమ్మల్ని సమకూరుస్తాను. మీరు చెదిరిపోయిన దేశాలనుండి మిమ్మల్ని నేను సమీకరిస్తాను. మీకు తిరిగి ఇశ్రాయేలు దేశాన్ని ఇస్తాను 18 వారు అక్కడికి తిరిగి వస్తారు. వాళ్ళు ప్రతి అసహ్యమైన దాన్నీ నీచమైన దాన్నీ అక్కడనుండి తీసివేస్తారు.

19 వాళ్ళు నా దగ్గరకి వచ్చినప్పుడు వాళ్లకి ఏక హృదయాన్ని ఇస్తాను. వాళ్ళలో కొత్త ఆత్మను ఉంచుతాను. వాళ్ళ శరీరంలోనుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. 20 దానివల్ల వాళ్ళు నా చట్టాలను అనుసరిస్తారు. నా శాసనాలను పాటిస్తారు. అప్పుడు వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు. నేను వాళ్ళ దేవుడిగా ఉంటాను. 21 అయితే అసహ్యమైన వాటిపట్ల, నీచమైన వాటిపట్ల అనురక్తితో నడిచే వాళ్ళ విషయంలో వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని వాళ్ళు అనుభవించేలా చేస్తాను.” ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.